మీ కష్టాల్లో అండగా ఉంటా...
గుమ్మలక్ష్మీపురం : భారీ ఈదురు గాలుల వల్ల ఇళ్లు నష్టపోయిన బాధితులందరికీ అండగా ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి భరోసా ఇచ్చారు. ఈ నెల 18 అర్థరాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గ్రామానికి చెందిన 18 మంది గిరిజనుల రేకిళ్లు తీవ్రంగా నష్టపోయిన సంగతి పాఠకులకు విదితమే.
ఈ సమాచారం తెలుసుకున్న కురుపాం ఎమ్మెల్యే ఆదివారం మధ్యాహ్నం వండిడి గ్రామాన్ని సందర్శించి ఇళ్లు నష్టపోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులంతా ఈదురు గాలులు సృష్టించిన బీభత్సంపై ఎమ్మెల్యే ముందు విన్నవించారు. సుమారు 19 ఏళ్ల కిందట తమకు రేకులు ఇచ్చారని, ఈ గాలుల వల్ల అవి ఎగిరిపోయి పాడవ్వడంతో తీవ్రంగా నష్టపోయామని, ఆదుకోవాలని కోరారు.
దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్వతీపురం ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లి, నష్టపరిహారం అందేలా చర్యలు చేపడతానన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, పాఠశాల భవన నిర్మాణం అర్థాంతరంగా ఉందని, ఆ భవనం నిర్మాణానికి కూలీ పనులకు వెళ్లిన తమకు నేటికీ కూలీ సొమ్ములు కూడా ఇవ్వలేదని, రహదారి సమస్య అలాగే ఉందని ఎమ్మెల్యే వద్ద ఏకరువు పెట్టారు.
ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పర్యటనలో ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, నాయకులు తోయక మాధవరావు, నిమ్మక గోపాల్, తాడంగి పాపారావు, కడ్రక వెంకటరావు, సునీల్ తదితరులు ఉన్నారు.