విజయవాడ–విశాఖ మధ్య కొత్త రైలు!
కొత్త రైల్వే టైం టేబుల్‌లో ప్రకటించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: విజయవాడ–విశాఖపట్నం మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించేం దుకు రైల్వే సన్నాహాలు చేస్తోంది. దీన్ని అక్టోబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చే రైల్వే కొత్త టైం టేబుల్‌లో ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించి వివరాలు సిద్ధం చేస్తోంది.
సాధారణంగా ప్రతి ఏడాదీ జూలై నుంచి కొత్త టైం టేబుల్ అమలులోకి వస్తుంది. అయితే ఈ సారి హమ్‌సఫర్, తేజస్‌ల పేరుతో కొత్త పథకాలను ప్రారంభించాలని నిర్ణయించటంతో జూలై నాటికి ఆ కసరత్తు పూర్తి కాలేదు. గత బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లను ఇవ్వలేదు.
కానీ యూపీఏ హయాంలో ప్రకటించి పట్టాలెక్కని రెండు ఎక్స్‌ప్రెస్‌లను మాత్రం ఇటీవల రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ప్రారంభించారు. కొత్తగా ఇప్పుడు రెండు రైళ్లను ప్రకటించి టైంటేబుల్‌లో నమోదే చేసే అవకాశం కనిపిస్తోంది. విజయవాడ–విశాఖపట్నం మధ్య ఎక్స్‌ప్రెస్‌ను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.