newest
-
లైక్ కొడితే రూ.50...కామెంట్ పెడితే రూ.100
కూర్చున్నచోటే రోజుకు రూ.వేల సంపాదన మీ సొంతం.. మీరు చేయాల్సిందల్లా మేం పంపే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఓపెన్ చేసి వాటిలోని వీడియోలు, ఫొటోలకు లైక్ కొట్టడమే.. అలా లైక్ కొట్టిన స్క్రీన్‌షాట్ మాకు పంపితే ఒక్కో అకౌంట్ స్క్రీన్‌షాట్‌కు రూ.100 చొప్పున మీ ఖాతాలో జమ చేస్తాం... మేం చెప్పిన యూట్యూబ్ వీడియోకు లైక్ కొడితే రూ.50... మేం చెప్పిన సినిమా రివ్యూకు ఐదు పాయింట్లు ఇస్తే.. మీ ఖాతాల్లో రూ.150 వేస్తాం.... ఏంటి ఇదంతా నిజం అనుకుంటున్నారా..? ఇదో సరికొత్త సైబర్ మోసం.. టెలిగ్రామ్ వేదికగా జరుగుతున్న ఈ తరహా మోసాలు ఇప్పుడు పెరిగాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాస్క్‌బేస్డ్ స్కాం అంటే.. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుకుతూనే ఉన్నారు. టెలిగ్రామ్ యూజర్లను టార్గెట్ చేసుకుని టాస్క్‌బేస్డ్ స్కాంలు చేస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. టెలిగ్రామ్ యూజర్లకు సైబర్ నేరగాళ్లు కొన్ని మెసేజ్‌లు పంపుతూ అందులో పేర్కొన్న టాస్క్పూర్తి చేస్తే డబ్బులు మీ ఖాతాలో వేస్తామని చెప్పే మోసాన్నే టాస్క్‌బేస్డ్ స్కాంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టాస్క్‌బేస్డ్ మోసాలు చూస్తే... ఈ ఖాతాలు ఫాలోకండి.. టెలిగ్రామ్ యూజర్లకు పంపే మెసేజ్‌లలో మేం పంపే లింక్ ఓపెన్ చేసి ఈ ఇన్స్టాగ్రామ్ ఖాతా లను ఫాలో అవుతూ, వాటిని ఓపెన్ చేసి స్క్రీన్‌షాట్ తీసి పంపితే డబ్బులు పంపుతామంటారు. రోజుకు 30 నుంచి 50 ఖాతాలు ఫాలో కావాలని చెబుతారు. యూ ట్యూబ్ వీడియోలకు లైక్‌లు..: సైబర్ మోసగాళ్లు పంపే మెసేజ్‌లలో కొన్ని యూట్యూబ్ వీడియోల లింక్‌లు పెడతారు. వాటిని ఓపెన్ చేసి ఆ వీడియోకు కాసేపు వాచ్ చేయడంతోపాటు లైక్ కొడితే మీ ఖాతాలో డబ్బులు వేస్తామని నమ్మబలుకుతారు. హోటళ్లు, రెస్టారెంట్లకు రేటింగ్ పేరిట..: ఫలానా హోటల్, లేదంటే ఒక ఏరియాలోని రెస్టారెంట్లో సదుపాయాలు చాలా బాగున్నాయని, ఫుడ్ ఐటమ్స్ బాగున్నాయని, ఆఫర్లు బాగున్నాయని..ఇలాంటి రివ్యూలు, రేటింగ్ ఇచ్చినందుకు డబ్బులు ఇస్తామని చెబుతుంటారు. సినిమా రివ్యూలకు రేటింగ్.. మేం పంపే లింక్ ఓపెన్ చేసి అందులోని వెబ్సైట్లో ఉన్న సినిమా రివ్యూలకు రేటింగ్ ఇవ్వాలని టాస్క్ ఇస్తారు..ఇలా ఒక్కో రివ్యూకు రేటింగ్ ఇస్తే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తామని టాస్క్ ఇస్తారు. మోసానికి తెరతీస్తారు ఇలా.. ముందుగా ఇచ్చిన టాస్క్పూర్తి చేసిన తర్వాత, మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామంటూ పేరు, వయస్సు, వృత్తి, వాట్సాప్ నంబర్, ఏ ప్రాంతంలో ఉంటారు..విద్యార్హతలు, బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఇలా పూర్తి వివరాలు సేకరిస్తారు. మొదట ఒకటి రెండు సార్లు మన బ్యాంకు ఖాతాలోకి చిన్నచిన్న మొత్తాలు జమ చేసి నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత మన బ్యాంకు ఖాతాలోంచి ఆన్లైన్లో డబ్బులు కొల్లగొట్టే మోసానికి తెరతీస్తారు. మన పూర్తి వివరాలతోపాటు, మన ఫోన్, కంప్యూటర్ను వారి అ«దీనంలోకి తీసుకుని ఓటీపీలను సైతం తెలుసుకుని, మన బ్యాంకు ఖాతాలు లూటీ చేస్తారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఇలాంటి మెసేజ్‌లు చూస్తే అనుమానించాల్సిందే.. ఆన్లైన్లో సైబర్ మోసాలు పెరుగుతున్నందున వీలైనంత వరకు అనుమానాస్పద మెసేజ్‌లలోని లింక్‌లపై ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు. అడ్డగోలు లాభాలు ఇస్తామని ఊదరగొడుతున్నారంటే అది కచ్చితంగా సైబర్ మోసమని గ్రహించాలి. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతున్నట్టు గమనిస్తే జాగ్రత్తపడాలి. అపరిచిత వ్యక్తులు ఆన్లైన్లో మనకు పంపే మెసేజ్‌లను నమ్మవద్దు. -
ఒక్కరోజులోనే 3.09 లక్షల కార్డులు
భూపాలపల్లి: ఇది సరికొత్త రేషన్ రికార్డు.. సోమవారం ఒక్కరోజే రాష్ట్ర ప్రభుత్వం 3,09,083 రేషన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేసింది. పేదల ఖాళీ కడుపులను నింపే క్రమంలో రికార్డు సృష్టించింది. ఇంత పెద్దసంఖ్యలో రేషన్‌కార్డులు పంపిణీ చేయడం దేశంలోనే ఇది తొలిసారి అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 90.50 లక్షల రేషన్‌కార్డుల ద్వారా 2.88 కోట్లమంది లబ్ధిదారులకు రూ.2,766 కోట్ల విలువైన ఆహారధాన్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. 2014కు ముందు అర్హులు సైతం రేషన్‌కార్డు కోసం పైరవీకారులను ఆశ్రయించేవారని, తాను 2009లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అడుక్కున్నా అప్పటి ప్రభుత్వం ఒక్క కార్డు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. ఇప్పుడు పైరవీలకు తావివ్వకుండా, పారదర్శకంగా అర్హులందరికీ రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ పేదల కడుపు నింపాలనే సదుద్దేశంతో కొత్త రేషన్‌కార్డులను మంజూరు చేయడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
70 ఏళ్లకు కనిపించిన సర్పం
ఈటానగర్: అదో అత్యంత అరుదైన విషసర్పం. ఎప్పుడో సుమారు 70 ఏళ్ల క్రితం అంటే దేశానికి స్వాతంత్య్రం సిద్ధిస్తున్న సమయంలో దేశంలో కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లకి అలాంటి అరుదైన జాతి సర్పాన్ని అరుణాచల్‌ప్రదేశ్ అడవుల్లో పరిశోధకులు గుర్తించారు. స్వాతంత్య్రం సమయంలో కనిపించినవి 4 పాములు కాగా.. తాజాగా గుర్తింపుతో వీటి సంఖ్య ఐదుకి చేరింది. ఇంతకీ అంతటి అరుదైన పాము ఏంటా అనుకుంటున్నారా..? దాని పేరే పిట్ వైపర్. అరుణాచల్‌ప్రదేశ్‌లోని పశ్చిమ కమెంగ్ జిల్లా ఈగల్నెస్ట్లోని అడవుల్లో సరీసృపాలపై నిర్వహించిన పరిశోధనల్లో ఓ పామును కనుగొన్నారు. చెట్ల మధ్యన దాక్కుని.. చెట్ల ఆకుల్లో కలిసిపోయేలా ఉన్న దీని డీఎన్ఏపై పరిశోధనలు జరిపి.. పిట్ వైపర్ జాతికి చెందినదిగా గుర్తించారు. అయితే ఇది కొత్త రకం పిట్ వైపర్ అని కనుగొన్నారు. ఈ పాముకు అరుణాచల్ ప్రదేశ్ పేరు మీదుగా ‘అరుణాచల్ పిట్ వైపర్’(ట్రైమెరెసురస్ అరుణాచలెనిస్) అని నామకరణం చేశారు. ఇలా ఓ సర్పానికి రాష్ట్రంపేరు కలుపుతూ పేరు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి. మరో కొత్త రకం.. ప్రస్తుతం కనుగొన్న సర్పం పిట్ వైపర్ జాతికే చెందినప్పటికీ.. ఈ జాతిలో ఇది కొత్త రకం అని వారు చెబుతున్నారు. ఇది ముదురు ఎరుపు, గోధుమ రంగుల కలయికతో స్థానిక చెట్ల రంగులతో కలిసిపోయిందని తెలిపారు. ఈ సర్పాలకు తల భాగంలో రెండు వైపులా పిట్స్ (చిన్న రంధ్రాలు) ఉంటాయి. ఈ పాములకు మాత్రమే ఇలాంటి ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. అందుకే వీటికి పిట్ వైపర్ అంటారు. తమ ఎదుట ఉన్న జీవుల శరీరంలోని వేడి ద్వారా అది ఏ తరహా జీవో అంచనా వేయడంతోపాటు వాటి ఆధారంగా వేట సాగించడం వీటి ప్రత్యేకత. సంతానోత్పత్తిపై ప్రయోగాలు.. ‘అరుణాచల్ పిట్ వైపర్‌కు సంబంధించి ప్రస్తుతం మాకు ఏమీ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మాకు దొరికింది ఒక మగజాతి పిట్ వైపర్ మాత్రమే. మరిన్ని పరిశోధనలు జరపడం ద్వారా దీని సహజ లక్షణాలను తెలుసుకోగలం. ఇవి ఏం ఆహారం తీసుకుంటాయి.. రోజువారీ అలవాట్లు, సంతానోత్పత్తి క్రమంలో గుడ్లు పెడతాయా? లేక నేరుగా పిల్లలకు జన్మనిస్తాయా? అనే విషయంపై పరిశోధనలు సాగించాలి’అని ఈ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన హెర్పటాలజిస్ట్ అశోక్ కెప్టెన్ తెలిపారు. మిగతా నాలుగు ఇవే.. మలబార్ పిట్ వైపర్, హార్స్‌షూ పిట్ వైపర్, హంప్ నోస్డ్ పిట్ వైపర్, హిమాలయన్ పిట్ వైపర్లను సుమారు 70 ఏళ్ల కింద దేశంలో కనుగొన్నట్లు అశోక్ చెప్పారు. ఈ బృందంలో వి.దీపక్, రోహన్ పండిట్, భరత్ భట్, రమణ ఆత్రేయ సభ్యులుగా ఉన్నారు. ఈ పరిశోధన వివరాలు రష్యన్ జర్నల్ ఆఫ్ హెర్పటాలజీ, మార్చి–ఏప్రిల్ సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఆకట్టుకుంటున్న వాటర్ కేక్!
న్యూయార్క్ః భోజన ప్రియులు ఇప్పటికే ఎన్నో రకాల కేక్ లను రుచి చూసి ఉంటారు. కానీ వాటర్ కేక్ ను ఎప్పుడైనా తిన్నారా? ఇప్పుడు నీటితో తయారయ్యే స్వచ్ఛమైన నీటి బిందువులా కనిపించే వాటర్ కేక్ అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటిదాకా గుడ్డుతోనూ, గుడ్డు లేకుండానూ కూడా కేక్ లు తయారు చేయడం చూశాం. ఇప్పుడా రోజులు పోయి ఏకంగా నీటితోనే చవులూరించే రుచికరమైన కేక్ లు కొన్ని దేశాల్లో తయారైపోతున్నాయ్... స్వచ్ఛమైన నీటితో కేక్ ను తయారు చేయడం కొత్తగా కనుగొన్నారు న్యూయార్క్ వాసులు. ఈ కొత్త ప్రయోగానికి జనం ఆకర్షితులయ్యారంటే ఇక వెస్ట్ కోస్ట్ ప్రాంతంలో త్వరలో మంచినీటికి ఎద్దడి ఏర్పడక తప్పదేమో అంటున్నారు వినియోగదారులు. తాజాగా తయారైన వాటర్ కేక్ ఇప్పుడు న్యూయార్క్ లోని సామాజిక మీడియాలో హల్ చల్ చేస్తోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ట్రెండ్ గా వినియోగదారులను అమితంగా ఆకట్టుకుంటోంది. స్మార్గాస్ బర్గ్ లో ఈ సంవత్సరం అత్యంత ఆదరణను చూరగొన్నఈ జపనీస్ డెజర్ట్ ను మిజు షింగెన్ మోచీగా పిలుస్తున్నారు. జపాన్ లోని కేక్ ల సృష్టికర్త.. డేరెన్ వాంగ్ సృష్టించిన ఈ స్ఫటికాకారంలో ఉన్ననీటి వంటకాన్ని(వాటర్ కేక్) న్యూయార్క్ కు తీసుకొచ్చి రైన్ డ్రాప్ కేక్ గా మార్చారు. మృదువుగా, ట్రాన్స్పరెంట్ జెల్లీలా కనిపించే వాటర్ కేక్ ను ముక్కలు ముక్కలుగా కూడ కోయచ్చు. అయితే దీన్ని కాస్త భద్రంగా కూడ నిల్వ ఉంచాల్సి వస్తుంది. వేడి తగిలినా, ఎక్కువ రోజులు నిల్వ ఉంచినా కరిగిపోతుంది. ఇప్పటికే పలు రకాల ఆహార పదార్థాలను సృష్టించి, తన ప్రయోగాలతో ఇన్ స్టాగ్రామ్ యూజర్లను అమితంగా ఆకట్టుకుంటున్న వాంగ్ కేవలం ఘనీభవించిన నీరు, జెలటిన్ తో ఈ కేక్ ను తయారు చేశారు. ఇలా తయారు చేసిన వాటర్ కేక్ పై బ్రౌన్ సుగర్ సిరప్, వేయించిన సోయా పిండి చల్లి వడ్డిస్తున్నారు. జపాన్ లో వాటర్ కేక్ గా గుర్తింపు పొందిన ఈ కేక్ ఇప్పుడు న్యూయార్క్ ప్రజలకు రైన్ డ్రాప్ కేక్ గానూ పరిచయమై ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది.