తప్పుడు వార్తలు రాస్తే.. పదేళ్లు జైలు!
కౌలాలంపూర్ : తప్పుడు వార్తలపై చర్యలకు మలేషియా ప్రభుత్వం ఉపక్రమించింది. నకిలీ వార్తలు రాసేవారికి, ప్రచారం చేసేవారికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా కొత్త చట్టం తీసుకురానుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. ఈ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ ఇప్పటికే తనపై అవినీతి ఆరోపణలు చేస్తోన్నవారిని టార్గెట్ చేశారు. ఆగస్టులో జరిగే ఎన్నికల్లో గెలుపోందడానికే రజాక్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ అంశంపై ప్రతిపక్ష ఎంపీ చార్లెస్ సాంటిగో మాట్లాడుతూ.. అసమ్మతిని అణచివేయడానికి ప్రభుత్వం అతిపెద్ద ఆయుధాన్ని వాడుతోందన్నారు.రాబోయే ఎన్నికల్లో నజీబ్ రజాక్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చ జరగకుండా ఉండేందుకే ఈ చట్టాన్ని తీసుకురానుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం ప్రజా భద్రత కోసమే తాము ఈ చట్టాన్ని తీసుకు రానున్నామని చెబుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది ఏ మాత్రం ఆటంకం కాబోదని పేర్కొంది.
ఈ చట్టాన్ని అనుసరించి తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్లు జైలు శిక్ష లేదా 5,00,000 రింగిట్లు(దాదాపు 84 లక్షల రూపాయలు) జరిమానా విధించనున్నారు. ఈ చట్టాన్ని బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఉల్లఘించినా, వారు మలేషియాలో శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ నివేదిక ప్రకారం ‘రిపోర్టర్స్ విత్ అవుట్ బార్డర్స్’ జాబితాలో మలేషియా 144వ స్థానంలో ఉంది.