గ్యాస్లీకై మంటలు.. నవవధువు సజీవ దహనం
క్రోసూరు: గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. క్రోసూరు మండల కేంద్రంలో గ్యాస్ లీకై చెలరేగిన మంటలకు ఓ నవ వధువు సజీవ దహనమైంది.
స్థానిక ఎస్టీ కాలనీలో వనపర్తి లావణ్య (19) ఆదివారం ఉదయం పాలు తీసుకొచ్చి టీ పెట్టుకునేందుకు గ్యాస్ స్టవ్ వెలిగించింది. గ్యాస్ లీకై మంటలు ప్రారంభం కాగా, ఆమె వెనక్కి పరుగు తీసింది. పూరి గుడిసె కావడంతో మంటలు మొత్తాన్ని చుట్టుముట్టాయి. బయటకు రాలేక లోపలే సజీవ దహనమైంది. ఆ సమయంలో ఆమె భర్త మస్తాన్ బయటకు వెళ్లడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ ఘటనలో మొత్తం నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.