సాక్షి, న్యూఢిల్లీ : కరెన్సీ కటకటతో ప్రజలు అల్లల్లాడుతున్న వేళ.. 2 వేల నోట్ల ముద్రణ నిలిపివేత వ్యవహారం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కేంద్రాన్ని ఏకీపడేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కూడా సొంత పార్టీపై ప్రశ్నలు గుప్పించారు.
‘దేశం మొత్తం కొత్త సంక్షోభం ఎదుర్కుంటోంది. నగదు కొరతతో ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. చివరకు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా నోట్లు మాయం కావటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర కోణం ఉందన్న ఆయన.. అందుకు తగిన ఆధారాలతో బయటపెడితే బాగుంటుందేమో. ఆర్థిక మంత్రి సహా కొందరు తెరపైకి వచ్చి అసలు సమస్యే లేదన్న రీతిలో వివరణలు ఇస్తున్నారు. నల్లధనానికి చెక్ పెట్టేందుకు వెయ్యి నోట్లను హఠాత్తుగా రద్దు చేస్తూ నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న కేంద్రం.. రూ. 2 వేల నోట్ల ద్వారా నల్ల కుబేరులను నిలువరించొచ్చని చెప్పింది. కానీ, అది వారికి మరింత సులువవుతుందన్న వాదనను మాత్రం ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు. మార్చి 2017 చివరినాటికల్లా బ్యాంకుల్లో ఉన్న మొత్తం నగదులో 50.2 శాతం 2 వేల నోట్ల రూపంలోనే ఉన్నట్లు లెక్కలు తేల్చాయి.
... కానీ, గతేడాది జూలై నుంచి 2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపేయగా.. లావాదేవీల్లో వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తున్నట్లు ఓ సర్వే తేల్చింది. అలాంటప్పుడు ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం వ్యవహరించాలి. అయితే విచిత్రమైన నిర్ణయాలు తీసుకునే ఈ ప్రభుత్వం త్వరలో 2 వేల నోట్లను రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు’ అంటూ యశ్వంత్ సిన్హా ఓ వ్యాసాన్ని ప్రచురించారు. పనిలో పనిగా నోట్ల రద్దుపై సమాధానం చెప్పాలంటూ ఆయన పలు ప్రశ్నలు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంధించారు.
త్వరలో కీలక ప్రకటన...
బీజేపీ ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారి పోయి ఉన్న యశ్వంత్ సిన్హా త్వరలో రాజకీయ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఏప్రిల్ 21న కీలక ప్రకటన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అదేంటన్నది చెప్పేందుకు నిరాకరించిన ఆయన.. రాజకీయ ప్రకటన కోసం శనివారం దాకా ఓపిక పట్టండంటూ మీడియాకు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment