మా సొసైటీలు.. మా ఇష్టం!
► ‘గురుకుల’ నియామకాల అంశంలో
సొసైటీల ఇష్టారాజ్యం
► విద్యాశాఖను సంప్రదించకుండానే నిబంధనల రూపకల్పన
► వాటిని లోతుగా పరిశీలించకుండానే ఓకే చెప్పిన మంత్రులు
► ప్రభుత్వం నుంచి నియామక అర్హతలు,
నిబంధనలపై ఉత్తర్వులు పొందకుండానే నోటిఫికేషన్
► అడ్డగోలు నిబంధనలపై సర్వత్రా నిరసనలు
► అభాసుపాలైన ప్రభుత్వం.. ఆగిపోయిన దరఖాస్తుల ప్రక్రియ
► ఆందోళనలో ఉపాధ్యాయ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో నియామకాల అంశంలో ఆయా సొసైటీలు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా పరిణమించింది. ‘నిబంధనలతో మాకేం పని.. విద్యాశాఖతో మాకేం సంబంధం.. మా సొసైటీలు, మా ఇష్టం..’అన్న తీరు కారణంగా గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. పెద్ద సంఖ్యలో (7,306) ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైనా సొసైటీల తీరుతో ప్రభుత్వం విమర్శల పాలైంది. అధిక సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నపుడు అర్హతలు, నియామక నిబంధనలపై ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలన్న ఆలోచనను కూడా సొసైటీలు చేయకపోవడం, కనీసం చర్చించకపోవడం ఈ పరిస్థితికి కారణమైందని ప్రభుత్వ పెద్దలు అభిప్రాయానికి వచ్చారు.
ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సొసైటీల కార్యదర్శులే నిబంధనలు రూపొందించి తీర్మానం చేయగా.. మంత్రులు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఒకే చెప్పేశారు. దాని ప్రకారమే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే అందులో ఎన్‌సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా విద్యార్హతలను నిర్ణయించడం సర్వత్రా ఆందోళనకు కారణమైంది. చివరకు సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని నిబంధనల్లో మార్పులు చేయాలని ఆదేశించారు. దీంతో ముందుగానే అధికారులు ఆ నిబంధనలను పరిశీలించి ఉంటే ప్రభుత్వం బదనాం అయ్యే పరిస్థితి వచ్చేది కాదని ప్రభుత్వ పెద్దలు పేర్కొంటున్నారు.
ఇప్పటికీ మేల్కోని సొసైటీలు!
నియామకాల నిబంధనల విషయంలో గురుకుల సొసైటీలు ఇప్పటికీ మేల్కొనడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంగానీ, పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పడిన ఎన్‌సీటీఈ వంటి సంస్థగానీ టీచర్ల నియామకాల కోసం ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చింది, ఏయే నిబంధనలను పాటించాలని చెప్పిందన్న విషయంలో సొసైటీలు పరిశీలన జరపడం లేదని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. నిబంధనలు మార్చాలని సీఎం ఆదేశాలు ఇవ్వడంతో.. సంక్షేమ శాఖలు గత వారం విద్యాశాఖతో సంప్రదింపులు జరిపాయి. నిబంధనల గురించి అడిగి, తెలుసుకున్నాయి. అయితే రాత పూర్వకంగా కోరాలని, పూర్తి వివరాలు స్పష్టంగా అందజేస్తామని విద్యా శాఖ సూచించింది. కానీ దీనిపై ఇంతవరకు సంక్షేమ శాఖలు స్పందించలేదు. విద్యార్హతలు, నిబంధనలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి, ఉత్తర్వులు పొందాలన్న విషయంలోనూ ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలున్నా..
ఉపాధ్యాయ నియామకాల్లో పాటించాల్సిన నిబంధనలేమిటనేది విద్యాశాఖే చెప్పాల్సిన అవసరం లేదని.. ఎన్‌సీటీఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల విషయంలో ఎన్‌సీటీఈ మార్గదర్శకాలే ప్రామాణికమని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్పష్టం చేసిందని పేర్కొంటున్నారు. కానీ వాటిని పట్టించుకోకుండా అర్హతలను నిర్ణయించారని చెబుతున్నారు.
డిగ్రీ, పీజీల్లో 60 శాతం మార్కులు ఉండాలన్న నిబంధన విధించడం, డిగ్రీ–డీఎడ్ వారికి అవకాశం కల్పించకపోవడం, బీపీఈడీ చేసిన వారికి పీఈటీ పోస్టుల్లో అవకాశం కల్పించకపోవడం వంటి అంశాలపై ఉపాధ్యాయ అభ్యర్థులు, నిరుద్యోగుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైందని స్పష్టం చేస్తున్నారు. కావాలంటే సబ్జెక్టుల వారీగా, కాంబినేషన్ వారీగా అర్హత వివరాలను అందజేసేందుకు తాము సిద్ధమని.. ఇప్పటికైనా సంక్షేమ శాఖలు, గురుకుల సొసైటీల అధికారులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంటున్నారు. మరోవైపు నోటిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.