New educational policy
-
22లోగా 2వ దశ స్కూళ్ల మ్యాపింగ్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల మ్యాపింగ్ రెండో దశను ఈనెల 22వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యా శాఖాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు పాఠశాల విద్యా శాఖ సర్క్యులర్ జారీ చేసింది. నూతన విద్యా విధానం ప్రకారం పాఠశాల విద్యలో ఫౌండేషన్ విద్యా విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని హైస్కూళ్లలో కలుపుతున్నారు. మొదటి దశలో ఒక కిలోమీటర్ పరిధిలో ఉన్న స్కూళ్ల మ్యాపింగ్ పూర్తయినందున అదే తరహాలో 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల పరిధిలోనివి, ఆపైబడి ఉన్న దూరంలోని స్కూళ్ల మ్యాపింగ్ చేపట్టాలని పాఠశాల విద్యా శాఖ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. స్కూళ్లు, విద్యార్థుల సంఖ్య, టీచర్లు, మౌలిక సదుపాయాల వివరాలు, ప్రత్యామ్నాయాలపై కసరత్తు చేయాలని సూచించింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూళ్లను సమీపంలోని హైస్కూళ్ల హెడ్మాస్టర్ లాగిన్ ద్వారా మ్యాపింగ్ చేయాలని పేర్కొంది. సహజసిద్ధమైన అడ్డంకుల వల్ల మ్యాపింగ్‌కు వీలుకాని వాటికి కారణాలను స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది. ప్రభుత్వ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలలను మ్యాపింగ్ చేసేటప్పుడు ఏ యాజమాన్య స్కూలునైనా పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించింది. ఎయిడెడ్, రెసిడెన్షియల్ స్కూళ్లను మాత్రం దీని నుంచి మినహాయించింది. దూరాన్ని వాస్తవిక రోడ్ కనెక్టివిటీ ఆధారంగా చూడాలని, స్ట్రయిట్ లైన్లు, ఏరియల్ వ్యూ ఆధారంగా చేయవద్దని స్పష్టం చేసింది. ఉర్దూ, ఒడియా, తమిళ్, కన్నడ మాధ్యమ స్కూళ్లను అవే మీడియం స్కూళ్లకు మ్యాపింగ్ చేయాలంది. సమానమైన దూరంలో రెండు హైస్కూళ్లు ఉంటే మౌలిక సదుపాయాలు ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకోవాలని తెలిపింది. మూడు కిలోమీటర్ల పరిధిలో హైస్కూళ్లు లేని ప్రాంతాల్లోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను అనుసరించి అప్‌గ్రేడ్ చేయాలని పేర్కొంది. టీచర్లకు సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలు తరువాత విడుదల చేస్తామని చెప్పింది. 2024–25 నాటికి సింగిల్ మీడియం స్కూళ్లు 2024–25 నాటికి సింగిల్ మీడియం స్కూళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2022–23లో 9, 10 తరగతుల్లో మాత్రమే డ్యూయల్ మీడియం ఉండాలని పేర్కొంది. 2023–24లో టెన్త్‌లో మాత్రమే డ్యూయల్ మీడియం ఉండాలని స్పష్టం చేసింది. ఆయా స్కూళ్లలోని సబ్జెక్టు టీచర్ల స్టాఫ్ ప్యాట్రన్‌ను కూడా ఈ సర్క్యులర్‌లో పొందుపరిచారు. -
3,5,8,10 తరగతులకే పరీక్షలు
సాక్షి, తాడేపల్లి: కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మన ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న మెజారిటీ అంశాలు దానిలో ఉన్నాయన్నారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. మంగళవారం ఆయన సాక్షి టీవీతో మాట్లాడుతూ.. ‘ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని మనం ముందుగానే నిర్ణయం తీసుకున్నాం. కొత్త పాలసీ ప్రకారం ప్రీ ప్రైమరీ అంగన్వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఓ ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించాం. పీపీ1, పీపీ2 తో పాటు మరొక ఏడాది పెంచుతున్నాం’ అన్నారు. (చదవండి: స్కూల్స్ ఓపెన్‌కు ఏపీ సర్కార్ కసరత్తు) అంతేకాక ‘హై స్కూల్ లెవెల్లో 3, 5, 8 తరగతుల్లోనే పరీక్షలు ఉంటాయి. అవి కేవలం వారి సామర్ధ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే.10 తరగతిలో బోర్డు పరీక్షలు యథావిధిగా ఉంటాయి. ఉన్నత విద్య కూడా నైపుణ్యంతో ఉండేలా చర్యలు చేపట్టాం. మన రాష్ట్రంలో చదువుకునే విద్యార్థులు అన్ని విధాలా సమర్థంగా ఉండేలా తీర్చి దిద్దుతాం’ అని సురేష్ స్పష్టం చేశారు. అంతేకాక టీచర్ ఎడ్యుకేషన్‌లో నాణ్యత పాటించని బీఈడీ కళాశాలలపై ఉక్కుపాదం మోపాలని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. సరైన సదుపాయాలు, టీచింగ్ ఫ్యాకల్టీ లేని కాలేజీలపై చర్యలు ఉంటాయని సురేష్ హెచ్చరించారు. -
ఇది వేకువ తెచ్చే వేగుచుక్కేనా?
నాగరికత క్రమంలో... ప్రపంచం విజ్ఞానం కోసం వెతుకులాడుతున్నపుడు విశ్వవిద్యా లయ బోధనా పద్ధతులు ఆవిష్కరించి, సంస్థల్ని దిగ్విజయంగా నడిపిన నేల భారత దేశం. ఎన్నో దేశాల వారిక్కడికి వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు, స్నాతకోత్తర డిగ్రీలు పొందిన చరిత్ర. సంవత్సరాల తరబడి ప్రపంచంలో మేటి విద్యాసంస్థలుగా ఐఐటీలను నిలిపిన నాణ్యత మనది. ప్రమాణాల విద్యా సంస్థలే లేని దురవస్థకు నేడు దిగజారిపోయాం. చివరకు ప్రపంచ వ్యాప్తంగా వంద ఉత్తమ విద్యా సంస్థల్ని ఎవరు ఎంపిక చేసినా, మనది చోటే దక్కని దుస్థితి! ఎక్కడో దారి తప్పాం! పాఠశాల, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయిల్లో.. మధ్య లోనే విద్య మానేస్తున్న వారి సంఖ్య అపారం. ప్రమాణాలు దిగజారి బడిచదువులు గుడ్డిదీపాలయ్యాయి. కాలేజీ చదువులు కాలక్షేపానిక య్యాయి. కడకు కూడైనా పెట్టలేని అలంకారపు విద్యలుగా మిగులు తున్నాయి మన డిగ్రీలు! ఎంతోకాలం వృత్తి విద్యలకు వన్నెలద్దిన కోర్సులన్నీ ఇప్పుడు మరుగునపడ్డాయి. నైపుణ్యాలను తీర్చిదిద్దే శిక్షణ నేడు కరువైంది. వేల సంవత్సరాలు వారసత్వంగా వస్తున్న అనువంశిక జ్ఞానం ఆదరణ లేక కనుమరుగవుతోంది. కాలం చెల్లిన విద్యావిధా నాలు ఒకవైపు, శరవేగంగా వస్తున్న సామాజిక మార్పులు–డిమాండ్లు మరోవైపు, ఫలితంగా ‘చదువుకున్న యువత’ చతికిలపడుతున్నారు. పునాది సరిగాలేని అత్తెసరు చదువులతో నైపుణ్యాల కొరతే కాదు విలువల లేమి రాజ్యమేలుతోంది. దీనికి విరుగుడుగా విద్యావిధా నంలో సమూల మార్పులు రావాలనేది సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో ఓ డిమాండ్! దానికి జవాబుగా కేంద్ర మంత్రి వర్గం నూతన ‘జాతీయ విద్యా విధానాని’కి పది రోజుల కింద ఆమోదం తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల పాటు దాదాపు ఇదే అనుసరణీయం! అంతకు ముందు, సుదీర్ఘకాలంగా విభిన్న వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాద నలు, పలు స్థాయిల్లో చర్చోపచర్చలు, మార్పు చేర్పుల తర్వాత వచ్చిందే ఈ స్థూలవిధానం. ఇది ఇలాగే యథాతథం అమలవదు. పలు అంశాల అమలుకుగాను పార్ల మెంటులో, రాష్ట్ర అసెంబ్లీల్లో ఏర్పడే చట్టాల మద్దతు కావాలి. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్ పట్టా వరకు, వివిధ స్థాయిల్లో సంస్క రణలతో మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానం మంచి–చెడులపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ నేతృత్వపు కాంగ్రెస్ ప్రభుత్వం 1986లో తెచ్చిన విద్యావిధానం (34 ఏళ్ల) తర్వాత కొత్త విధానం రావడం ఇదే! బడి చదువుల క్రమతనే మార్చారు! మారిన పరిస్థితుల్లో బాల్యం నుంచే విద్యాభద్రతకు గాను, ఇదివరకటి 10+2 సంవత్సరాల పద్ధతికి బదులు 5+3+3+4 పద్ధతి ప్రతిపాదిం చారు. ఇంటర్మీడియట్ లేకుండా 12 గ్రేడ్ వరకు ఇక పాఠశాల చదువే! ఇదివరకటి ప్రాథమిక విద్య ఆరంభం కన్నా ముందు మూడేళ్ల (3–6 ఏళ్ల వయస్కుల కోసం) నుంచే పిల్లలకు విద్యాభద్రత లభించేలా చూస్తారు. ఫలితంగా ఇదివరకు హామీ ఇచ్చినట్టు 6–14 సంవత్సరాల మధ్య వయస్కుల నిర్బంధ విద్య, ఇక ఇప్పుడు 3–18గా మారు తుంది. అంటే ఇకపై పాఠశాలవిద్యలో క్రమంగా, మూడేళ్ల పూర్వ ప్రాథమిక విద్యాబోధనను కలుపుకొని ఒకటి, రెండు గ్రేడ్లతో అయి దేళ్ల ‘పునాది దశ’ (3–8 వయస్కులకు) ఉంటుంది. మూడు, నాలుగు, అయిదు గ్రేడ్లతో ‘సన్నాహక దశ’ (8–11 వయస్కులకు), ఆరు, ఏడు, ఎనిమిది గ్రేడ్లతో ‘మాధ్యమిక దశ’ (11–14 వయస్కులకు), తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు గ్రేడ్లతో ‘ఉన్నత పాఠశాల దశ’ (14–18 వయస్కులకు) ఉంటాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో పిల్లల మేధోవికాసం భిన్నంగా ఉంటోందని, దానికి తోడు తల్లిదం డ్రుల్లో విద్యాభివృద్ధి, వెల్లువెత్తిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వల్ల బోధనా పద్ధతుల్లో వచ్చిన మార్పులు, ఇతరేతర కారణాల వల్ల కాస్త ముందునుంచే పిల్లలకు విద్యనేర్పాల్సిన అవసరాల దృష్ట్యా ఈ మార్పు ప్రతిపాదించారు. విద్య బోధించే మాధ్యమం 5 గ్రేడ్ వరకు, వీలయితే అటుపైన 8 గ్రేడ్ వరకు, ఆ పైన కూడా తల్లి భాష/స్థానిక భాష/ప్రాంతీయ భాష ఉండాలని పేర్కొన్నారు. నిర్ణయాధికారం రాష్ట్రాలకుంటుంది. పూర్వప్రాథమిక విద్యా బోధన అంగన్వాడీల్లో అని ఈ విధానం చెబుతోంది. ఈ ‘లేబాల్యం విద్యాభద్రత’ (ఈసీసీఈ)కి విద్యాశాఖతో పాటు మహిళాశిశు సంక్షేమం, ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, అక్కడక్కడ... గిరిజన సంక్షేమ శాఖలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. శాస్త్ర సాంకేతిక–సామాజిక శాస్త్రాలకు, సిలబస్– సిలబసేతర క్రీడాది విషయాలకు, వృత్తివిద్యా అంశాలు–ప్రధాన స్రవంతి అంశాలకు మధ్య అంత నిషిద్ధమేమీ ఉండదు. అడ్డులేకుండా, ఐచ్ఛికమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. చిన్నతనం నుంచే భాష, సంస్కృతి విలువల్ని బాలల్లో పాదుకొల్పడం లక్ష్యంగా విధాన రూప కల్పన జరిగినట్టు చెబుతున్నారు. 6 గ్రేడ్ నుంచే సాధారణ బోధనకు వృత్తి విద్య, పరిశోధనల్ని అనుసంధానం చేస్తారు. 10, 12 గ్రేడ్లకు తాజాగా మార్చిన బోర్డు పరీక్ష విధానం ఉంటుంది. అనుభవ పూర్వక అధ్యయనాల కోసం సాధారణ సిలబస్‌ను ఆ మేరకు కుదిస్తారు. ఎప్ప టికప్పుడు విద్యార్థి ప్రగతిని అంచనా వేస్తామంటూనే, 3, 5, 8 గ్రేడ్ లలో మళ్లీ సార్వత్రిక పరీక్ష విధానాన్ని ప్రతిపాదించారు. తరగతికి తగ్గ స్థాయి కల్పించడానికి ఇదంతా చేశామని సర్కారు పెద్దలు చెప్పు కున్నారు. ఉన్నత విద్యలో భారీ మార్పులు ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంలో, మారిన పరిస్థితుల్ని బట్టి ఉన్నత విద్యలోనూ పెనుమార్పులకు జెండా ఊపు తున్నారు. పలు రకాల డిగ్రీ కోర్సులకు, అన్ని సంస్థలకూ కలిపి, దేశ వ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్టీఏ) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో విద్యార్థులు పొందే ర్యాంకుల్ని బట్టే ఘనత వహించిన (న్యాక్ అక్రెడిటేషన్) ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ప్రవేశాలు. గత కొన్నేళ్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘ఐచ్ఛిక అంశాల ఆధారిత విషయ విధానా’న్ని (చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్) మరింత పరిపూర్ణం చేశారు. ఇక ఇది పక్కాగా అమలవుతుంది. శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, సామాజిక శాస్త్రాలు తదితర గ్రూపుల నుంచి ఇష్టమైన ఏయే అంశాలనైనా అడ్డు, వ్యత్యాసం లేకుండా కలగలిపి ఎంపిక చేసుకునే వెసులుబాటు విద్యా ర్థులకుంటుంది. వేర్వేరు సంస్థల నుంచి కూడా విద్యార్థులు సదరు నిర్దేశిత క్రెడిట్స్ సంపాదించవచ్చు. ఇదే అవసరాల నిమిత్తం ప్రభుత్వం ‘అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్’ (ఏబీసీ) నెలకొల్పు తుంది. తాము పొందిన క్రెడిట్స్‌ని విద్యార్థులు ఈ బ్యాంకులో దాచుకొని, తర్వాత పూర్తి పట్టా పొందడానికి వాడుకోవచ్చు. మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కళాశాల–క్షేత్రాన్ని మరింత అనుసంధానం చేస్తూ కోర్సులోకి ఎప్పు డైనా వచ్చి, ఎప్పుడైనా వెళ్లే సరళతర విధానానికి తాజాగా తెర తీస్తున్నారు. అంటే, డిగ్రీ మూడేళ్లో, నాలుగేళ్లో ఏకబిగిన చదవాల్సిన పని లేదు. ఏడాది చదివి ఉద్యోగానికనో, పరిశోధనకో, వృత్తివిద్యా పనులకనో, కంపెనీలు–ఉత్పత్తి కేంద్రాల్లో అనుభవానికనో బయటకు వెళితే ‘సర్టిఫికేట్ కోర్సు’గా, రెండేళ్లు చదివి వెళితే ‘డిప్లొమా కోర్సు’గా గుర్తించి, ఆ మేరకే పట్టా ఇస్తారు. బయటి పనులు చేసుకొని వచ్చి మిగతా ఏడాదో, రెండేళ్లో చదివి సమగ్ర డిగ్రీపట్టా పొందవచ్చు. ఎం.ఫిల్, పీహెచ్‌డీల విషయంలోనూ కొన్ని సడలింపులు ప్రతిపాదిం చారు. ప్రయివేటు రంగంలో కాలేజీలు, అవి పొందే ‘న్యాక్’ క్రెడిట్ ను బట్టి వారే ఫీజులు నిర్ణయించుకోవచ్చు, ఏ కోర్సుకు, ఏ క్రెడిట్ కాలేజీకి ఎంత అన్న గరిష్ట పరిమితి సర్కారు విధిస్తుంది. కాలేజీలు స్వతం త్రంగా డిగ్రీలు ప్రధానం చేయొచ్చు, ఏ విశ్వవిద్యాలయానికీ అను బంధంగా ఉండాల్సిన అవసరం లేదు. మెరుగైన వంద విదేశీ విశ్వ విద్యాలయాలు ఇక్కడ, ఇక్కడి మెరుగైన విశ్వవిద్యాలయాలు విదే శాల్లో కొన్ని కోర్సులు నిర్వహించే పద్ధతి తీసుకువస్తారు. భిన్న వాదనలు–వీడని సందేహాలు స్వయంప్రతిపత్తి, సాధికారతతోనే విద్యావ్యవస్థ బలోపేతమౌతుం దని కేంద్రం అంటోంది. అందుకే తామీ సంస్కరణలకు పూనుకున్నా మనేది వారి వివరణ. ఉన్నత విద్య ఇదివరకటిలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ వంటి సాంకేతిక సంస్థలు ఇక విడిగా ఉండవు. అన్నీ విలీనమై ‘భారత ఉన్నత విద్యా కమిషన్’ (హెచ్ఈ సీఐ) మాత్రమే ఉంటుంది. నిఘా–నియంత్రణతో పాటు బోధకుల శిక్షణ, నిధుల కేటాయింపు, న్యాక్ గుర్తింపులివ్వడం వంటి వన్నీ దీని పరిధిలోకే వస్తాయి. కేంద్ర విద్యామంత్రి నేతృత్వంలోని సలహా మండలి సూచనల మేరకు పనులు జరుగుతాయి. ఇదంతా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మొత్తాన్ని క్రమంగా కేంద్రీకృతం చేసే కుట్ర అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్య మెరుగుపరిచే మౌలిక విషయాల్ని గాలికి వదిలి, సిలబస్–కోర్సు విధానాల మార్పు అంటూ మాటల గారడీ చేస్తున్నార నేది విమర్శ. పూర్వ ప్రాథమిక విద్య (నర్సరీ, ఎల్కేజీ–యూకేజీ), 10+2 ఉన్నత పాఠశాల విద్య (సీబీఎస్ఈ), చాయిస్‌బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ (పలు యూనివర్సిటీలు)... ఇలా అన్నీ ఏదో రూపంలో ఇది వరకు ఉన్నవే నని, వాటికి కొత్తగా భాష్యం చెప్పి, మసిబూసి మారేడు కాయ చేస్తు న్నారని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. విద్యా మౌలిక వసతులు, బోధనలో నాణ్యత, వారికి నైపుణ్యాల శిక్షణ.... ఇవేవీ లేకుండా, తగిన నిధులు ఇవ్వకుండా ఇపుడు చెప్పే ఏ లక్ష్యాల సాధనా జరుగదని వారంటున్నారు. కాగితాల్లో కథల ప్రకారం ఇదొక గొప్ప ‘దార్శని కత’గా కనిపిస్తున్నా, ఆచరణలో ప్రతికూల ఫలితాలుంటాయనేది వారి వాదన. విద్యను మరింత ప్రయివేటు పరం చేయడమేనన్న సందే హాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం మూడు ‘సి’లకు తెగబడుతోందని, విద్యను కేంద్రీకృతపరచడం, మతీకరించడం, వాణిజ్యపరం చేయడం దిశలో ఇది వేగంగా కదలడమేనన్న విపక్షాల అభియోగానికి సమా ధానం కావాలి. పటిష్ట, గతిశీలమైన విద్యావిధానమే ప్రజాస్వామ్యా నికి గట్టి పునాదినివ్వగలదు. అదే తక్షణావసరం! ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com ఆర్. దిలీప్‌రెడ్డి -
పేద విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను నిర్మలా సీతారామన్ వివరించారు. ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో జాతీయ పోలీస్ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు. వాటిని జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తారు. అలాగే పేదవిద్యార్థులకు ఆన్లైన్లో డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తారు, ఇండియాలో చదివేందుకు ఆసక్తి చూపే ఆసియా–ఆఫ్రికా విద్యార్థులకు ఇండ్–సాట్ పేరిట ప్రత్యేక పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులకు ఉపకార వేతనం కూడా అందించనున్నారు. ముఖ్యాంశాలు.. 1. ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలో టాప్ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతారామన్ ప్రకటించారు. 2. 2020–21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా విద్యారంగంలో ప్రవేశపెట్టబోయే నూతన విధానాలపై ఆమె ప్రసంగిం చారు. త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతు న్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.99,300 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయించబోతున్నామని ఆమె పేర్కొన్నారు. 3. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల సహకారంతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమం చేపడతారు. తద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్య వాతావరణం సృష్టించి పౌరుల నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుస్తారు. 4. ఉన్నత విద్యాభ్యాసానికి భారత్ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్ ఇండియా’ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఐఎన్డీ– ఎస్ఏటీ పరీక్షను నిర్వహిస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు. 5. కొత్త విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర భాగస్వాములతో చర్చించామని తెలిపారు. దీనిపై రెండు లక్షలకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. 6.1 విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధిత స్థానిక సంస్థల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌కి వీలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడి, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి ఆన్లైన్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 7. జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ యూనివర్శిటీలను భ™ జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి. -
పూర్తయితే డిగ్రీ.. మానేస్తే డిప్లొమా!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఎప్పుడంటే అప్పుడు ఆగిపోవచ్చు. మధ్యలో మరేదైనా కోర్సు చేసి వచ్చి మళ్లీ పూర్తి చేసుకోవచ్చు. అంతేకాదు ఏడాదో, రెండేళ్లో చదివి పాసైన సబ్జెక్టుల క్రెడిట్లను దాచుకోవచ్చు. ఇలా మధ్యలో చదువు ఆపేసినా చదివిన చదువుకు సర్టిఫికెట్లు ఇచ్చేలా నూతన విద్యా విధా నం (ఎన్ఈపీ) కీలక సిఫార్సు చేసింది. డిగ్రీ విద్యా విధానంలో సమూల మార్పులకు కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో మలి్టపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానాన్ని తీసుకురావాలని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఫైనల్ డ్రాఫ్ట్‌లో కస్తూరి రంగన్ కమిటీ పేర్కొంది. డిగ్రీ చదివే విద్యార్థులు ఆ కోర్సును పూర్తి చేస్తే డిగ్రీ పట్టా, ఏడాది తర్వాత మానేస్తే డిప్లొమా, ద్వితీయ సంవత్సరం పూర్తయ్యాక మానేస్తే అడ్వాన్స్డ్ డిప్లొమా సర్టిఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. కేంద్రం అంగీకరిస్తే డిగ్రీలో వచ్చే విద్యా సంవత్సరంలో ఈ విధానం అమల్లోకి రానుంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పోటీని ఎదుర్కునే సత్తా పెంపొందించడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లక్ష్యంగా నూతన విద్యా విధానంలో పలు కీలక అంశాలను పొందుపరిచారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ విద్యా విధానాన్ని సమగ్రంగా పరిశీలించిన పాలసీ కమిటీ అన్ని స్థాయిల్లో హ్యుమానిటీస్, ఆర్ట్స్ జొప్పించడంతోపాటు అభ్యసన సామర్థ్యాల పెంపు, క్రియేటివిటీ, ఇన్నొవేషన్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లం సాలి్వంగ్ ఎబిలిటీ, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంపొందించే విద్యా విధానం తీసుకురావాలని, స్థానిక పరిశ్రమలు, సంస్థల్లో ఇంటర్న్íÙప్ విధానం అమలు చేయాలని పేర్కొంది. వీటి ద్వారా విద్యార్థుల్లో పరిశోధన, విద్యా సామర్థ్యాలు పెరిగి స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయని తెలిపింది. ఐఐటీల తరహాలో ఇంజనీరింగ్ విద్యా సంస్థలు కూడా ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ను ప్రవేశపెట్టాలని స్పష్టం చేసింది. మరోవైపు విద్యార్థులు తమకు నచ్చిన, ఉపాధి అవకాశాలు పొందేందుకు కావాల్సిన కోర్సులు, సబ్జెక్టులను మాత్రమే చదువుకునే విధానాన్ని అందుబాటులోకి (ఫ్లెక్సిబుల్ కరిక్యులమ్) తేవాలని పేర్కొంది. ఎప్పుడంటే అప్పుడు.. విద్యార్థులు ప్రస్తుతం డిగ్రీలో చేరిన రెండేళ్ల తర్వాత మరో కోర్సు చేయాలంటే ఈ రెండేళ్ల చదువును వదులుకోవాల్సిందే. కానీ ఇకపై అలాంటి విధానాన్ని తొలగించాలని, ఆ రెండేళ్లను చదువును కూడా పరిగణనలోకి తీసుకునేలా, అవసరమైతే తర్వాత ఎప్పుడంటే అప్పుడు కొనసాగించే అవకాశాలను తీసుకురావాలని వెల్లడించింది. చదుకున్న చదువుకు తగిన సరి్టఫికెట్లు ఇవ్వాలని పేర్కొంది. ఇందులో భాగంగా మలి్టపుల్ ఎంట్రీ, ఎగ్జిట్ విధానం తేవాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం సంప్రదాయ డిగ్రీలు మూడేళ్లు, ఇంజనీరింగ్ వంటి డిగ్రీలు నాలుగేళ్లు ఉన్నాయి. డిగ్రీ మూడేళ్లు, నాలుగేళ్లు ఉన్నా.. వాటిని చదువుతూ మధ్యలో ఆపినవారికి తగిన సరి్టఫికెట్లు ఇవ్వాల్సిందేనని పేర్కొంది. డిగ్రీలో చేరిన విద్యారి్థకి మొదటి ఏడాది పూర్తయితే డిప్లొమా సరి్టఫికెట్, రెండేళ్లు పూర్తయితే అడ్వాన్స్డ్ డిప్లొమా సరి్టఫికెట్, మూడేళ్లు పూర్తయితే డిగ్రీ సరి్టఫికెట్ ఇవ్వాలని పేర్కొంది. అదే నాలుగేళ్ల డిగ్రీ చేస్తే పరిశోధన డిగ్రీగా పరిగణించాలని పేర్కొంది. రెగ్యులర్ కోర్సులతోపాటు వొకేషనల్, ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ దీనిని అమలు చేయాలని తెలిపింది. ఎప్పుడైనా.. ఎక్కడైనా.. విద్యార్థులు ఎప్పుడైనా, ఎక్కడైనా చదువుకునే విద్యా విధానం డిగ్రీలో ఉండాలని పేర్కొంది. ఇందుకోసం అకడమిక్ బ్యాంక్ క్రెడిట్స్‌ను (ఏబీసీ) ఏర్పాటు చేయాలని వెల్లడించింది. తద్వారా విద్యార్థి ఒక రాష్ట్రంలో లేదా ఒక యూనివర్సిటీలో డిగ్రీ ప్రథమ సంవత్సరం పూర్తి చేసి, మరో రాష్ట్రంలో లేదా మరో యూనివర్సిటీలో చదువుకునేలా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అయితే ముందుగా చదివిన క్రెడిట్లు నష్టపోకుండా, వాటిని పరిగణనలోకి తీసుకొని డిప్లొమా లేదా డిగ్రీ సరి్టఫికెట్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందుకోసం ఏబీసీని ఏర్పాటు చేయాలని వెల్లడించింది. ఇదీ రెగ్యులర్ విద్యార్థులకే కాకుండా ఫెయిలైన విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండనుంది. ఇందులో విద్యార్థి తను పాసైన సబ్జెక్టుల క్రెడిట్లను దాచుకోవచ్చు. మిగతా సబ్జెక్టులను అక్కడే చదివినా, ఇతర యూనివర్సిటీల్లో చదివినా వాటికి క్రెడిట్లు ఇవ్వాలి. ఇలా ఒక డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, డిగ్రీకి అవసరమైన నిరీ్ణత క్రెడిట్లను ఆ విద్యార్థి సాధించగానే అతనికి సంబంధిత సరి్టఫికెట్‌ను అందించే విధానం తేవాలని స్పష్టం చేసింది. తద్వారా విద్యార్థులు నచి్చన సబ్జెక్టులను ఇష్టపూర్వకంగా చదువుకోవడంతోపాటు అందులో నిష్ణాతులు అవుతారని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించింది. పీజీ రెండో ఏడాదంతా పరిశోధనే.. మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో (పీజీ) మొదటి ఏడాది చదువుకుంటే రెండో ఏడాదంతా పరిశోధనపైనే ఉండేలా చర్యలు చేపట్టాలని పేర్కొంది. అదే నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ చేసిన వారు ఒక్క ఏడాదే పీజీ చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. వారు పరిశోధన డిగ్రీని నాలుగేళ్లు చదివినందున, ఒక్క ఏడాది మినహాయింపు ఇవ్వాలని వెల్లడించింది. ఇక పీహెచ్‌డీలో ప్రవేశాలకు మూడేళ్ల డిగ్రీతోపాటు రెండేళ్లు పీజీ చేసిన వారు, నాలుగేళ్ల పరిశోధన డిగ్రీ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎంఫిల్ కోర్సును రద్దు చేయాలని పేర్కొంది. -
‘త్వరలో నూతన విద్యావిధానం’
నాగపూర్: రాష్ట్రంలోని రెండు కోట్ల మంది విద్యార్థుల భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే పేర్కొన్నారు. విద్యావిధానంపై విధానమండలిలో చర్చ సందర్భంగా ఆయన పైవిధంగా స్పందించారు. విద్యావిధానంపై సభ్యులు కపిల్ పాటిల్ (కాంగ్రెస్), రామ్‌నాథ్ మోతే (బీజేపీ) తదితర సభ్యులు అంతకుముందు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ విద్యావిధానంలో పూర్తిస్థాయిలో పారదర్శకత ఉండాలని తాము కోరుకుంటున్నామన్నారు. తమ నియామకాలకు సంబంధించి కొందరు ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, అయితే ఏ ఒక్కరి ఉద్యోగానికీ ముప్పు ఉండబోద ని ఆయన హామీ ఇచ్చారు.