NCTE Rules
-
టెట్ ఒకసారి రాస్తే చాలు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్టు–టెట్)ను ఇకపై అభ్యర్థులు ఒక్కసారి రాసి ఉత్తీర్ణులైతే చాలు.. స్కోరు పెంపునకు మినహా మళ్లీమళ్లీ రాయాల్సిన అవసరంలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) కొత్త నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టంచేశాయి. దీని ప్రకారం అభ్యర్థులు ఒకసారి ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే ఇక డీఎస్సీకి అర్హులైనట్లే. టెట్‌లో ఉత్తీర్ణత ధ్రువపత్రాల చెల్లుబాటును ఎన్సీటీఈ జీవితకాలానికి పెంచిన నేపథ్యంలో అభ్యర్థులకు ఈ వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఎన్సీటీఈ కొత్త నిబంధనల అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా టెట్‌ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 16 నుంచి టెట్–ఆగస్టు 2022కు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. జులై 16 వరకు వీటిని స్వీకరిస్తారు. గతంలోని టెట్‌లకు రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) రూపొందించిన సిలబస్‌ను అమలుచేయగా ఈసారి పూర్తిగా ఎన్సీటీఈ సిలబస్‌లోనే పరీక్షల నిర్వహణ జరగనుంది. వేర్వేరుగా టెట్ అర్హత నిబంధనలు టెట్ అర్హత నిబంధనలను రాష్ట్ర అధికారులు వెల్లడించారు. వాటి ప్రకారం.. ► ఉపాధ్యాయ అర్హత పరీక్ష నాలుగు పేపర్ల కింద (పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీ) నిర్వహించనున్నారు. ► 1–5 తరగతులకు సంబంధించి రెగ్యులర్ టీచర్లకు పేపర్–1ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పేపర్–1బీని అభ్యర్థులు రాయాలి. ► ఇక 6–8 తరగతుల రెగ్యులర్ టీచర్లకు పేపర్–2ఏ, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పేపర్–2బీ పరీక్షను రాయాలి. ► 2010 తరువాత ఇంటర్మీడియెట్ రాసిన అభ్యర్థులకు 50 శాతం మార్కులు తప్పనిసరి. ► అదే 2002 నుంచి 2010లోపు ఇంటర్మీడియెట్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వస్తే చాలు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది. ► ఇది కేవలం ఇంటర్–డీఈడీ అర్హతల వారికి మాత్రమే వర్తిస్తుంది. అదే డిగ్రీ–బీఈడీ చేసిన అభ్యర్థులకు మాత్రం డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందే. ► పేపర్–1ఏకు 8 రకాల క్వాలిఫికేషన్ అంశాలను కూడా ఏపీటెట్లో పొందుపరిచారు. ► ఇంటర్మీడియెట్, డీఎడ్, డిగ్రీ, పీజీ బీఈడీల కాంబినేషన్లలో ఈ అర్హతలున్న వారు టెట్‌ను రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ► అలాగే.. పేపర్–1బీకి 10 రకాల కాంబినేషన్లలో అర్హతలను టెట్‌లో ప్రకటించారు. ► పేపర్–2ఏ, పేపర్–2బీలలో కూడా వేర్వేరు అర్హతా ప్రమాణాలను పొందుపరిచారు. టెట్ అర్హత మార్కులు యథాతథం టెట్ అర్హత మార్కుల్లో ఎన్సీటీఈ మార్గదర్శకాల మేరకు గతంలోని నిబంధనలనే యథాతథంగా కొనసాగిస్తారు. జనరల్ కేటగిరీలోని వారికి 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ తదితర కేటగిరీల వారికి 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. వారినే టెట్‌లో ఉత్తీర్ణులుగా పరిగణిస్తారు. వీరికిచ్చే ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. ఆ తర్వాత మళ్లీ టెట్ రాసి అర్హత సాధించాల్సి వచ్చేది. అయితే, గత ఏడాదిలో ఎన్సీటీఈ ఈ నిబంధనను మార్చి టెట్ సర్టిఫికెట్ చెల్లుబాటును జీవితకాలానికి పెంచింది. దీంతో అభ్యర్థులు ఒకసారి ఈ పరీక్షలో అర్హత సాధిస్తే చాలు.. ఆ తదుపరి డీఎస్సీ ఎప్పుడు నిర్వహించినా దరఖాస్తు చేసేందుకు అర్హులే. అయితే, డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇస్తున్నందున అభ్యర్థులు టెట్‌లో పాల్గొని తమ స్కోరును పెంచుకోవచ్చు. ఆగస్టు 6 నుంచి పరీక్షలు.. సెప్టెంబర్ 14న ఫలితాలు ఇక టెట్ పరీక్షలను ఆగస్టు 6 నుంచి ప్రారంభించేలా పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 21 వరకు జరుగుతాయి. రోజుకు రెండు సెషన్లలో ఉ.9.30 నుంచి 12 వరకు, మ.2.30 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. తుది ఫలితాలను సెప్టెంబర్ 14న ప్రకటిస్తారు. -
మా సొసైటీలు.. మా ఇష్టం!
