ఇది వేకువ తెచ్చే వేగుచుక్కేనా? | Many Changes In Education With New Education System | Sakshi
Sakshi News home page

ఇది వేకువ తెచ్చే వేగుచుక్కేనా?

Published Fri, Aug 7 2020 12:41 AM | Last Updated on Fri, Aug 7 2020 12:42 AM

Many Changes In Education With New Education System - Sakshi

నాగరికత క్రమంలో... ప్రపంచం విజ్ఞానం కోసం వెతుకులాడుతున్నపుడు విశ్వవిద్యా లయ బోధనా పద్ధతులు ఆవిష్కరించి, సంస్థల్ని దిగ్విజయంగా నడిపిన నేల భారత దేశం. ఎన్నో దేశాల వారిక్కడికి వచ్చి నలంద, తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాల్లో చదివి పట్టాలు, స్నాతకోత్తర డిగ్రీలు పొందిన చరిత్ర. సంవత్సరాల తరబడి ప్రపంచంలో మేటి విద్యాసంస్థలుగా ఐఐటీలను నిలిపిన నాణ్యత మనది. ప్రమాణాల విద్యా సంస్థలే లేని దురవస్థకు నేడు దిగజారిపోయాం. చివరకు ప్రపంచ వ్యాప్తంగా వంద ఉత్తమ విద్యా సంస్థల్ని ఎవరు ఎంపిక చేసినా, మనది చోటే దక్కని దుస్థితి! ఎక్కడో దారి తప్పాం! పాఠశాల, కాలేజీ, విశ్వవిద్యాలయ స్థాయిల్లో.. మధ్య లోనే విద్య మానేస్తున్న వారి సంఖ్య అపారం. ప్రమాణాలు దిగజారి బడిచదువులు గుడ్డిదీపాలయ్యాయి. కాలేజీ చదువులు కాలక్షేపానిక య్యాయి. కడకు కూడైనా పెట్టలేని అలంకారపు విద్యలుగా మిగులు తున్నాయి మన డిగ్రీలు! ఎంతోకాలం వృత్తి విద్యలకు వన్నెలద్దిన కోర్సులన్నీ ఇప్పుడు మరుగునపడ్డాయి. నైపుణ్యాలను తీర్చిదిద్దే శిక్షణ నేడు కరువైంది. వేల సంవత్సరాలు వారసత్వంగా వస్తున్న అనువంశిక జ్ఞానం ఆదరణ లేక కనుమరుగవుతోంది.

కాలం చెల్లిన విద్యావిధా నాలు ఒకవైపు, శరవేగంగా వస్తున్న సామాజిక మార్పులు–డిమాండ్లు మరోవైపు, ఫలితంగా ‘చదువుకున్న యువత’ చతికిలపడుతున్నారు. పునాది సరిగాలేని అత్తెసరు చదువులతో నైపుణ్యాల కొరతే కాదు విలువల లేమి రాజ్యమేలుతోంది. దీనికి విరుగుడుగా విద్యావిధా నంలో సమూల మార్పులు రావాలనేది సుదీర్ఘ కాలంగా ఈ దేశంలో ఓ డిమాండ్‌! దానికి జవాబుగా కేంద్ర మంత్రి వర్గం నూతన ‘జాతీయ విద్యా విధానాని’కి పది రోజుల కింద ఆమోదం తెలిపింది. వచ్చే రెండు దశాబ్దాల పాటు దాదాపు ఇదే అనుసరణీయం! అంతకు ముందు, సుదీర్ఘకాలంగా విభిన్న వర్గాల నుంచి వచ్చిన ప్రతిపాద నలు, పలు స్థాయిల్లో చర్చోపచర్చలు, మార్పు చేర్పుల తర్వాత వచ్చిందే ఈ స్థూలవిధానం. ఇది ఇలాగే యథాతథం అమలవదు. పలు అంశాల అమలుకుగాను పార్ల మెంటులో, రాష్ట్ర అసెంబ్లీల్లో ఏర్పడే చట్టాల మద్దతు కావాలి. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల్లో డాక్టరేట్‌ పట్టా వరకు, వివిధ స్థాయిల్లో సంస్క రణలతో మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానం మంచి–చెడులపై దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ నేతృత్వపు కాంగ్రెస్‌ ప్రభుత్వం 1986లో తెచ్చిన విద్యావిధానం (34 ఏళ్ల) తర్వాత కొత్త విధానం రావడం ఇదే!

బడి చదువుల క్రమతనే మార్చారు!
మారిన పరిస్థితుల్లో బాల్యం నుంచే విద్యాభద్రతకు గాను, ఇదివరకటి 10+2 సంవత్సరాల పద్ధతికి బదులు 5+3+3+4 పద్ధతి ప్రతిపాదిం చారు. ఇంటర్మీడియట్‌ లేకుండా 12 గ్రేడ్‌ వరకు ఇక పాఠశాల చదువే! ఇదివరకటి ప్రాథమిక విద్య ఆరంభం కన్నా ముందు మూడేళ్ల (3–6 ఏళ్ల వయస్కుల కోసం) నుంచే పిల్లలకు విద్యాభద్రత లభించేలా చూస్తారు. ఫలితంగా ఇదివరకు హామీ ఇచ్చినట్టు 6–14 సంవత్సరాల మధ్య వయస్కుల నిర్బంధ విద్య, ఇక ఇప్పుడు 3–18గా మారు తుంది. అంటే ఇకపై పాఠశాలవిద్యలో క్రమంగా, మూడేళ్ల పూర్వ ప్రాథమిక విద్యాబోధనను కలుపుకొని ఒకటి, రెండు గ్రేడ్‌లతో అయి దేళ్ల ‘పునాది దశ’ (3–8 వయస్కులకు) ఉంటుంది. మూడు, నాలుగు, అయిదు గ్రేడ్‌లతో ‘సన్నాహక దశ’ (8–11 వయస్కులకు), ఆరు, ఏడు, ఎనిమిది గ్రేడ్‌లతో ‘మాధ్యమిక దశ’ (11–14 వయస్కులకు), తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు గ్రేడ్‌లతో ‘ఉన్నత పాఠశాల దశ’ (14–18 వయస్కులకు) ఉంటాయి. మారిన కాలమాన పరిస్థితుల్లో పిల్లల మేధోవికాసం భిన్నంగా ఉంటోందని, దానికి తోడు తల్లిదం డ్రుల్లో విద్యాభివృద్ధి, వెల్లువెత్తిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వల్ల బోధనా పద్ధతుల్లో వచ్చిన మార్పులు, ఇతరేతర కారణాల వల్ల కాస్త ముందునుంచే పిల్లలకు విద్యనేర్పాల్సిన అవసరాల దృష్ట్యా ఈ మార్పు ప్రతిపాదించారు.

విద్య బోధించే మాధ్యమం 5 గ్రేడ్‌ వరకు, వీలయితే అటుపైన 8 గ్రేడ్‌ వరకు, ఆ పైన కూడా తల్లి భాష/స్థానిక భాష/ప్రాంతీయ భాష ఉండాలని పేర్కొన్నారు. నిర్ణయాధికారం రాష్ట్రాలకుంటుంది. పూర్వప్రాథమిక విద్యా బోధన అంగన్‌వాడీల్లో అని ఈ విధానం చెబుతోంది. ఈ ‘లేబాల్యం విద్యాభద్రత’ (ఈసీసీఈ)కి విద్యాశాఖతో పాటు మహిళాశిశు సంక్షేమం, ఆరోగ్య– కుటుంబ సంక్షేమం, అక్కడక్కడ... గిరిజన సంక్షేమ శాఖలు ఉమ్మడిగా బాధ్యత వహిస్తాయి. శాస్త్ర సాంకేతిక–సామాజిక శాస్త్రాలకు, సిలబస్‌– సిలబసేతర క్రీడాది విషయాలకు, వృత్తివిద్యా అంశాలు–ప్రధాన స్రవంతి అంశాలకు మధ్య అంత నిషిద్ధమేమీ ఉండదు. అడ్డులేకుండా, ఐచ్ఛికమైన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. చిన్నతనం నుంచే భాష, సంస్కృతి విలువల్ని బాలల్లో పాదుకొల్పడం లక్ష్యంగా విధాన రూప కల్పన జరిగినట్టు చెబుతున్నారు. 6 గ్రేడ్‌ నుంచే సాధారణ బోధనకు వృత్తి విద్య, పరిశోధనల్ని అనుసంధానం చేస్తారు. 10, 12 గ్రేడ్‌లకు తాజాగా మార్చిన బోర్డు పరీక్ష విధానం ఉంటుంది. అనుభవ పూర్వక అధ్యయనాల కోసం సాధారణ సిలబస్‌ను ఆ మేరకు కుదిస్తారు. ఎప్ప టికప్పుడు విద్యార్థి ప్రగతిని అంచనా వేస్తామంటూనే, 3, 5, 8 గ్రేడ్‌ లలో మళ్లీ సార్వత్రిక పరీక్ష విధానాన్ని ప్రతిపాదించారు. తరగతికి తగ్గ స్థాయి కల్పించడానికి ఇదంతా చేశామని సర్కారు పెద్దలు చెప్పు కున్నారు.

ఉన్నత విద్యలో భారీ మార్పులు
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశంలో, మారిన పరిస్థితుల్ని బట్టి ఉన్నత విద్యలోనూ పెనుమార్పులకు జెండా ఊపు తున్నారు. పలు రకాల డిగ్రీ కోర్సులకు, అన్ని సంస్థలకూ కలిపి, దేశ వ్యాప్తంగా ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అందులో విద్యార్థులు పొందే ర్యాంకుల్ని బట్టే ఘనత వహించిన (న్యాక్‌ అక్రెడిటేషన్‌) ఉన్నత విద్యా సంస్థల్లో వారికి ప్రవేశాలు. గత కొన్నేళ్లు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘ఐచ్ఛిక అంశాల ఆధారిత విషయ విధానా’న్ని (చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌) మరింత పరిపూర్ణం చేశారు. ఇక ఇది పక్కాగా అమలవుతుంది. శాస్త్ర, సాంకేతిక, ఆర్థిక, సామాజిక శాస్త్రాలు తదితర గ్రూపుల నుంచి ఇష్టమైన ఏయే అంశాలనైనా అడ్డు, వ్యత్యాసం లేకుండా కలగలిపి ఎంపిక చేసుకునే వెసులుబాటు విద్యా ర్థులకుంటుంది. వేర్వేరు సంస్థల నుంచి కూడా విద్యార్థులు సదరు నిర్దేశిత క్రెడిట్స్‌ సంపాదించవచ్చు. ఇదే అవసరాల నిమిత్తం ప్రభుత్వం ‘అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌’ (ఏబీసీ) నెలకొల్పు తుంది. తాము పొందిన క్రెడిట్స్‌ని విద్యార్థులు ఈ బ్యాంకులో దాచుకొని, తర్వాత పూర్తి పట్టా పొందడానికి వాడుకోవచ్చు.

మూడేళ్లు లేదా నాలుగేళ్ల డిగ్రీని ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. కళాశాల–క్షేత్రాన్ని మరింత అనుసంధానం చేస్తూ కోర్సులోకి ఎప్పు డైనా వచ్చి, ఎప్పుడైనా వెళ్లే సరళతర విధానానికి తాజాగా తెర తీస్తున్నారు. అంటే, డిగ్రీ మూడేళ్లో, నాలుగేళ్లో ఏకబిగిన చదవాల్సిన పని లేదు. ఏడాది చదివి ఉద్యోగానికనో, పరిశోధనకో, వృత్తివిద్యా పనులకనో, కంపెనీలు–ఉత్పత్తి కేంద్రాల్లో అనుభవానికనో బయటకు వెళితే ‘సర్టిఫికేట్‌ కోర్సు’గా, రెండేళ్లు చదివి వెళితే ‘డిప్లొమా కోర్సు’గా గుర్తించి, ఆ మేరకే పట్టా ఇస్తారు. బయటి పనులు చేసుకొని వచ్చి మిగతా ఏడాదో, రెండేళ్లో చదివి సమగ్ర డిగ్రీపట్టా పొందవచ్చు. ఎం.ఫిల్, పీహెచ్‌డీల విషయంలోనూ కొన్ని సడలింపులు ప్రతిపాదిం చారు. ప్రయివేటు రంగంలో కాలేజీలు, అవి పొందే ‘న్యాక్‌’ క్రెడిట్‌ ను బట్టి వారే ఫీజులు నిర్ణయించుకోవచ్చు, ఏ కోర్సుకు, ఏ క్రెడిట్‌ కాలేజీకి ఎంత అన్న గరిష్ట పరిమితి సర్కారు విధిస్తుంది. కాలేజీలు స్వతం త్రంగా డిగ్రీలు ప్రధానం చేయొచ్చు, ఏ విశ్వవిద్యాలయానికీ అను బంధంగా ఉండాల్సిన అవసరం లేదు. మెరుగైన వంద విదేశీ విశ్వ విద్యాలయాలు ఇక్కడ, ఇక్కడి మెరుగైన విశ్వవిద్యాలయాలు విదే శాల్లో కొన్ని కోర్సులు నిర్వహించే పద్ధతి తీసుకువస్తారు.

భిన్న వాదనలు–వీడని సందేహాలు
స్వయంప్రతిపత్తి, సాధికారతతోనే విద్యావ్యవస్థ బలోపేతమౌతుం దని కేంద్రం అంటోంది. అందుకే తామీ సంస్కరణలకు పూనుకున్నా మనేది వారి వివరణ. ఉన్నత విద్య ఇదివరకటిలా యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్, ఏఐసీటీఈ వంటి సాంకేతిక సంస్థలు ఇక విడిగా ఉండవు. అన్నీ విలీనమై ‘భారత ఉన్నత విద్యా కమిషన్‌’ (హెచ్‌ఈ సీఐ) మాత్రమే ఉంటుంది. నిఘా–నియంత్రణతో పాటు బోధకుల శిక్షణ, నిధుల కేటాయింపు, న్యాక్‌ గుర్తింపులివ్వడం వంటి వన్నీ దీని పరిధిలోకే వస్తాయి. కేంద్ర విద్యామంత్రి నేతృత్వంలోని సలహా మండలి సూచనల మేరకు పనులు జరుగుతాయి. ఇదంతా సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య మొత్తాన్ని క్రమంగా కేంద్రీకృతం చేసే కుట్ర అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విద్య మెరుగుపరిచే మౌలిక విషయాల్ని గాలికి వదిలి, సిలబస్‌–కోర్సు విధానాల మార్పు అంటూ మాటల గారడీ చేస్తున్నార నేది విమర్శ. పూర్వ ప్రాథమిక విద్య (నర్సరీ, ఎల్కేజీ–యూకేజీ), 10+2 ఉన్నత పాఠశాల విద్య (సీబీఎస్‌ఈ), చాయిస్‌బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (పలు యూనివర్సిటీలు)... ఇలా అన్నీ ఏదో రూపంలో ఇది వరకు ఉన్నవే నని, వాటికి కొత్తగా భాష్యం చెప్పి, మసిబూసి మారేడు కాయ చేస్తు న్నారని వామపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. విద్యా మౌలిక వసతులు, బోధనలో నాణ్యత, వారికి నైపుణ్యాల శిక్షణ.... ఇవేవీ లేకుండా, తగిన నిధులు ఇవ్వకుండా ఇపుడు చెప్పే ఏ లక్ష్యాల సాధనా జరుగదని వారంటున్నారు. కాగితాల్లో కథల ప్రకారం ఇదొక గొప్ప ‘దార్శని కత’గా కనిపిస్తున్నా, ఆచరణలో ప్రతికూల ఫలితాలుంటాయనేది వారి వాదన. విద్యను మరింత ప్రయివేటు పరం చేయడమేనన్న సందే హాలు వ్యక్తమౌతున్నాయి. కేంద్రం మూడు ‘సి’లకు తెగబడుతోందని, విద్యను కేంద్రీకృతపరచడం, మతీకరించడం, వాణిజ్యపరం చేయడం దిశలో ఇది వేగంగా కదలడమేనన్న విపక్షాల అభియోగానికి సమా ధానం కావాలి. పటిష్ట, గతిశీలమైన విద్యావిధానమే ప్రజాస్వామ్యా నికి గట్టి పునాదినివ్వగలదు. అదే తక్షణావసరం!

ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com
ఆర్‌. దిలీప్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement