Navodaya schools
-
‘నవోదయ’ ప్రశ్నపత్రంలో తప్పులు
కోడూరు: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పరీక్షలో తప్పులు దొర్లాయి. తెలుగు మాధ్యమం ప్రశ్నపత్రంలో నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో అనువాద, అన్వయ లోపాల కారణంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు మ్యాథ్స్ ప్రశ్నల్లో తెలుగు అనువాదం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తెలిసిన ప్రశ్నలే అయినప్పటికీ జవాబు గుర్తించేందుకు తికమకపడ్డారు. ప్రశ్నపత్రం ‘హెచ్’ కోడ్లో 48వ ప్రశ్న ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఏవి?’ అని ఉంది. అయితే ఈ ప్రశ్నకు ‘రెండు అంకెల సహజసిద్ధమైన అంకెలు ఎన్ని’ అని ఉంటే విద్యార్థులు సరైన సమాధానం గుర్తించేవారు. 47వ ప్రశ్న ‘ఒక అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని తప్పుగా ఇచ్చారు. అయితే.. ‘ఒక సంఖ్యలోని అంకెల మొత్తం నుంచి అంకె తీసివేయబడుతుంది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది’ అని ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 44వ ప్రశ్న.. ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది’ అని ఉంది. ఇది ‘నాలుగు అంకెల చిన్న సంఖ్య ఏ ప్రధానాంకాల గుణకం వల్ల వస్తుంది’ అని ఉండాలి. 42వ ప్రశ్న అనువాదం తప్పుగా ఉండడం వల్ల ఆ ప్రశ్న విద్యార్థులకు అర్థం కాలేదు. నవోదయ పరీక్షలో సీటు సాధించడానికి ప్రతి మార్కు ఎంతో విలువైనది కావడంతో విద్యార్థులు ఈ నాలుగు ప్రశ్నల వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కృష్ణా జిల్లా కోడూరు ఎంఈవో టి.వి.ఎం.రామదాసు, గణితం ఉపాధ్యాయులు రేపల్లె జయపద్ర, కో–ఆర్డినేటర్ మన్నె ప్రేమ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా తప్పులు ఉన్న 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నవోదయ విద్యాలయ సమితిని కోరారు. -
హవ్వా.. ఇంత అధ్వానమా
సాక్షి, పెదవేగి(పశ్చిమగోదావరి) : పైన పటారం..లోన లొటారం అన్న చందంగా ఉంది జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయం పరిస్థితి. ప్రసిద్ధి చెందిన పెదవేగిలోని ఈ విద్యాలయంలో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. బాత్రూమ్లు అధ్వానంగా ఉన్నాయి. తీవ్ర దుర్వాసన వస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన పిల్లలు పాఠశాలకు వెళ్లబోమని చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం ఏమిటని అడిగితే మరుగుదొడ్ల సమస్య దారుణంగా ఉందని చెబుతున్నారన్నారు. తాము స్వయంగా వెళ్లి చూస్తే పరిస్థితి పిల్లలు చెప్పిన దానికన్నా అధ్వానంగా ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఇలాంటి అపారిశుద్ధ్య వాతావరణంలో తమ పిల్లలు ఉంటే రోగాల బారినపడతారని వారంతా భయపడుతున్నారు. 560 మంది విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ అధీనంలోని జవహర్ నవోదయ పాఠశాలలో మొత్తం 560 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీనిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తక్షణమే స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరుతున్నారు. విద్యార్థులతో పనులు జవహర్ నవోదయ విద్యాలయంలో వసతులు, విద్య, అన్ని రంగాల్లో భేష్ అంటూ ఊదరగొట్టే యాజమాన్యం తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులతో పనులు చేస్తున్నారు. ట్యాంక్ మరమ్మత్తులో భాగంగా విద్యార్థులు ఐరన్ ఊసలు పట్టుకుని సిబ్బందికి సహకరిస్తున్న దృశ్యం సాక్షి కెమెరాకు చిక్కింది. తరగతి గదుల్లో ఉండాల్సి విద్యార్థులు ఇలా పనులు చేస్తూ కనిపించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్తో మాట్లాడి మరమ్మతులు చేయిస్తాం నవోదయ విద్యాలయంలో టాయిలెట్స్ అధ్వానంగా ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. నవోదయ కేంద్ర ప్రభుత్వ సంస్థ కావడంతో ప్రజలు అందులో సీటు కోసం ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తారు. కాని సదుపాయాలు ఇలా ఉన్నాయని తెలీదు. జిల్లా కలెక్టర్కు చెప్పి మరమ్మతులు చేపడతాం. – కోటగిరి శ్రీధర్, ఎంపీ, ఏలూరు సమస్య 10 రోజుల్లో పరిష్కరిస్తాం అన్ని పాఠశాలల్లో టాయిలెట్స్, బిల్డింగ్స్ మరమ్మతులు చేయించాలని విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు చేపడతున్నాం. కలెక్టర్ దగ్గర నుంచి అనుమతులు ఇప్పించి పది రోజుల్లో సమస్య పరిష్కరించేలా చూస్తాం. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు శాసనసభ్యుడు పనివాళ్లు దొరకడం లేదు విద్యాలయంలో మరుగుదొడ్లు బాలేని మాట వాస్తవమే. నూతన మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు కావాల్సి ఉంది. దానికి ఆరు నెలల సమయం పడుతుంది. మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి పనివాళ్లు దొరకడం లేదు. దాంతో సక్రమంగా శుభ్రం చేయించలేకపోతున్నాం. – డాక్టర్ వైఎస్ఎస్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్, నవోదయ విద్యాలయం -
‘నవోదయా’ల్లో త్వరలో ఓబీసీలకు కోటా!
న్యూఢిల్లీ: మానవ వనరుల అభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్వీ) ఓబీసీ విద్యార్థులకు కోటా కల్పించకలేకపోవడం పట్ల ఆ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుష్వాహా విస్మయం వ్యక్తంచేశారు. సమీప భవిష్యత్తులో దీనికి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 600 జేఎన్వీల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్తో కలిసి ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇలా వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
‘నవోదయ’= నాణ్యమైన విద్య
నవోదయ విద్యాలయ సమితి డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి గుంటూరు ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పిన నవోదయ విద్యాలయాలు నాణ్యమైన విద్యకు చిరునామాగా దేశంలోనే అగ్రస్థానంలో వెలుగొందుతున్నాయని నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ ప్రాంతీయ డిప్యూటీ కమిషనర్ ఏవై రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఓ హోటల్లో శుక్రవారం నవోదయ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏవై రెడ్డి మాట్లాడుతూ నవోదయ విద్యాలయాలు పాఠశాల స్థాయిలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలతో విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్నాయని చెప్పారు. నవోదయ విద్యాలయాలు ప్రతి జిల్లాలో పక్కా భవనాలు, మౌలిక వసతులు, యోగా, క్రీడలు, కంప్యూటర్, పోటీ పరీక్షల శిక్షణతో విద్యార్థుల సంపూర్ణ వికాసానాకి తోడ్పతున్నామని తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం అంకితభావంతో సేవలు అందిస్తున్నారని వివరించారు. ఫలితాల సాధనలో హైదరాబాద్ రీజియన్ జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. సమావేశంలో నవోదయ నేతృత్వ సంస్థ డైరెక్టర్ జంధ్యాల వెంకట రమణ, అసిస్టెంట్ కమిషనర్లు జి.అనసూయ, జగదీశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
నవోదయ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
బిజినేపల్లి: వట్టెం నవోదయ విద్యాలయంలో 2017–18 విద్యా సంవత్సరంలో 6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పి.సాయిసుబ్బారావు బుధవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం, సంబంధిత విద్యాధికారి కార్యాలయం నుంచి దరఖాస్తులు ఉచితంగా పొందవచ్చన్నారు. నవోదయ విద్యాలయ వెబ్సైట్ www.navodayahyd.org.in, www.navshq.org, www.jnvmbnr.org ద్వారా దరఖాస్తులు పొంది పూర్తిచేసి సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయంలో అందజేయాలని సూచించారు. పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 16వరకు అందించాలని తెలిపారు.