new bus service
-
617 కొత్త బస్సులకు ఆర్టీసీ రైట్‌రైట్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) కొత్త బస్సులకు రైట్‌రైట్ చెబుతోంది. దశాబ్దంగా పాత బస్సులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు పచ్చజెండా ఊపింది. అందుకోసం రూ.250 కోట్లతో 617 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దశాబ్దంగా కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో ఆర్టీసీ పాత బస్సులతోనే సతమతమవుతోంది. ఆర్టీసీలోని 2,925 బస్సులు 12 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించాయి. అయినా పదేళ్లుగా కొత్త బస్సుల కొనుగోలుకు గత ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సాహసించలేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో ఉద్యోగుల జీతాల భారం ఏటా దాదాపు రూ.3,600 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది. ఆర్టీసీ వ్యయంలో దాదాపు 40 శాతం జీతాల చెల్లింపునకే వెచ్చించాల్సి వచ్చేది. రెండేళ్లుగా ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుండటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కుదుటపడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమించింది. అందులో భాగంగానే కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనలను సూత్రప్రాయంగా ఆమోదించింది. సుఖమైన ప్రయాణమే లక్ష్యం ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రయాణికుల ఆదరణ, ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన బస్సులను కూడా ప్రవేశపెడుతున్నాం. అందుకే ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రాగానే కొత్త బస్సులను కొనుగోలు చేస్తాం. – సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఆర్టీసీ ఎండీ దశలవారీగా ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఇలా ఉంది.. ► తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో నడిపే సప్తగిరి సర్వీసుల కోసం కొత్తగా 152 ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఎందుకంటే ఘాట్ రోడ్డులో అద్దె ప్రాతిపదికన కాకుండా ఆర్టీసీ సొంత బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. అందుకోసం ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.54.72 కోట్లు వెచ్చించనుంది. ► రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య పట్టణాలను అనుసంధానించే సర్వీసుల కోసం 465 బస్సులను కొనుగోలు చేయనున్నారు. వాటిలో డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సులు 3, ఇంద్ర ఏసీ బస్సులు 8, సూపర్ లగ్జరీ బస్సులు 372, అల్ట్రా డీలక్స్ బస్సులు 82 ఉన్నాయి. ఇందుకోసం ఆర్టీసీ మొత్తం రూ.194.82 కోట్లు ఖర్చు చేయనుంది. సప్తగిరి, ఇతర బస్సులు కలిపి మొత్తం 617 బస్సుల కోసం ఆర్టీసీ మొత్తం రూ.250 కోట్లు వెచ్చించనుంది. ► అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను దశలవారీగా ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొదటి విడత టెండర్లు తుదిదశకు చేరుకున్నాయి. రెండోదశ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. ► ప్రయాణికులను మరింతగా ఆకట్టుకునే దిశగా ఆర్టీసీ కొత్త సర్వీసులను తొలిసారిగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఇప్పటివరకు నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టలేదు. కానీ దూరప్రాంత సర్వీసులకు ప్రైవేటు ట్రావెల్స్ నాన్ ఏసీ బస్సులను నిర్వహిస్తున్నాయి. రైళ్లలో స్లీపర్ క్లాస్ తరహాలో ఉండే ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి స్పందన లభిస్తోంది. ఏసీ బస్సుల కంటే టికెట్ రేట్లు తక్కువగా కూడా ఉండటంతో ఈ బస్సులకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఒక్కో బస్సులో 30 బెర్త్‌లు ఉండే నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో 40 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దశలవారీగా బస్సు సర్వీసులను పెంచాలన్నది ఆర్టీసీ ఉద్దేశంగా ఉంది. -
ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు
- ఆర్టీసీ హైదరాబాద్ ఈడీ జయరావు - మహేశ్వరం డిపోలో కొత్త బస్సు సర్వీసులు ప్రారంభం మహేశ్వరం: ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే ఆర్టీసీ లక్ష్యమని గ్రేటర్ హైదరాబాద్ జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరాజ్ పేర్కొన్నారు. మహేశ్వరం ఆర్టీసీ డిపోలోని 9 కొత్త బస్సులను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగాగా మాట్లాడుతూ... ప్రతి గ్రామం, గిరిజన తండాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అం దించేందుకు కృషి చేస్తామని అన్నారు. డిపో ప్రారంభించినప్పటి నుంచి పెట్రోల్ బంక్ లేక పోవడంతో బస్సులు నడపడానికి కొంత ఆలస్యం జరిగిందన్నారు. మొన్నటివరకు మిథాని డిపో నుంచి బస్సు సర్వీసులు నడిచేవని, ఇక నుంచి నేరుగా మహేశ్వరం డిపో నుంచే నడుస్తాయన్నారు. కల్వకోల్, సిద్దాపూర్, బాచుపల్లి, కొత్తపేట్, పెద్దమ్మతండా, తిమ్మాపూర్, మురళీనగర్, అన్నోజి గూడ, అమీర్‌పేట్ గ్రామాలకు కొత్త సర్వీసులను ప్రారంభించారు. త్వరలో మరిన్ని సర్వీసులను పెంచుతామని చెప్పారు. కార్యక్రమంలో హైదరాబాద్ రీజినల్ మేనేజర్ జయరావు, డీవీఎం సూర్యకిరణ్, ఎంపీపీ పెంటమల్ల స్నేహ, జేడ్పీటీసీ సభ్యుడు నేనావత్ ఈశ్వర్ నాయక్, వైస్ ఎంపీపీ మునగపాటి నవీన్, సర్పంచ్ ఆనందం, ఉప సర్పంచ్ రాములు, ఎంపీటీసీ సభ్యులు బంగరిగళ్ల ప్రేమలత, బుజ్జి భద్రునాయక్, డిపో మేనేజర్ పవిత్ర, ట్రాఫిక్ ఇన్చార్జిలు బి.ప్రభాకర్, శివరంజన్ పాల్గొన్నారు. -
కడప, కర్నూలుకు రైట్...రైట్
విశాఖపట్నం: కడప, కర్నూలుకు ఆర్టీసీ రెండు కొత్త బస్సు సర్వీసులను ప్రవేశపెట్టింది. జీవీఎంసీ కమిషనర్ ఎం.వి.సత్యనారాయణ గురువారం జెండా ఊపి ఈ సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఈడీ ఎ.రామకృష్ణ మాట్లాడుతూ ఇప్పటివరకు విశాఖ నుంచి నేరుగా కడప, కర్నూలుకు బస్సు సర్వీసులు లేకపోవడంతో వీటిని ప్రవేశపెట్టామన్నారు. రోజూ విశాఖ నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి రాజమండ్రి, నందికొట్కూరు మీదుగా మర్నాడు ఉదయం 7.45 గంటలకు కర్నూలు చేరుకుంటుందన్నారు. అదే రోజు సాయంత్రం తిరిగి 4 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం7.30 గంటలకు విశాఖ చేరుతుందన్నారు. రోజూ విశాఖలో 3.30 గంటలకు బయల్దేరి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మార్కాపురం, కంబం, పోరుమామిళ్ళ మీదుగా మర్నాడు ఉద యం 7గంటలకు కడప చేరుకుంటుందని, తిరిగి అదేరోజు సాయంత్రం 4.30కు బయల్దేరి మర్నాడు ఉదయం 7.30 గంటలకు విశాఖ చేరుతుందని వివరించారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వై.జగదీష్‌బాబు, డెప్యూటీ సీటీఎం (అర్బన్) ఎ.వీరయ్యచౌదరి, డెప్యూటీ సీటీఎం (రూరల్) పి.జీవన్‌ప్రసాద్ పాల్గొన్నారు.