అన్నాడీఎంకేకు మద్దతుగా ప్రచారం
టీనగర్, న్యూస్‌లైన్: అన్నాడీఎంకే పార్టీకి మద్దతుగా 40 నియోజకవర్గాలలో ప్రచారం చేయనున్నట్లు అఖిల భారత సమత్తువ మక్కల్ కట్చి (ఎస్ఎంకే) పార్టీ అధ్యక్షుడు శరత్‌కుమార్ తెలిపారు. రిపోర్టర్స్ గిల్డ్‌లో బుధవారం ఉదయం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరునల్వేలిలో ఫిబ్రవరి 16వ తేదీ సమత్తువ మక్కల్ కట్చి రెండవ రాష్ట్ర మహానాడు జరగనుందన్నారు. ఇందులో ఐదు లక్షల మంది పాల్గొంటారన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమిలో ఏ విధంగా వ్యవహరించాలనే విషయం, ఎన్నికల వ్యూహం గురించి ఇందులో చర్చిస్తామన్నా రు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అన్నాడీఎంకే 40 స్థానాలలో గెలుపొందుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే గెలుపునకు 40 స్థానాలలో తీవ్ర ప్రచారం చేపడుతామన్నారు. సమత్తువ మక్కల్ కట్చికి అన్నాడీఎంకే కూటమిలో సీటు కోరే ఉద్దేశం ప్రస్తుతానికి లేదన్నారు.
ముఖ్య మంత్రి ఏ విధంగా ఆలోచిస్తున్నారో, దానికి అనుగుణంగా తాము నడుచుకుంటామన్నారు. గత శాసన సభ ఎన్నికల్లో రెండు స్థానాలను తమకు కేటాయించారన్నారు. ఇంత వరకు తాము కూటమి ధర్మాన్ని అనుసరిస్తున్నామన్నారు. ఎం.కె.అళగిరిని డీఎంకే నుంచి సస్పెండ్ చేయడం వారి పార్టీ వ్యవహా రం అన్నారు. అది వారి అంతర్గత సమస్యగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన మంత్రి కావడం తథ్యమన్నారు. నరేంద్ర మోడి ప్రధాని అయ్యేందుకు మద్దతు లభించదని, ముఖ్యమంత్రి జయలలిత ప్రధాని అవుతారని తెలిపారు. ఆమ్ఆద్మీ పార్టీ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలుపొందలేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.నాగరాజన్, ఉపాధ్యక్షుడు ఎర్నావూరు నారాయణన్ పాల్గొన్నారు.