న్యూఢిల్లీ: ప్రయోగాత్మక పరీక్షల్లో ‘ట్రైన్–18’ రైలు గంటకు 180 కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో పరుగులు పెట్టిందని రైల్వే అధికారులు చెప్పారు. రూ. 100 కోట్ల వ్యయంతో చెన్నైలో తయారైన ఈ రైలు గంటలకు 200 కిలోమీటర్ల వేగంతో కూడా దూసుకుపోగలదనీ, అయితే అందుకు తగ్గట్లుగా రైలు పట్టాలు, సిగ్నల్ వ్యవస్థ అవసరమని అధికారి చెప్పారు. ప్రస్తుతం సాధారణ రైళ్లలో ఒక్క ఇంజినే రైలులోని బోగీలన్నింటినీ లాగుతుండటం తెలిసిందే. ట్రైన్–18లో ఇలా బోగీలను లాగేందుకు ప్రత్యేకంగా ఇంజిన్ ఏదీ ఉండదు.
బదులుగా ప్రతి రెండు బోగీల్లో ఒకదానికి శక్తిమంతమైన మోటార్లు ఉంటాయి. కాబట్టి రైలు త్వరగా వేగం అందుకుంటుంది. ఇప్పటికే ఈ సాంకేతికతను పెద్ద నగరాల్లో సేవలందించే లోకల్ ట్రైన్స్, మెట్రో రైళ్లలోనూ ఉపయోగిస్తున్నప్పటికీ వాటి వేగం గరిష్టంగా గంటకు 100 కిలో మీటర్ల వరకే ఉంటోంది. గంటకు 180 కిలో మీటర్ల వేగంతో నడిచే ట్రైన్–18ను శతాబ్ది రైళ్ల స్థానంలో ప్రవేశపెట్టనున్నారు. వచ్చే నెలలోనే తొలి ట్రైన్–18 ప్రయాణికులకు సేవలు అందించే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment