హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్
పెనమలూరు :
పోరంకిలో పాత నేరస్తుడు పోలిశెట్టి దుర్గారావు(25) హత్య కేసులో తొమ్మిది మంది నిందితులను ఆదివారం అరెస్ట్ చేశారు. పెనమలూరు సీఐ దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం... పోలిశెట్టి దుర్గారావు పోరంకిలో నివసించేవాడు. ఆ సమయంలో అతనిపై రెండు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. అతను కొంతకాలంగా భార్య భవానీతో కలిసి నందిగామ, చందర్లపాడు ప్రాంతాల్లో ఉంటున్నాడు. దుర్గారావు ఈ నెల 18వ తేదీన పోరంకి వచ్చి స్నేహితుడు రాకేష్‌తో కలసి స్థానింకగా నివసించే ఈడేటి చరణ్, రత్రాకరం సాయికృష్ణతేజ(మేక)తో గొడవపడ్డాడు. వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో దుర్గారావును హతమార్చాలని చరణ్ తన మిత్రుడు పూలా సాయినరేంద్ర(దొంగసాయి)తో కలసి వెంటనే పథకం రూపొందించాడు. అదే రోజు రాత్రి పోరంకి ప్రభునగర్ పార్కుకు రావాలని దుర్గారావును నమ్మకంగా పలిచారు. అతను వచ్చిన వెంటనే గొడవపడి కళ్లలో కారం చల్లి కత్తితో పొడిచారు. బీరు సీసాతో గొంతు కోశారు. బండరాయితో తలపై కొట్టి చంపారు. అనంతరం నిందితులు పారిపోయారు. పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో విచారణ చేశారు. పూలా సాయినరేంద్ర(దొంగసాయి) ఈడేటి చరణ్ (ఛీటర్ చరణ్)తోపాటు గొట్టి మోహనకృష్ణ, సాయిన అనంత్‌కుమార్, తిరుపతినాయుడు(జిల్లా బాబి), అబ్దుల్ అక్బర్, వాకా రవితేజ, వేమూరి సాయిలీలాకృష్ణ, రత్నాకరం సాయికృష్ణతేజ కలిసి ఈ హత్య చేశారని గుర్తించారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. కేవలం దురలవాట్లకు బైనిసలుగా మారిన నిందితులు గంజాయి, మద్యం తాగి ఈ హత్య చేశారని తెలిపారు.