► ‘గురుకుల’ నియామకాల అంశంలో సొసైటీల ఇష్టారాజ్యం ► విద్యాశాఖను సంప్రదించకుండానే నిబంధనల రూపకల్పన ► వాటిని లోతుగా పరిశీలించకుండానే ఓకే చెప్పిన మంత్రులు ► ప్రభుత్వం నుంచి నియామక అర్హతలు, నిబంధనలపై ఉత్తర్వులు పొందకుండానే నోటిఫికేషన్ ► అడ్డగోలు నిబంధనలపై సర్వత్రా నిరసనలు ► అభాసుపాలైన ప్రభుత్వం.. ఆగిపోయిన దరఖాస్తుల ప్రక్రియ ► ఆందోళనలో ఉపాధ్యాయ అభ్యర్థులు సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో నియామకాల అంశంలో ఆయా సొసైటీలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. ‘నిబంధనలతో మాకేం పని.. విద్యాశాఖతో మాకేం సంబంధం.. మా సొసైటీలు, మా ఇష్టం..’అన్న తీరు కారణంగా గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. పెద్ద సంఖ్యలో (7,306) ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనా సొసైటీల తీరుతో ప్రభుత్వం విమర్శల పాలైంది. అధిక సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నపుడు అర్హతలు, నియామక నిబంధనలపై ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలన్న ఆలోచనను కూడా సొసైటీలు చేయకపోవడం, కనీసం చర్చించకపోవడం ఈ పరిస్థితికి కారణమైందని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సొసైటీల కార్యదర్శులే నిబంధనలు రూపొందించి తీర్మానం చేయగా.. మంత్రులు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఒకే చెప్పేశారు. దాని ప్రకారమే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అందులో ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్హతలను నిర్ణయించడం సర్వత్రా ఆందోళనకు కారణమైంది. చివరకు సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. దీంతో ముందుగానే అధికారులు ఆ నిబంధనలను పరిశీలించి ఉంటే ప్రభుత్వం బదనాం అయ్యే పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మేల్కోని సొసైటీలు! నియామకాల నిబంధనల విషయంలో గురుకుల సొసైటీలు ఇప్పటికీ మేల్కొనడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంగానీ, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్సీటీఈ వంటి సంస్థగానీ టీచర్ల నియామకాల కోసం ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చింది, ఏయే నిబంధనలను పాటించాలని చెప్పిందన్న విషయంలో సొసైటీలు పరిశీలన జరపడం లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనలు మార్చాలని సీఎం ఆదేశాలు ఇవ్వడంతో.. సంక్షేమ శాఖలు గత వారం విద్యాశాఖతో సంప్రదింపులు జరిపాయి. నిబంధనల గురించి అడిగి, తెలుసుకున్నాయి. అయితే రాత పూర్వకంగా కోరాలని, పూర్తి వివరాలు స్పష్టంగా అందజేస్తామని విద్యా శాఖ సూచించింది. కానీ దీనిపై ఇంతవరకు సంక్షేమ శాఖలు స్పందించలేదు. విద్యార్హతలు, నిబంధనలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఉత్తర్వులు పొందాలన్న విషయంలోనూ ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్సీటీఈ వెబ్సైట్లో మార్గదర్శకాలున్నా.. ఉపాధ్యాయ నియామకాల్లో పాటించాల్సిన నిబంధనలేమిటనేది విద్యాశాఖే చెప్పాల్సిన అవసరం లేదని.. ఎన్సీటీఈ వెబ్సైట్లో ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల విషయంలో ఎన్సీటీఈ మార్గదర్శకాలే ప్రామాణికమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసిందని పేర్కొంటున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా అర్హతలను నిర్ణయించారని చెబుతున్నారు. డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన విధించడం, డిగ్రీ–డీఎడ్ వారికి అవకాశం కల్పించకపోవడం, బీపీఈడీ చేసిన వారికి పీఈటీ పోస్టుల్లో అవకాశం కల్పించకపోవడం వంటి అంశాలపై ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైందని స్పష్టం చేస్తున్నారు. కావాలంటే సబ్జెక్టుల వారీగా, కాంబినేషన్ వారీగా అర్హత వివరాలను అందజేసేందుకు తాము సిద్ధమని.. ఇప్పటికైనా సంక్షేమ శాఖలు, గురుకుల సొసైటీల అధికారులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.