new train
-
సింహపురికి ఇంటర్సిటీ
సాక్షి, నెల్లూరు : దక్షిణ మధ్య, దక్షిణ రైల్వే జోన్ల ఎండ్ పాయింట్‌గా ఉన్న గూడూరు జంక్షన్ నుంచి రాజధాని అమరావతి విజయవాడకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు నేటి నుంచి పట్టాలెక్కనుంది. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల మధ్య ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వచ్చినా.. కొత్త రాజధాని అమరావతి కేంద్రమైన విజయవాడకు నెల్లూరు జిల్లా నుంచి పగటి పూట ప్రత్యేక రైలు లేకుండా పోయింది. ఇప్పటి వరకు విజయవాడకు వెళ్లాంటే చెన్నై, తిరుపతి, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లే రైళ్లే దిక్కుగా ఉన్నాయి. ఇవీన్ని కూడా ఎక్కువగా రాత్రి వేళలో నడుస్తున్నాయి. గూడూరు నుంచి సికింద్రాబాద్‌కు సింహపురి సూపర్‌ఫాస్ట్ రైలు ఉన్నప్పటికీ ఇది కూడా రాత్రి వేళ ఉంది. గూడూరు– విజయవాడ మధ్య ఉదయం, మధ్యాహ్నం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. అయితే ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో కానీ, ఆ తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్లో కానీ జిల్లా నుంచి విజయవాడకు ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే లేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి రైల్వే ప్రాధాన్యతలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు, ఎంపీల డిమాండ్‌తో గూడూరు నుంచి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును అనూహ్యంగా ప్రకటించారు. ఎప్పటి నుంచో జిల్లా వాసులకు అందుబాటులోకి రావాల్సి ఉంది. ఎట్టకేలకు ఇప్పుడు అందుబాటులోకి రావడంతో జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి గూడూరు– విజయవాడ మధ్య ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆదివారం గూడూరులో ప్రారంభించనున్నారు. గత వారమే ఈ ట్రైన్ ప్రారంభం కావాల్సి ఉండగా, అనివార్య పరిస్థితుల్లో వాయిదా పడింది. గూడూరు–విజయవాడ (రైలు నంబరు 12743) ఉదయం 6.10 గంటలకు గూడూరులో బయలుదేరుతుంది. విజయవాడకు ఉదయం 10.40 గంటలకు చేరుతుంది. విజయవాడ–గూడూరు (రైలు నంబరు12744) విజయవాడలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి గూడూరుకు రాత్రి 10.30 గంటలకు చేరుతుంది. ఈ రైలు రెండు ఏసీ చైర్కార్లు, పది సెకండ్ చైర్కార్లు కోచ్‌లు ఉన్నాయి. 8 చోట్ల స్టాపింగ్ జిల్లా నుంచి వివిధ వ్యాపారాల నిమిత్తం వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు గూడూరు, నెల్లూరు, కావలి నుంచి విజయవాడ వరకు నిత్యం 7 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుంటారు. వీరికి కొన్ని ట్రైన్స్ అనువుగా ఉన్నా, కొన్ని చోట్ల నిలుపుదల లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు ఆ రైళ్లు సుదూర ప్రాంతాల నుంచి వస్తుండడంతో జిల్లా వాసులు వాటిలో ప్రయాణాలు చేయాలన్నా చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో జిల్లా నుంచే ట్రైన్ విజయవాడకు మొదలు కానుండడంతో చాలా వరకు సౌకర్యం కలగనుంది. ప్రధానంగా గూడూరు నుంచి బయలుదేరే ఈ రైలు నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి రైల్వేస్టేషన్లల్లో నిలుపుదల, చివరగా విజయవాడలో ట్రైన్ ఆగుతుంది. విజయవాడ నుంచి వచ్చేటప్పుడు కూడా అవే స్టేషన్లలో ట్రైన్ నిలుపుదల చేయనున్నారు. రైలుకు పేరుపై కసరత్తు గూడూరు–విజయవాడ మధ్య నూతనంగా ప్రారంభింనున్న ట్రైన్‌కు ఏ పేరు పెడతారన్న దానిపై కసరత్తు జరుగుతోంది. చాలా చోట్ల రైళ్లకు ఆయా ప్రాంతాల పేర్లు, లేక ఆధ్యాత్మిక కేంద్రాలతో వచ్చే పేర్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఈ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌కు వేదగిరి ఎక్స్‌ప్రెస్, లేదా తల్పగిరి ఎక్స్‌ప్రెస్, లేదా షార్ ఎక్స్‌ప్రెస్ పేర్లు ప్రతిపాదనలపై ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా మరేదైనా పేరు పెడతారా వేచి చూడాల్సి ఉంది. -
ట్రైన్–18 వేగం 180 కి.మీ.
న్యూఢిల్లీ: ప్రయోగాత్మక పరీక్షల్లో ‘ట్రైన్–18’ రైలు గంటకు 180 కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో పరుగులు పెట్టిందని రైల్వే అధికారులు చెప్పారు. రూ. 100 కోట్ల వ్యయంతో చెన్నైలో తయారైన ఈ రైలు గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో కూడా దూసుకుపోగలదనీ, అయితే అందుకు తగ్గట్లుగా రైలు పట్టాలు, సిగ్నల్ వ్యవస్థ అవసరమని అధికారి చెప్పారు. ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఒక్క ఇంజినే రైలులోని బోగీలన్నింటినీ లాగుతుండటం తెలిసిందే. ట్రైన్–18లో ఇలా బోగీలను లాగేందుకు ప్రత్యేకంగా ఇంజిన్ ఏదీ ఉండదు. బదులుగా ప్రతి రెండు బోగీల్లో ఒకదానికి శక్తిమంతమైన మోటార్లు ఉంటాయి. కాబట్టి రైలు త్వరగా వేగం అందుకుంటుంది. ఇప్పటికే ఈ సాంకేతికతను పెద్ద నగరాల్లో సేవలందించే లోకల్ ట్రైన్స్, మెట్రో రైళ్లలోనూ ఉపయోగిస్తున్నప్పటికీ వాటి వేగం గరిష్టంగా గంటకు 100 కిలో మీటర్ల వరకే ఉంటోంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో నడిచే ట్రైన్–18ను శతాబ్ది రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే నెలలోనే తొలి ట్రైన్–18 ప్రయాణికులకు సేవలు అందించే అవకాశాలున్నాయి. -
ఇంజిన్ రహిత రైలు
చెన్నై నుంచి ఢిల్లీకి బయల్దేరిన తొలి ఇంజిన్ రహిత రైలు ట్రైన్ 18. సోమవారం రైల్వే బోర్డ్ చైర్మన్ అశ్విని లోహాని జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారైన ఈ రైలు.. మరిన్ని పరీక్షలు పూర్తిచేసుకున్న తరువాత శతాబ్ది ఎక్స్‌ప్రెస్ స్థానంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుంది. సెమీ హైస్పీడ్ రకానికి చెందిన ఈ రైలు గంటకు గరిష్టంగా 160 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. – కొరుక్కుపేట (చెన్నై) -
రేపు కరీంనగర్‌కు కొత్త రైలు!
