ninth place
-
రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తాం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన సోమవారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) పథకం కింద తొమ్మిదో విడతలో 9.75 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు బదిలీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పంటల సాగుకు పీఎం–కిసాన్ సొమ్ము రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అన్నదాతల ఆదాయాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని, అన్ని రకాల వనరులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. మన రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో పథకాల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. రూ.లక్ష కోట్లతో అగ్రి–ఇన్ఫ్రా ఫండ్ ఏర్పాటు చేశామన్నారు. హనీ బీ(తేనెటీగలు) మిషన్‌తో మన దేశం నుంచి తేనె ఎగుమతులు భారీగా పెరిగాయని, తద్వారా తేనెటీగల పెంపకందారులు అదనపు ఆదాయం పొందుతున్నారని వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సాగయ్యే కుంకుమ పువ్వును ‘నాఫెడ్’ రిటైల్ స్టోర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రికార్డు స్థాయిలో ఉత్పత్తి కరోనా ప్రతికూల కాలంలోనూ 2020–21లో రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారని మోదీ ప్రశంసించారు. వరి, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలోనే కాదు, వంట నూనెల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో తృణ ధాన్యాల ఉత్పత్తి గత ఆరేళ్లలో 50 శాతం పెరిగిందని, దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం టాప్–10 దేశాల జాబితాలో చేరిందన్నారు. -
అటవీ విస్తీర్ణం పెరుగుదలలో..తెలంగాణకు తొమ్మిదో స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అటవీ విస్తీర్ణం పెరుగుదల కనబరిచిన రాష్ట్రాల్లో తెలంగాణ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తెలంగాణలో 163 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 1,025 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరుగుదలతో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. భారత అటవీ నివేదిక–2019లో (ఐఎస్ఎఫ్ఆర్) ఈ విషయాలు వెల్లడయ్యాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ 16వ ఐఎస్ఎఫ్ఆర్ నివేదికను సోమవారం ఇక్కడ ఆవిష్కరించారు. అటవీ విస్తీర్ణం పెరుగుదల కనిపించిన రాష్ట్రాల్లో కేరళ మూడో స్థానంలో నిలిచింది. కేరళలో 823 చదరపు కి.మీ. మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. దేశంలో అటవీ విస్తీర్ణం–వనరుల వినియోగంపై భారత అటవీ సర్వే (ఎఫ్ఎస్ఐ) రెండేళ్లకోసారి నివేదిక రూపొందిస్తుంది. దీని ప్రకారం గత రెండేళ్లలో దేశంలో 5,188 చదరపు కిలోమీటర్ల మేర అటవీ విస్తీర్ణం పెరిగింది. 2017, 2018 సంవత్సరాలకు సంబంధించిన డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు: ప్రకాష్ జవదేకర్ నల్లమలలో యురేనియం నిక్షేపాల ఉనికిపై అధ్యయనం చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చామని ప్రకాష్ జవదేకర్ స్పష్టం చేశారు. ఐఎస్ఎఫ్ఆర్ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంబంధిత అంశంపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. యురేనియం సహా ఏ ఖనిజ తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
తొమ్మిదో ర్యాంక్‌కి శ్రీకాంత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో కిడాంబి శ్రీకాంత్ ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. గురువారం విడుదల చేసిన ఈ జాబితాలో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన రెండో స్థానాన్ని నిలుపుకుంది. దుబాయ్‌లో గత వారం జరిగిన వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో తాను ఆడిన అన్ని గ్రూప్ మ్యాచ్‌ల్లోనూ ఓడడం శ్రీకాంత్ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపింది. పారుపల్లి కశ్యప్ కూడా 14 నుంచి 15వ స్థానానికి వచ్చాడు. ప్రణయ్ (20) ర్యాంకులో మార్పు లేదు. అజయ్ జయరాం 23 నుంచి 22కు వచ్చాడు. మహిళల ర్యాకింగ్స్లో పీవీ సింధు 12వ ర్యాంకులోనే ఉండగా డబుల్స్‌లో జ్వాల, అశ్విని జోడి 13వ స్థానాన్ని నిలుపుకున్నారు. -
హాకీలో భారత్‌కు తొమ్మిదో స్థానం
హేగ్ (నెదర్లాండ్స్): హాకీ ప్రపంచ కప్‌లో భారత్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. తొమ్మిది-పది స్థానాల కోసం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 3-0తో ఆసియా చాంపియన్ దక్షిణ కొరియాపై విజయం సాధించింది. భారత ఆటగాడు ఆకాష్దీప్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. గతేడాది ఆసియా కప్ ఫైనల్లో దక్షిణ కొరియా చేతిలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ తిరుగులేని ఆధిక్యం సాధించింది. ఆరో నిమిషంలోనే ఆకాష్దీప్ గోల్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. విరామం తర్వాత భారత్ ఇదే జోరు కొనసాగించింది. 42వ నిమిషంలో రూపేందర్ పాల్ సింగ్, 50వ నిమిషంలో ఆకాష్దీప్ మరో గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణ కొరియా బోణీ కూడా కొట్టలేకపోయింది.