చైనాకు ఇదో సమాధానం
న్యూఢిల్లీ: మలబార్ విన్యాసాల పేరుతో అమెరికా, భారత్, జపాన్ల నావికాదళాలు నిర్వహిస్తున్న కసరత్తులు చైనాకు ఓ సమాధానమని అమెరికా కమాండర్ రియర్ అడ్మిరల్ విలియం బైర్న్ జూనియర్ అన్నారు. విన్యాసాలు జరుగుతున్న ఐఎన్ఎస్ జలశ్వలో మీడియాతో మాట్లాడుతూ.. ఐదు రోజుల పాటు జరిగే మలబార్ విన్యాసాలు మూడు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ విధానాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు.
యావత్ ప్రపంచానికి ఈ విన్యాసాలు ఒక సమాధానమని ఆయన అన్నారు. భారత్, చైనా, భూటాన్ల సరిహద్దుల్లోని ట్రైజంక్షన్లో వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో ఈ నావికాదళ విన్యాసాలు కీలక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే విన్యాసాలకు, ఉద్రిక్తతలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
ఏడాది ముందే వీటి నిర్వహణకు ప్రణాళిక రూపొందించామని భారత నావికాదళ అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర కొరియాతోనూ సమస్య కొనసాగుతున్న తరుణంలో వీటిని నిర్వహించడంపై అమెరికా కమాండర్ మాట్లాడుతూ ప్రపంచంలో అనేక ప్రమాదకరపరిస్థితులు ఏర్పడివున్నాయని కానీ వీటిని దృష్టిలో పెట్టుకొని నిర్వహించడం లేదని చెప్పారు.
ఈ విన్యాసాల్లో 95 యుద్ధవిమానాలు, 16 యుద్ధనౌకలు, 2 జలంతర్గాములు పాల్గొంటున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అమెరికా-భారత నావికాదళాలు ప్రతి ఏటా వీటిని నిర్వహిస్తున్నాయి. కొంతకాలం క్రితం జపాన్ కూడా చేరింది. ఎలాంటి విపత్కర పరిస్థితులనయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేందుకు వీలుగా విన్యాసాలను జరుపుతుంటారు.