new notes printing
-
అసలు 2వేల నోట్లను ఎందుకు ఆపేశారు?
సాక్షి, న్యూఢిల్లీ : కరెన్సీ కటకటతో ప్రజలు అల్లల్లాడుతున్న వేళ.. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రాన్ని ఏకీపడేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా సొంత పార్టీపై ప్రశ్నలు గుప్పించారు. ‘దేశం మొత్తం కొత్త సంక్షోభం ఎదుర్కుంటోంది. నగదు కొరతతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. చివరకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నోట్లు మాయం కావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందన్న ఆయన.. అందుకు తగిన ఆధారాలతో బయటపెడితే బాగుంటుందేమో. ఆర్థిక మంత్రి సహా కొందరు తెరపైకి వచ్చి అసలు సమస్యే లేదన్న రీతిలో వివరణలు ఇస్తున్నారు. నల్లధనానికి చెక్ పెట్టేందుకు వెయ్యి నోట్లను హఠాత్తుగా రద్దు చేస్తూ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రూ. 2 వేల నోట్ల ద్వారా నల్ల కుబేరులను నిలువరించొచ్చని చెప్పింది. కానీ, అది వారికి మరింత సులువవుతుందన్న వాదనను మాత్రం ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు. మార్చి 2017 చివరినాటికల్లా బ్యాంకుల్లో ఉన్న మొత్తం నగదులో 50.2 శాతం 2 వేల నోట్ల రూపంలోనే ఉన్నట్లు లెక్కలు తేల్చాయి. ... కానీ, గతేడాది జూలై నుంచి 2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపేయగా.. లావాదేవీల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నట్లు ఓ సర్వే తేల్చింది. అలాంటప్పుడు ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం వ్యవహరించాలి. అయితే విచిత్రమైన నిర్ణయాలు తీసుకునే ఈ ప్రభుత్వం త్వరలో 2 వేల నోట్లను రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అంటూ యశ్వంత్ సిన్హా ఓ వ్యాసాన్ని ప్రచురించారు. పనిలో పనిగా నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలంటూ ఆయన పలు ప్రశ్నలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంధించారు. త్వరలో కీలక ప్రకటన... బీజేపీ ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారి పోయి ఉన్న యశ్వంత్ సిన్హా త్వరలో రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 21న కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అదేంటన్నది చెప్పేందుకు నిరాకరించిన ఆయన.. రాజకీయ ప్రకటన కోసం శనివారం దాకా ఓపిక పట్టండంటూ మీడియాకు తెలిపారు. -
కొత్త నోట్ల ముద్రణకు ఎంత ఖర్చవుతుందో తెలుసా?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా 2000, మళ్లీ 500 రూపాయల నోట్లు ముద్రిస్తోంది. అయితే.. వీటి ముద్రణకు ఎంత ఖర్చవుతుందో అనే విషయం కూడా ఆసక్తికరమే. కొత్త 500 నోటు ముద్రించాలంటే రూ. 3.09, 2వేల రూపాయల నోటు ముద్రించాలంటే రూ. 3.54 చొప్పున ఖర్చవుతుందట. ఈ విషయాన్ని రిజర్వు బ్యాంకు తరఫున నోట్లు ముద్రించే భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్బీఎన్ఎంపీఎల్) సంస్థ తెలిపింది. ఇది రిజర్వు బ్యాంకు అనుబంధ సంస్థ. ఈ సంస్థను ఒక వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు అడిగారు. దానికి సమాధానంగానే పై వివరాలను వెల్లడించింది. 500 రూపాయల నోట్లు వెయ్యి ముద్రించాలంటే మొత్తం రూ. 3090 ఖర్చవుతుందని, అదే రెండువేల నోట్లకైతే వెయ్యి నోట్లకు తాము రూ. 3540 వసూలు చేస్తామని బీఆర్బీఎన్ఎంపీఎల్ చెప్పింది. మహాత్మా గాంధీ సిరీస్‌లో కొత్త 500 రూపాయల నోట్ల బ్యాచ్‌ని రెండు నంబర్ ప్యానళ్లలోను 'ఆర్' అనే అక్షరంతో విడుదల చేస్తున్నట్లు రిజర్వు బ్యాంకు సోమవారం ప్రకటించింది. త్వరలోనే కొత్త 50 రూపాయల నోట్లను కూడా విడుదల చేస్తామని, అయితే అంతమాత్రాన పాత 50 రూపాయల నోట్లను మాత్రం రద్దు చేసేది లేదని కూడా రిజర్వు బ్యాంకు చెప్పిన విషయం తెలిసిందే. -
అసలు నోట్లు ఎక్కడ ప్రింట్ అవుతాయి ?
-
కొత్త నోట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే రిజర్వు బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్.. కొత్త 2వేలు, 500 రూపాయల నోట్లను చూపించారు. అప్పటికే భారీ మొత్తంలో ఈ నోట్లు రిజర్వు బ్యాంకుకు చేరుకున్నాయి. కానీ వీటన్నింటినీ ఎక్కడ ముద్రించారు, ఎలా తీసుకొచ్చారు? ఇదంతా ఆసక్తికరమే. గత ఆరు నెలలుగా ఒక చార్టర్డ్ విమానం నిండా కొత్త నోట్లను మైసూరులోని ప్రభుత్వ ప్రెస్ నుంచి ఢిల్లీలోని రిజర్వు బ్యాంకు ప్రధాన కార్యాలయానికి తరలిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లుగా అసలు మైసూరులో విమానాశ్రయం ఎందుకు, అక్కడ అనవసరం అని భావించినవాళ్లు ఇప్పుడు ఈ విషయం తెలిసి నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఇక్కడ ఒకే ఒక్క రన్‌వే ఉంది. అక్కడి నుంచే కొత్త నోట్లన్నీ సురక్షితంగా, అత్యంత రహస్యంగా ఢిల్లీకి, పలు నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరుకున్నాయి. మూడోకంటికి తెలియకుండా కేవలం అతి కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ వ్యవహారాన్ని జాగ్రత్తగా పూర్తిచేయడంలో మైసూరు విమానాశ్రయానిది కూడా ప్రధాన పాత్రే. 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించేసరికే ఈ నోట్లన్నీ వివిధ నగరాల్లో ఉన్న రిజర్వు బ్యాంకు శాఖలకు చేరిపోయాయి. తర్వాత అక్కడి నుంచి వివిధ బ్యాంకులకు వాటిని తరలించారు. మైసూరులో ఉన్న భారతీయ రిజర్వు బ్యాంకు నోటు ముద్రణ్ లిమిటెడ్ సంస్థలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ నోట్లను ముద్రించారు. ఆ ప్రెస్‌కు ప్రత్యేకమైన రైల్వేలైను, నీళ్ల పైపులైన్ కూడా ఉన్నాయి. రెండు దశాబ్దాల నాటి ఈ ప్రపెస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రింటింగ్ ప్రెస్‌లలో ఒకటిగా పేరొందింది. ఇక్కడే ప్రత్యేకంగా కరెన్సీ ముద్రణకు కావల్సిన పేపర్ తయారీ విభాగం కూడా ఉంది. ఆరు నెలల క్రితమే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ మొదలైనా, ఆ విషయం ఎవరికీ తెలియలేదు. ఒక్కో బ్యాంకుకు రూ. 20 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు వాటివాటి సామర్థ్యాన్ని బట్టి ఈ కొత్త నోట్లను పంపిణీ చేశారు. కేవలం డబ్బుల రవాణా కోసమే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు చార్టర్డ్ విమానాన్ని అద్దెకు తీసుకుంది. ఇందుకోసం ఈ విమానానికి రూ. 73.42 లక్షలు చెల్లించారు.