సాక్షి, హైదరాబాద్: చాలాకాలంగా కొత్త రైలు కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్‌వాసులకు శుభవార్త. పట్టణానికి మరో కొత్త రైలు రాబోతోంది. ఇప్పటిదాకా నిజామాబాద్ వరకు నడిచిన నిజామాబాద్ – లోకమాన్య తిలక్ (ట్రెయిన్ నం 11206) రైలును కరీంనగర్ వరకు పొడిగించారు. ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటలకు రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1994లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో స్టేషన్ పనులు మొదలయ్యాయి.పెద్దపల్లి నుంచి కరీంనగర్‌కు రైల్వే లైన్ పూర్తి కావడంతో 2001లో స్టేషన్ ప్రారంభమైంది. 2017 మార్చి 25 నాటికి నిజామాబాద్ వరకు లైన్ పూర్తవడంతో పెద్ద పల్లి–కరీంనగర్– నిజామాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలు మొదలయ్యాయి. కరీంనగర్– తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12762/12761), కాచిగూడ–కరీంనగర్ ప్యాసింజర్ ్కఅ (57601/02), సిర్పూర్ టౌన్–కరీంనగర్ డెమూ (77255/77 256), కరీంనగర్ –లింగంపేట (జగి త్యాల) డెమూ (77274/77273), పెద్దపల్లి– లింగంపేట(జగిత్యాల) డెమూ (77258/77257), నిజామాబాద్ – కరీంనగర్ డెమూ (77260/77259) రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరీంనగర్ నుంచి నిజామాబాద్ వరకు రైల్ ప్రయాణ సౌకర్యం సాకారమైనా ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లేదు. వాస్తవానికి ఈ రెండు నగరాల మధ్య రైలు చార్జీ కేవలం రూ.40. ఆర్టీసీ చార్జి రూ.200. అయినా ప్రయాణికులు ఎక్కువగా రైలును కాదని ఆర్టీసీలోనే ప్రయాణిస్తున్నారు. ఈ రైల్వేస్టేషన్లు ఊరికి దూరంగా ఉండటం, అక్కడ నుంచి పట్టణాలకు సరైన రవాణా సదుపాయం లేకపోవడమే దీనికి కారణం. తాజాగా నిజామాబాద్–లోకమాన్య తిలక్ కరీంనగర్ వరకు పొడిగించడం ఆశాజనకంగా మారింది. నిజామాబాద్‌తోపాటు బాసర, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్, మన్మాడ్, నాసిక్ తదితర ప్రాంతాలకు రైలులో ప్రయాణించే వీలు ఏర్పడింది. 27న ఎంపీ వినోద్‌తో భేటీ..: ఈ నెల 27న ఎంపీ వినోద్‌కుమార్‌తో దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్ యాదవ్ భేటీ కానున్నారు. ఇటీవల పార్లమెం టు సమావేశాల అనంతరం ఎంపీలతో భేటీ అయి వారి నియోజకవర్గాల్లో ఉన్న రైల్వే పనుల పురోగతి, పెండింగ్ పనులపై చర్చించాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ రైల్వే ఉన్నతాధికారులను ఆదేశిం చారు. ఇందులో భాగంగా ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలువురు ఎంపీలను కలిసిన రైల్వే జీఎం 27న ఎంపీ వినోద్‌తో సమావేశం కానున్నారు. -
విజయవాడ–విశాఖ మధ్య కొత్త రైలు!
కొత్త రైల్వే టైం టేబుల్లో ప్రకటించే అవకాశం సాక్షి, హైదరాబాద్: విజయవాడ–విశాఖపట్నం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేం దుకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. దీన్ని అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చే రైల్వే కొత్త టైం టేబుల్లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి వివరాలు సిద్ధం చేస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాదీ జూలై నుంచి కొత్త టైం టేబుల్ అమలులోకి వస్తుంది. అయితే ఈ సారి హమ్‌సఫర్, తేజస్‌ల పేరుతో కొత్త పథకాలను ప్రారంభించాలని నిర్ణయించటంతో జూలై నాటికి ఆ కసరత్తు పూర్తి కాలేదు. గత బడ్జెట్లో దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లను ఇవ్వలేదు. కానీ యూపీఏ హయాంలో ప్రకటించి పట్టాలెక్కని రెండు ఎక్స్‌ప్రెస్‌లను మాత్రం ఇటీవల రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రారంభించారు. కొత్తగా ఇప్పుడు రెండు రైళ్లను ప్రకటించి టైంటేబుల్లో నమోదే చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ–విశాఖపట్నం మధ్య ఎక్స్‌ప్రెస్‌ను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. -
'శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు'
తిరుమల: తిరుమల తిరుపతి నుంచి షిర్డీకి మధ్య నూతన రైలు వస్తోంది. శనివారం రైల్వేమంత్రి సురేష్ ప్రభు తిరుపతి-షిర్డీ కొత్త రైలు ప్రారంభోత్సవం చేశారు. జెండా ఊపి నూతన రైలును ఆయన ప్రారంభించారు. రైలు ప్రారంభోత్సవం అనంతరం సురేష్ ప్రభు విలేకరులతో మాట్లాడారు. తిరుపతి స్టేషన్‌ను మరింత అభివృద్ధి పరుస్తామని చెప్పారు. అంతేకాక శ్రీవారి భక్తులకు మరిన్ని రైల్వే సౌకర్యాలు కల్పిస్తామని సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. -
నేటినుంచి బీదర్-యశ్వంత్‌పూర్ ట్రైవీక్లీ ఎక్స్‌ప్రెస్
తాండూరు, న్యూస్‌లైన్: రంగారెడ్డి, మెదక్, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా, యాద్గిర్, రాయచూర్ జిల్లావాసులకు నేటినుంచి కొత్త రైలు అందుబాటులోకి రానుంది. బీదర్ - యశ్వంత్‌పూర్ (రైలు నంబర్ 16572/16571) ట్రై వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఆదివారం ఉదయం బీదర్‌లో రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖర్గే లాంఛనంగా ప్రారంభించనున్నట్టు రైల్వే వర్గాల సమాచారం. ఈ నెల 4వ తేదీ నుంచి ఈ రైలు రెగ్యులర్‌గా వారంలో మూడు రోజులు నడవనున్నది. జిల్లాకు సంబంధించి వికారాబాద్‌లో ఈ రైలుకు హాల్టింగ్ కల్పించారు. బీదర్ - యశ్వంతపూర్ (నం.16572) రైలు ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో, యశ్వంతపూర్ - బీదర్ (నం.16571) రైలు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో నడుస్తుంది. ఆయా రోజుల్లో బీదర్ నుంచి సాయంత్రం 6.25 గంటలకు ఈ రైలు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు యశ్వంతపూర్‌కు చేరుకుంటుం ది. అదేవిధంగా యశ్వం త్పూర్ నుంచి రాత్రి 7.15గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30గంటలకు బీదర్‌కు చేరుకుంటుంది. వికారాబాద్‌కు చేరుకునే సమయం బీదర్ నుంచి వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు ఆయా వారాల్లో రాత్రి 8.30గంటలకు, యశ్వంత్‌పూర్ నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 7.27 గంటలకు వికారాబాద్‌లో ఈ ఎక్స్‌ప్రెస్ 5 నిమిషాలు ఆగనుంది. తాండూరుకు మొండిచేయి.. అయితే జిల్లాలోనే ప్రధాన వ్యాపారకేంద్రమైన తాండూరు రైల్వేస్టేషన్లో మాత్రం ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. రోజుకు సుమారు రూ.2లక్షల ఆదాయం వచ్చే తాండూరు రైల్వేస్టేషన్లో ఈ కొత్త రైలుకు హాల్టింగ్ కల్పించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు రైల్వేస్టేషన్లో ఈ రైలును ఆపితే బెంగళూరు, కర్నూలు నుంచి నాపరాతి, సిమెంట్ ఉత్పత్తుల వ్యాపార లావాదేవీల కోసం రాకపోకలు సాగించే వ్యాపారులకు వెసులుబాటుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సాయంత్రం 3.30గంటలకు తాండూరు నుంచి బెంగళూరుకు లింక్ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉంది. ఈ రైలు బెంగళూరుకు మరుసటి రోజు ఉదయం 6.30గంటలకు చేరుకుంటుంది. ప్రయాణానికి సుమారు 15గంటలు పడుతోంది. అదే బీదర్ -యశ్వంత్‌పూర్ రైలుకు తాండూరులో హాల్టింగ్ ఇస్తే వికారాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 8.30గంటలకు బయలుదేరి సుమారు రాత్రి 9.10గంటలకు ఇక్కడికి వ స్తుంది. ఇక్కడి నుంచి యశ్వంత్‌పూర్‌కు ఉదయం 7.40గంటలకు చేరుకుంటుంది. తద్వారా తాండూరు నుంచి 10.30గంటల ప్రయాణం పడుతుంది. దీంతో సుమారు 5గంటల సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు. కేంద్ర కేబినెట్లో కీలకపాత్ర పోషిస్తున్న జైపాల్‌రెడ్డి కొత్త రైలుకు తాండూరులో హాల్టింగ్‌కు చొరవచూపాలని వారు కోరుతున్నారు.