NMMC
-
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీకాకుళం: నవంబర్ 6న జరిగే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష–2016కు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, వసతి సౌకర్యం లేదని ఆదర్శ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని డీఈఓ దేవానందరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, డివిజనల్ హెడ్ క్వార్టర్స్ శ్రీకాకుళం, పాలకొండ, టెక్కలి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు 7వ తరగతిలో ఓసీ, బీసీ విద్యార్థులు 55 శాతం (బి గ్రేడు) మార్కులతో, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు 50 శాతం (బీ గ్రేడ్) మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ. 1.50 లక్షలు లోపు ఉండాలని, ఆదాయ ధ్రువ పత్రం తహశీల్దార్ జారీ చేసిన ఒరిజినల్ సర్టిఫికెట్ సమర్పించాలని తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు. పరీక్షకు దరఖాస్తు చేసే విద్యార్థులు కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 7వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ జిరాక్స్, ప్రింటెడ్ నామినల్ రోల్స్ రెండు కాపీలు సమర్పించాలని సూచించారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ. 100, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ విద్యార్థులు రూ. 50లు ఎస్బీఐ కలెక్ట్ సిస్టం ద్వారా చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 14 అని, ఫీజు కట్టేందుకు 17వ తేదీగా తెలిపారు. కార్యాలయానికి 20వ తేదీలోగా అందజేయాలని సూచించారు. -
భవన శిథిలాలను పడేస్తే చర్యలు
సాక్షి, ముంబై: అక్రమంగా ఎక్కడ పడితే అక్కడ భవన శిథిలాలను వేసేస్తుండటంతో నవీముంబై వాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సిడ్కోలోని ఖాళీ ప్లాట్లలో, అలాగే వాషిలోని సెక్టార్ 30(ఏ)లో ఎన్ఎంఎంసీకి చెందిన ఖాళీ స్థలాల్లో ఈ అక్రమ డంపింగ్ భారీగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ నగర వాసుల కోసం ఓ హెల్ప్‌లైన్ నంబర్‌ను త్వరలోనే ప్రారంభించనుంది. తమ పరిధిలో ఎవరైనా అక్రమంగా భవన శిథిలాలను పారబోస్తే హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆశ్రయించి కార్పొరేషన్‌ను అప్రమత్తం చేయాల్సిందిగా కోరింది. ఈ సందర్భంగా ఎన్‌ఎంఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ మాట్లాడుతూ.. అక్రమ డంపింగ్ విషయమై నవీ ముంబై వాసులు హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించాల్సిందిగా కోరారు. ఇదేకాకుండా త్వరలోనే జనరల్ హెల్ప్‌లైన్‌ను కూడా ప్రారంభించేందుకు యోచిస్తున్నామన్నారు. డెంగీ, మలేరియా తదితర విషయాలపై కూడా కాల్ చేయవచ్చని పేర్కొన్నారు. అలాగే వాట్సప్ ద్వారా కూడా సమాచారం పంపించవచ్చని తెలిపారు. దీంతో హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించాల్సి వచ్చిందని అధికారి పేర్కొన్నారు. వాస్తవానికి భవన శిథిలాలను డంప్ చేయడానికి కార్పొరేషన్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్లాట్ల వద్ద డంపింగ్ చేయడానికి వాహనాలకు కార్పొరేషన్ అనుమతి ఇస్తుంది. అవసరమున్న అనుమతి పత్రాలు లేకుండా డంప్ చేస్తే సదరు వాహనాలను సీజ్ చేసే అధికారం కార్పొరేషన్‌కు ఉంది. -
‘బోనస్’ కటింగ్..!
* ఎన్నికలకు ముందు కాంటాక్ట్ సిబ్బందికి రూ.11 వేలు బోనస్ ఇస్తామన్న ఎన్‌ఎంఎంసీ * ఎన్నికలతర్వాత ఇచ్చింది రూ.5,900 * రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని బుకాయింపు * నిరాశలో 4 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది * ఓట్ల కోసమే తమను మభ్యపెట్టారని ఆరోపణ సాక్షి, ముంబై : నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) కాంట్రాక్ట్ సిబ్బందికి రూ.11 వేలను బోనస్‌గా ప్రకటించి కేవలం రూ.5,900 మాత్రమే ఇవ్వడంతో సిబ్బంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్ఎంఎంసీలో దాదాపు 6,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో కేవలం 2,500 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా మిగతా వారంతా కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంత అధిక మొత్తంలో బోనస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అవసరమని, వారి అనుమతి లేకుండా తాము ఏమీ చేయలేమని కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో బోనస్‌ను సవరించామని డిప్యూటీ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. తమకు రూ.11 వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించారని, కానీ దానిని సవరించి కేవలం రూ.5,900 మాత్రమే ఇచ్చారని విచారం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఒక్కో కాంట్రాక్ట్ వర్కర్‌కు రూ.11 వేల బోనస్‌ను ప్రకటించింది. ఎన్‌ఎంఎంసీ పరిపాలన విభాగం మొదట రూ.5,000 బోన్‌ను ఇచ్చేందుకు సూచించింది. స్టాండింగ్ కమిటీ రూ.5,500 సిఫార్సు చేసింది. కానీ జనరల్ బాడీ ఈ బోనస్‌ను రూ.11,000కు పెంచింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ కార్పొరేషన్ చేతులెత్తేసిందని సిబ్బంది వాపోతున్నారు. ఎన్‌ఎంఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ ఈ అంశమై స్పందిస్తూ... కాంట్రాక్ట్ సిబ్బందికి తాము అధిక మొత్తంలో బోనస్‌ను మంజూరు చేసిన విషయం నిజమే అయినప్పటికీ దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వారి అనుమతి లేనిదే తాము ఈ ప్రతిపాదనతో ముందుకు సాగలేమన్నారు. దీంతో తాము ఈ బోనస్‌ను సవరించి రూ.5,900 తగ్గించామన్నారు. ఎన్నికల ముందే బోనస్‌ను మంజూరు చేశారని, ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓటు వేయడం కోసం ఇలా బోనస్ పేరుతో ఎర వేశారని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా వుండగా, కార్పొరేషన్ పర్మినెంట్ ఉద్యోగికి రూ.13 వేలు బోనస్ మంజూరు చేసింది. కానీ స్టాండింగ్ కమిటీ దీనిని రూ.13,400 పెంచగా జనరల్ బాడీ రూ.14 వేలకు పెంచింది.