సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజారవాణా విభాగం (ఆర్టీసీ) కొత్త బస్సులకు రైట్‌రైట్ చెబుతోంది. దశాబ్దంగా పాత బస్సులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు పచ్చజెండా ఊపింది. అందుకోసం రూ.250 కోట్లతో 617 బస్సులను కొనుగోలు చేయడంతోపాటు అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను ప్రవేశపెట్టేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. దశాబ్దంగా కొత్త బస్సులు కొనుగోలు చేయకపోవడంతో ఆర్టీసీ పాత బస్సులతోనే సతమతమవుతోంది. ఆర్టీసీలోని 2,925 బస్సులు 12 లక్షల కంటే ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించాయి. అయినా పదేళ్లుగా కొత్త బస్సుల కొనుగోలుకు గత ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు.
అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు సాహసించలేకపోయింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో ఉద్యోగుల జీతాల భారం ఏటా దాదాపు రూ.3,600 కోట్లను ప్రభుత్వం భరిస్తోంది. ఆర్టీసీ వ్యయంలో దాదాపు 40 శాతం జీతాల చెల్లింపునకే వెచ్చించాల్సి వచ్చేది. రెండేళ్లుగా ఆ భారాన్ని ప్రభుత్వం భరిస్తుండటంతో ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి కుదుటపడుతోంది. దీంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు ఉపక్రమించింది. అందులో భాగంగానే కొత్త బస్సుల కొనుగోలు ప్రతిపాదనలను సూత్రప్రాయంగా ఆమోదించింది.
సుఖమైన ప్రయాణమే లక్ష్యం
ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రయాణికుల ఆదరణ, ట్రెండ్‌కు అనుగుణంగా అధునాతన బస్సులను కూడా ప్రవేశపెడుతున్నాం. అందుకే ఆర్టీసీలో కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి తుది ఆమోదం రాగానే కొత్త బస్సులను కొనుగోలు చేస్తాం.
– సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఆర్టీసీ ఎండీ
దశలవారీగా ఆర్టీసీలో కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ ప్రణాళిక ఇలా ఉంది..
► తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో నడిపే సప్తగిరి సర్వీసుల కోసం కొత్తగా 152 ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేయనున్నారు. ఎందుకంటే ఘాట్ రోడ్డులో అద్దె ప్రాతిపదికన కాకుండా ఆర్టీసీ సొంత బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. అందుకోసం ఒక్కో బస్సుకు రూ.36 లక్షల చొప్పున మొత్తం రూ.54.72 కోట్లు వెచ్చించనుంది.
► రాష్ట్రంలో జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య పట్టణాలను అనుసంధానించే సర్వీసుల కోసం 465 బస్సులను కొనుగోలు చేయనున్నారు. వాటిలో డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్సులు 3, ఇంద్ర ఏసీ బస్సులు 8, సూపర్ లగ్జరీ బస్సులు 372, అల్ట్రా డీలక్స్ బస్సులు 82 ఉన్నాయి. ఇందుకోసం ఆర్టీసీ మొత్తం రూ.194.82 కోట్లు ఖర్చు చేయనుంది. సప్తగిరి, ఇతర బస్సులు కలిపి మొత్తం 617 బస్సుల కోసం ఆర్టీసీ మొత్తం రూ.250 కోట్లు వెచ్చించనుంది.
► అద్దె ప్రాతిపదికన 2,307 బస్సులను దశలవారీగా ఆర్టీసీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ఇప్పటికే మొదటి విడత టెండర్లు తుదిదశకు చేరుకున్నాయి. రెండోదశ టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది.
► ప్రయాణికులను మరింతగా ఆకట్టుకునే దిశగా ఆర్టీసీ కొత్త సర్వీసులను తొలిసారిగా ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీలు ఇప్పటివరకు నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టలేదు. కానీ దూరప్రాంత సర్వీసులకు ప్రైవేటు ట్రావెల్స్ నాన్ ఏసీ బస్సులను నిర్వహిస్తున్నాయి. రైళ్లలో స్లీపర్ క్లాస్ తరహాలో ఉండే ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రయాణికుల నుంచి స్పందన లభిస్తోంది.
ఏసీ బస్సుల కంటే టికెట్ రేట్లు తక్కువగా కూడా ఉండటంతో ఈ బస్సులకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రయాణికులు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఒక్కో బస్సులో 30 బెర్త్‌లు ఉండే నాన్ ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. మొదటి దశలో 40 బస్సులను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం దశలవారీగా బస్సు సర్వీసులను పెంచాలన్నది ఆర్టీసీ ఉద్దేశంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment