‘ఫేస్ బుక్’పై నెటిజన్ల ఫైర్!
నెట్ న్యూట్రాలిటీపై కంపెనీ బోర్డు సభ్యుడి వివాదాస్పద ట్వీట్...
న్యూయార్క్: నెట్ న్యూట్రాలిటీపై ఫేస్బుక్ బోర్డు సభ్యుడు చేసిన ట్వీట్, దానిని దుమ్మెత్తిపోస్తూ నెటిజన్లు, ప్రత్యేకించి భారత నెటిజన్లు చేసిన రీట్వీట్స్తో ఆన్లైన్ అట్టుడికిపోయింది. వివక్షాపూరిత ఇంటర్నెట్ టారిఫ్‌ను అడ్డుకుంటూ.. నెట్ న్యూట్రాలిటీని పరిరక్షిస్తూ... టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై ఫేస్బుక్ తన అక్కసును ఇంకా వెళ్లగక్కుతోంది. ఈ విధానాన్ని ‘వలసవాద వ్యతిరేక’ భావజాలంగా ఫేస్ బుక్ బోర్డ్ మెంబర్ మార్క్ అండ్రీసేన్ ట్వీట్ చేశారు. మంచి అంశాలను సైతం ‘వలసవాద వ్యతిరేక’ భావజాలంతో తోసిపుచ్చడం సరికాదని అన్నారు. దేశ ప్రజలకు ఇలాంటి నిర్ణయాలు ఎంతమాత్రం దోహదపడవని పేర్కొన్న ఆయన, ఈ భావజాలం దేశాన్ని ఆర్థికంగా దశాబ్దాల పాటు వెనక్కు నెడతాయని అన్నారు.
దేశం బ్రిటిష్ పాలనలో ఉంటేనే మంచి నిర్ణయాలు వచ్చి ఉండేవని సైతం వ్యాఖ్యానించారు. అయితే దీనిపై నెటిజన్స్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తన ట్వీట్‌ను అండ్రీసేన్ ఉపసంహరించుకున్నారు. ఫేస్బుక్ ఫ్రీ బేసి క్స్‌ను కొందరు ఇంటర్నెట్ వలసవాదంగా సైతం అభివర్ణించారు. మరి కొందరు ఈస్ట్ ఇండియా కంపెనీ వలసవాదానికి ‘సరికొత్త కొనసాగింపుగా’ ఫేస్‌బుక్‌ను అభివర్ణించారు. తాజా పరిణామాలతో తన వ్యాఖ్యలను అన్నింటినీ వెనక్కితీసుకుంటున్నట్లు అండ్రీసేన్ ప్రకటించారు.
నేపథ్యం చూస్తే...
వెబ్సైటును బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చే యకూడదన్న నిబంధనలతో టెలికం ఆపరేటర్లు దారికి రాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తప్పవని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఇటీవల హెచ్చరించింది. అంతక్రితం నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్ .. డేటా సర్వీసులకు కంటెంట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం కుదరదని, అలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని నిబంధనలు విడుదల చేసింది. నెట్ న్యూట్రాలిటికీ మద్దతుగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జకర్బర్గ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. కొన్ని డేటా సర్వీసులను ఉచితంగా అందించే తమ వంటి సంస్థల పథకాలకు ఈ నిబంధనల వల్ల ఆంక్షలు, అడ్డం కులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.