రణరంగమైన ‘నిజాం’ హాస్టల్
దత్తాత్రేయనగర్ /కలెక్టరేట్, న్యూస్‌లైన్: నిజాం కళాశాల హాస్టల్ శనివారం రణరంగంగా మారింది. ఏపీ ఎన్జీవోల సభ నేపథ్యంలో.. తెలంగాణ నినాదాలు చేస్తున్న విద్యార్థులపై పోలీసులు పలుమార్లు విరుచుకుపడ్డారు. వసతిగృహంలో టీఆర్ఎస్వీ నేత బాల్క సుమన్ హాస్టల్లో ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు లోనికి వెళ్లారు. సుమన్‌తో పాటు దాదాపు 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అనుమతి లేకుండా హాస్టల్లోకి రావడంపై విద్యార్థులు ప్రశ్నించగా.. వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు. దీంతో రోడ్లపైకి రాళ్లు రువ్వారు.
అనంతరం కొందరు హాస్టల్ భవనం ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు హాస్టల్ విడిచి వెళ్లకపోతే దూకుతామంటూ హెచ్చరించారు. పోలీసులు మరోసారి హాస్టల్ లోపలికి ప్రవేశించి భవనంపై ఎక్కి వారిని అదుపులో కి తీసుకోవడంతో కొద్ది సేపు పరిస్థితి సద్దుమణిగింది. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న నిజాం కళాశాల ప్రిన్సిపల్ టిఎల్ఎన్ స్వామి.. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్లోకి వచ్చేందుకు మీకెవరు అనుమతి ఇచ్చారని నిలదీశారు. అనుమతి లేకుండా హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులపై లాఠీచార్జి చేయడాన్ని ఖండించిన ఆయన.. ఓయూ వీసీకి దృష్టికి తీసుకెళ్లి, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
మధ్యాహ్నం సమయంలో విద్యార్థులు మళ్లీ భవనమెక్కి, జెతైలంగాణ నినాదాలు చేశారు. పోలీసులు మళ్లీ వెళ్లి కిందకు దింపేందుకు యత్నించారు. అయితే, పోలీసులు వెళ్లిపోవాలని కోరాగా.. పట్టించుకో ని పోలీసులు వారిని నెట్టివేశారు. ప్రతిఘటిం చిన వారిపై లాఠీలతో విరుచుకు పడ్డారు. దీం తో శేఖర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు కాగా, ప్రశాంత్ అనే విద్యార్థి చేయి విరిగింది. మరికొం దరికి గాయాలయ్యాయి. తోటి విద్యార్థులు శేఖర్‌ను చేతులపై ఎత్తుకుని బయటకు తీసుకురాగా, పోలీసులు డీసీఎంలో తీసుకెళ్లారు. అతని పరిస్థితి ఆందోళ న కరంగా ఉన్నట్లు సమాచారం.
జర్నలిస్టుల ధర్నా..
విద్యార్థులపై లాఠీచార్జి ఘటనను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాను పోలీసులు అనుమతించ లేదు. లోపల లాఠీచార్జి జరగడం లేదని వాదించారు. కానీ, పలువురు గాయాలతో బయటకు రావడంతో జర్నలిస్టులు లోనికి అనుమతించాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులు వారిని నెట్టివేయడంతో జర్నలిస్టులు అక్కడే ధర్నాకు దిగారు.
దాడులను ఖండించిన ఓయూ జేఏసీ
విద్యార్థులపై పోలీసులు, సీమాంధ్రులు దాడులు చేయడాన్ని టీఎస్, ఓయూ జేఏసీ ఖండించింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భౌతిక దాడులకు తప్పవని హెచ్చరించింది.