రికార్డు గరిష్టం నుంచి వెంటనే ఫ్లాట్..
సాక్షి, ముంబై : ట్రేడింగ్ ప్రారంభంలో గరిష్ట రికార్డులో ఎగిసిన నిఫ్టీ, వెంటనే కిందకి పడిపోయింది. ఫెడరల్ రిజర్వు రెండు రోజుల మానిటరీ పాలసీ మీటింగ్ నేటి అర్థరాత్రి నుంచి మొదలు కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 10,179 వద్ద గరిష్ట స్థాయిలను నమోదుచేసిన నిఫ్టీ, ప్రస్తుతం 10,152 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ సైతం ప్రారంభంలో 80 పాయింట్ల మేర జంప్ చేసి, అనంతరం కిందకి పడిపోయింది. ఇది కూడా ఫ్లాట్‌గా లాభనష్టాల ఊగిసలాట ధోరణిలో 32,424 మార్కు వద్ద నమోదవుతోంది.
బయోకాన్, భారత్ గేర్స్, దివీస్ ల్యాబ్స్, డిక్సన్ టెక్నాలజీస్, ఆటోలైట్, టీవీఎస్ ఎలక్ట్రానిక్స్, గ్రాఫైట్ ఇండియా, ఏడీఎఫ్ ఫుడ్స్ 10 శాతం మేర లాభాలు పండిస్తున్నాయి. ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్, భారత్ రోడ్డు నెట్వర్క్, మిర్క్ ఎలక్ట్రానిక్స్ 6 శాతం మేర నష్టపోతున్నాయి. గ్యాస్ స్టాక్స్ కూడా నేడు లాభాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్ వరుసగా ఐదు రోజు రికార్డు స్థాయిలో ముగిసింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసల నష్టంలో 64.15గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా 311 రూపాయల మేర పడిపోయి 29,545 రూపాయల వద్ద ట్రేడవుతున్నాయి.