దాతృత్వంలో డాన్!
నల్లవాళ్లలో ఆయనంత ఉన్నవారెవరూ లేరు... అని అంటోంది ప్రపంచం. తన దాతృత్వంతో తనంతటి మనసున్న వాళ్లు కూడా ఎవరూ లేరని నిరూపించుకొన్నాడాయన. ఆయన పేరు అలికో డాన్గోట్. నైజీరియాకు చెందిన ఈ వ్యాపారవేత్త ఫోర్బ్స్ ఎంపిక చేసిన ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 23 వస్థానంలో ఉన్నారు.
టాప్ 25లో నిలిచిన తొలి ఆఫ్రికన్‌గా గుర్తింపు పొందారు. అదే సమయంలో భారీస్థాయిలో తన ఆస్తులను ఆఫ్రికన్ల అభ్యున్నతి కోసం ఖర్చుపెడుతున్న వ్యక్తిగా కూడా డాన్గోట్కు గుర్తింపు వచ్చింది.
సినిమాల్లో హీరోలు చిన్న వ్యాపారం మొదలుపెట్టి కోటీశ్వరులుగా ఎదిగిపోవడాన్ని చూసి మనమంతా ఆశ్చర్యపోతాం కానీ... అలా అత్యంత సాధారణస్థితి నుంచి కోటీశ్వరులుగా ఎదిగిన వారు నిజజీవితంలో కూడా ఉంటారనేదానికి ఒకానొక నిరూపణ అలికో డాన్గోట్. ఈ నైజీరియన్ 1977లో ఒక చిన్న వ్యాపారంతో కెరీర్ మొదలుపెట్టాడు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన వ్యాపారమే జీవనాధారంగా, ఆ వ్యాపారాన్నే పెకైదగడానికి నిచ్చెనగా చేసుకొని ఎదిగాడు. ప్రస్తుతం వేల, లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు. 24 బిలియన్ డాలర్లు...ఫుడ్ ప్రాసింగ్ యూనిట్లు, సాఫ్ట్‌డ్రింక్ ప్రోడక్ట్‌లు, బ్రేవరీస్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు, వేల మంది ఉద్యోగులు, ఐదు ఆఫ్రికన్ దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం... ఇదీ డాన్గోట్ స్థాయి.
1981లో తన వ్యాపార సంస్థలన్నింటికీ కలిపి డాన్గోట్ గ్రూప్‌గా పేరు పెట్టాడాయన. ఇప్పుడు ఆఫ్రికాలోనే ఇది ఒక ప్రముఖమైన వ్యాపార సంస్థ. డాన్గోట్ సంపాదన తీరు ఇలా ఉంటే... ఈయన దాతృత్వంలో కూడా ఇంతే ఘనమైన స్థాయిలో ఉన్నారు. ఈ ఏడాదిలో 120 కోట్ల మొత్తాన్ని సేవాకార్యక్రమాల కోసం వినియోగించేందుకు నిర్ణయం తీసుకొన్నారు. ‘డాన్గోట్ ఫౌండేషన్’ ద్వారా ఆప్రికాలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తామని ఆయన ప్రకటించారు. భవిష్యత్తులో తమ సేవాకార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామని ఆయన అన్నారు. ఈ విధంగా కేవలం ఆస్తుల సంపాదనతోనే కాకుండా ఇలాంటి దాతృత్వంతో కూడా ఆయన డాన్ అనిపించుకొన్నారు.