మగజాతి స్వాతంత్య్రం పోయింది
‘‘యువరానర్.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947 ఆగస్టు 15. కానీ, అదే స్వాతంత్య్రం మగజాతి కోల్పోయింది 1983 డిసెంబర్ 25.. నాలాంటి భార్యా బాధితులను రక్షించడానికి పైనుంచి వచ్చిన పరమాత్ముడిలా కనిపిస్తున్నావు రా’’ వంటి డైలాగులు ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’ సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. శరత్చంద్ర, నేహా దేశ్ పాండే జంటగా ఆమని, మధునందన్ ముఖ్య పాత్రల్లో రెట్టడి శ్రీనివాస్ దర్శకత్వంలో ఆలూరి సాంబశివరావు నిర్మించిన చిత్రం ‘ఐపిసి సెక్షన్.. భార్యాబంధు’.‘సేవ్ మెన్ ఫ్రమ్ ఉమెన్’ అన్నది ఉపశీర్షిక. నిర్మాత రాజ్ కందుకూరి, దర్శక–నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ట్రైలర్స్ విడుదల చేశారు. రెట్టడి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ వినూత్న కుటుంబ కథా చిత్రమిది. విజయ్ కురాకుల సంగీతం, మౌనశ్రీ మల్లిక్ సాహిత్యం హైలైట్’’ అన్నారు.‘‘సిని మా బాగా వచ్చింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ఆలూరి సాంబశివరావు. శరత్చంద్ర, విజయ్ కురాకుల, మౌనశ్రీ మల్లిక్ పాల్గొన్నారు.