nine members arrested
-
వాస్తు పూజల పేరిట మోసం
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): వాస్తు పూజలు చేస్తే కుటుంబానికి మంచి జరుగుతుందని చెప్పి మోసం చేసిన 9 మందిపై కేసు నమోదు చేసినట్లు హుస్నాబాద్ ఏసీపీ ఎస్.మహేందర్ తెలిపారు. సోమవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ రఘుతో కలిసి ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తిరుగుతూ జాతకాలు, వాస్తు పూజలు చేస్తూ జీవనం సాగించే సిరిసిల్ల జిల్లా చీర్లవంచకు చెందిన గందం జంపయ్య ఈ నెల 17న మండల పరిధిలోని ఆకునూరుకు చెందిన జక్కు నర్సింహులు ఇంటికి వచ్చి మీ ఇంట్లో శక్తులు ఉన్నాయని, వాటిని తీసివేస్తే మీకు అంతా మంచి జరుగుతుందని నమ్మించి రూ.46 వేల విలువైన పూజ సామను (స్వర్ణభస్మం) తీసుకుని మరుసటి రోజు మరో ఇద్దరు వ్యక్తులతో వచ్చి ఊదు పొగ వేసి మంత్రాలు చదివినట్లు చేసి మరో రూ.10 వేలు, ఒక గొర్రె పిల్లను తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న నర్సింహులు కుమారుడు ఈ నెల 23న చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్న క్రమంలో సోమవారం కొందరు వ్యక్తులు మారుతీ కారులో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు వేములవాడకు చెందిన బూర రాజును అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు వారి నుంచి రూ.55 వేలు నగదు, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ విషయంలో చీర్లవంచకు చెందిన గందం నీలయ్య, టేకు దుర్గయ్య, కడమంచి లింగమయ్య, బూర రాజుతో పాటు మరో నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. కేసును త్వరగా విచారణ చేసి నిందితులను పట్టుకున్న ఎస్ఐ మోహన్‌బాబు, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్
పెనమలూరు : పోరంకిలో పాత నేరస్తుడు పోలిశెట్టి దుర్గారావు(25) హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. పెనమలూరు సీఐ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం... పోలిశెట్టి దుర్గారావు పోరంకిలో నివసించేవాడు. ఆ సమయంలో అతనిపై రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అతను కొంతకాలంగా భార్య భవానీతో కలిసి నందిగామ, చందర్లపాడు ప్రాంతాల్లో ఉంటున్నాడు. దుర్గారావు ఈ నెల 18వ తేదీన పోరంకి వచ్చి స్నేహితుడు రాకేష్‌తో కలసి స్థానింకగా నివసించే ఈడేటి చరణ్, రత్రాకరం సాయికృష్ణతేజ(మేక)తో గొడవపడ్డాడు. వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో దుర్గారావును హతమార్చాలని చరణ్ తన మిత్రుడు పూలా సాయినరేంద్ర(దొంగసాయి)తో కలసి వెంటనే పథకం రూపొందించాడు. అదే రోజు రాత్రి పోరంకి ప్రభునగర్ పార్కుకు రావాలని దుర్గారావును నమ్మకంగా పలిచారు. అతను వచ్చిన వెంటనే గొడవపడి కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచారు. బీరు సీసాతో గొంతు కోశారు. బండరాయితో తలపై కొట్టి చంపారు. అనంతరం నిందితులు పారిపోయారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో విచారణ చేశారు. పూలా సాయినరేంద్ర(దొంగసాయి) ఈడేటి చరణ్ (ఛీటర్ చరణ్)తోపాటు గొట్టి మోహనకృష్ణ, సాయిన అనంత్‌కుమార్, తిరుపతినాయుడు(జిల్లా బాబి), అబ్దుల్ అక్బర్, వాకా రవితేజ, వేమూరి సాయిలీలాకృష్ణ, రత్నాకరం సాయికృష్ణతేజ కలిసి ఈ హత్య చేశారని గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. కేవలం దురలవాట్లకు బైనిసలుగా మారిన నిందితులు గంజాయి, మద్యం తాగి ఈ హత్య చేశారని తెలిపారు.