ఫెడ్ ప్రకటనతో జోరు తగ్గిన పసిడి
ముంబై : అమెరికా ఫెడ్ రిజర్వు జూన్ లో మరోమారు వడ్డీరేట్లను పెంచబోతోందనే సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టాయి. 30వేల స్థాయి నిలదొక్కుకునే ప్రయత్నంలో ఇటీవల విఫలమైన బంగారం ధర మరింత పతనమై 30వేల రూపాయల కిందికి దిగజారింది. ఫెడ్ ప్రకనటతో గురువారం బులియన్ మార్కెట్ లో పసిడి ధరల జోరుకు భారీ బ్రేక పడింది. సుమారు మూడువారాల దిగువకు పడిపోయాయి. 314 రూపాయల నష్టంతో పది గ్రాముల పసిడి ధర 29,741రూపాయలుగా నమోదైంది. వెండిధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇటీవల స్తాయిలో నిలదొక్కుకోవడంలో విఫలమైన పసిడి ఇపుడు మరింత వెలవెలబోతోంది.
అటు ఫెడ్ రిజర్వు వడ్డన తప్పదనే వార్తలతో డాలర్ దూసుకుపోతుండగా, ఆసియన్ మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. ఇక ఇతర విలువైన లోహాల సంగతి కొస్తే వెండి, పల్లాడియం స్వల్పంగా పెరగ్గా, ప్లాటినం ధరల్లో స్వల్ప క్షీణత నమోదైంది. అయితే పసిడి ధరల తగ్గుదలు పెట్టుబడిదారులు కొనుగోళ్లకు వినియోగించుకుంటారని గోల్డ్ ఫండ్ మేనేజర్ రిచర్డ్ అభిప్రాయపడ్డారు. ఫెడ్ నిర్ణయం ప్రపంచ బంగారం ధరలపై భారీ ప్రభావం చూపబోదని తెలిపారు.
కాగా బుధవారం జరిగిన ఫెడ్ సెంట్రల్ బ్యాంకు ఏప్రిల్ పాలసీ సమావేశం అనంతరం జూన్ లో వడ్డీరేట్ల పెంపుకు సిద్దంగా ఉన్నామని అధికారులు వ్యక్తం చేసినట్టు మినిట్స్ వెల్లడించింది. రెండో త్రైమాసికంలో అమెరికా ఆర్థికాభివృద్ధి మెరుగుపడిందని, ఉద్యోగావకాశాలు, ద్రవ్యోల్బణం పెరగిందని సంకేతాలు వచ్చాయి. దాదాపు 34శాతం ఫెడ్ జూన్ లో రేట్ల పెంపుకే అవకాశముందని ట్రేడర్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా దాదాపు పది సం.రాల తరువాత గత డిసెంబర్ లో ఫెడ్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచింది.