‘బోనస్’ కటింగ్..!
* ఎన్నికలకు ముందు కాంటాక్ట్ సిబ్బందికి రూ.11 వేలు బోనస్ ఇస్తామన్న ఎన్‌ఎంఎంసీ
* ఎన్నికలతర్వాత ఇచ్చింది రూ.5,900
* రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని బుకాయింపు
* నిరాశలో 4 వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది
* ఓట్ల కోసమే తమను మభ్యపెట్టారని ఆరోపణ
సాక్షి, ముంబై : నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ (ఎన్‌ఎంఎంసీ) కాంట్రాక్ట్ సిబ్బందికి రూ.11 వేలను బోనస్‌గా ప్రకటించి కేవలం రూ.5,900 మాత్రమే ఇవ్వడంతో సిబ్బంది నిరుత్సాహానికి గురయ్యారు. ఎన్‌ఎంఎంసీలో దాదాపు 6,500 మంది సిబ్బంది పని చేస్తున్నారు. ఇందులో కేవలం 2,500 మంది పర్మినెంట్ ఉద్యోగులు కాగా మిగతా వారంతా కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇంత అధిక మొత్తంలో బోనస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం అవసరమని, వారి అనుమతి లేకుండా తాము ఏమీ చేయలేమని కార్పొరేషన్ అధికారులు చేతులు ఎత్తేశారు. ప్రభుత్వ అనుమతి లభించకపోవడంతో బోనస్‌ను సవరించామని డిప్యూటీ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ.. తమకు రూ.11 వేల బోనస్ ఇవ్వనున్నట్లు ఇటీవల ప్రకటించారని, కానీ దానిని సవరించి కేవలం రూ.5,900 మాత్రమే ఇచ్చారని విచారం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్పొరేషన్ ఒక్కో కాంట్రాక్ట్ వర్కర్‌కు రూ.11 వేల బోనస్‌ను ప్రకటించింది. ఎన్‌ఎంఎంసీ పరిపాలన విభాగం మొదట రూ.5,000 బోన్‌ను ఇచ్చేందుకు సూచించింది. స్టాండింగ్ కమిటీ రూ.5,500 సిఫార్సు చేసింది. కానీ జనరల్ బాడీ ఈ బోనస్‌ను రూ.11,000కు పెంచింది. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ కార్పొరేషన్ చేతులెత్తేసిందని సిబ్బంది వాపోతున్నారు.
ఎన్‌ఎంఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ సిన్నార్కర్ ఈ అంశమై స్పందిస్తూ... కాంట్రాక్ట్ సిబ్బందికి తాము అధిక మొత్తంలో బోనస్‌ను మంజూరు చేసిన విషయం నిజమే అయినప్పటికీ దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. వారి అనుమతి లేనిదే తాము ఈ ప్రతిపాదనతో ముందుకు సాగలేమన్నారు. దీంతో తాము ఈ బోనస్‌ను సవరించి రూ.5,900 తగ్గించామన్నారు. ఎన్నికల ముందే బోనస్‌ను మంజూరు చేశారని, ఎన్నికల తర్వాత అకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని సిబ్బంది పేర్కొన్నారు. అధికారంలో ఉన్న వారికి ఓటు వేయడం కోసం ఇలా బోనస్ పేరుతో ఎర వేశారని వారు అభిప్రాయపడ్డారు. ఇదిలా వుండగా, కార్పొరేషన్ పర్మినెంట్ ఉద్యోగికి రూ.13 వేలు బోనస్ మంజూరు చేసింది. కానీ స్టాండింగ్ కమిటీ దీనిని రూ.13,400 పెంచగా జనరల్ బాడీ రూ.14 వేలకు పెంచింది.