No case
-
బుగ్గలు గిల్లితే లైంగిక వేధింపులు కావు
ముంబై: మనసులో చెడు ఉద్దేశాలు లేకుండా మైనర్ బాలిక బుగ్గలు గిల్లితే అది నేరం కాదని ముంబైలోని పోక్సో ప్రత్యేక కోర్టు తీర్పు చెప్పింది. ఒక బాలిక బుగ్గల్ని మాటిమాటికి తడిమిన 28 ఏళ్ల వయసున్న ఎలక్ట్రీషియన్‌ను కేసు నుంచి విముక్తుడిని చేసింది. అయితే అదే సమయంలో ఆ బాలిక తల్లిపై చేసిన అత్యాచార యత్నం కేసులో నేరస్తుడిగా తీర్పు చెప్పి అతనికి ఏడాది జైలు శిక్ష, రూ.పది వేలు జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే..? 2017, జూన్2న జరిగిన ఈ ఘటనలో మధ్యాహ్నం పూట తల్లీ, కూతుళ్లిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో రిఫ్రిజిరేటర్ బాగు చేయడానికి ఒక ఎలక్ట్రీషియన్ వాళ్లింటికి వచ్చాడు. ఫ్రిజ్‌ని పరీక్షించి చూసిన అతను స్పేర్ పార్ట్ వెయ్యాలని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ కూతురి బుగ్గలు గిల్లాడు. దీంతో తల్లి ఎలక్ట్రీషియన్ని గట్టిగా మందలించి తన కూతురి ఒంటిపై చెయ్యి వెయ్యొద్దని హెచ్చరించింది. ఇంతలో వంటగదిలో ఏదో పని ఉందని లోపలికి వెళ్లిన ఆ మహిళను వెనక నుంచి వచ్చి అతను కౌగిలించుకున్నాడు. ఆమె గట్టిగా కేకలు వేసి ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. అప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ మళ్లీ ఆమె కుమార్తె బుగ్గలు గిల్లాడు. దీంతో ఆమె ఆ ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సంస్థకి, పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు. కోర్టు ఏమందంటే.. : ఈ కేసు విచారణ సందర్భంగా ప్రత్యేక కోర్టు ఆ మహిళ చెప్పిందంతా విని బాలిక బుగ్గలు గిల్లడం పోక్సో చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. మనసులో శృంగారపరమైన వాంఛలు లేకుండా బుగ్గ గిల్లితే దానిని నేరం కింద చూడలేమని పేర్కొంది. మరోవైపు ఆ మహిళపై అత్యాచార యత్నం చేసినందుకు నిందితుడైన ఎలక్ట్రీషియన్‌కు ఏడాది జైలు శిక్ష విధించింది. ఇటీవలి కాలంలో రకరకాల లైంగిక వేధింపులు పోక్సో చట్టం కింద నేరం కావంటూ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ కోవలోనే ఈ తీర్పు వెలువడటం గమనార్హం. -
వూహాన్లో కోవిడ్ రోగులు నిల్
బీజింగ్/వూహాన్/వాషింగ్టన్: కరోనా వైరస్ పుట్టిన చైనాలో వూహాన్ మరో విజయాన్ని సాధించింది. కోవిడ్–19తో చికిత్స పొందుతున్న రోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆస్పతుల్లో లేరు. వ్యాధి నుంచి కోలుకొన్న 11 మందిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయడంతో రోగుల సంఖ్య జీరోకి వచ్చింది. గత డిసెంబర్ చివరి వారంలో వైరస్ బయటపడిన తర్వాత తొలిసారిగా కరోనా రోగుల విషయంలో జీరో అన్నది సాధించామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. 76 రోజుల పాటు లాక్డౌన్లో ఉన్న వూహాన్లో ఏప్రిల్ 8న లాక్డౌన్ ఎత్తేశారు. అయితే అప్పటికే చాలా మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ‘‘వూహాన్లో కోవిడ్ వ్యాధికి చికిత్స పొందుతున్న చివరి రోగిని శుక్రవారం డిశ్చార్జ్ చేశాము. ప్రస్తుతం వూహాన్లో కరోనా రోగి ఒక్కడు కూడా లేరు’’అని హెల్త్ కమిషన్ అధికార ప్రతినిధి మి ఫెంగ్ చెప్పారు. శనివారం కరోనా కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని తెలిపారు. వూహాన్ రాజధానిగా ఉన్న హుబాయ్ ప్రావిన్స్‌లో 68,128 కరోనా కేసులు నమోదైతే అందులో వూహాన్‌లోనే 50,333 కేసులు నమోదయ్యాయి. మీడియా ముందుకు రాని ట్రంప్ కరోనా రోగులకి క్రిమి సంహారక రసాయనాలు తాగించాలని, వారి ఊపిరితిత్తుల్లోకి యూవీ కిరణాలు జొప్పించాలంటూ వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం మీడియా సమావేశంలో పాల్గొనలేదు. మీడియా సమావేశాలతో ఉపయోగం లేదని, విలువైన సమయాన్ని వెచ్చించే స్థాయిలో అవి లేవని ట్వీట్ చేశారు. ‘ఒక వర్గం మీడియా అన్నీ వ్యతిరేక ప్రశ్నలే వేస్తుంది. వాస్తవాల్ని దాచిపెట్టి వాళ్లకి ఇష్టం వచ్చినట్టుగా రాస్తుంది. దీనివల్ల ఏం ప్రయోజనం, మీడియాకి రేటింగ్స్ వస్తున్నాయి. అమెరికా ప్రజలు తప్పుడు వార్తల్ని వింటున్నారు. ఇలాంటి వాటి కోసం ఈ సంక్షోభ సమయంలో విలువైన సమయాన్ని కేటాయించలేను’అని ట్రంప్ పేర్కొన్నారు. క్రిమిసంహారకాలపై వ్యాఖ్యలతో నవ్వులపాలైన ట్రంప్ కొన్నాళ్లు మీడియాకి దూరంగా ఉండడం మంచిదని భావిస్తున్నట్లు సమాచారం. 24 గంటల్లో 2,494 మంది మృతి అమెరికాలో కోవిడ్ మృత్యుఘోష వినిపిస్తూనే ఉంది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వివరాల ప్రకారం 24 గంటల్లో 2,494 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త కేసులు గణనీయంగా తగ్గు ముఖం పట్టాయి. గత మూడు వారాల్లో అత్యంత తక్కువగా 24 గంటల్లో 1,258 మరణాలు నమోదయ్యాయి. మరో వైపు స్పెయిన్‌లో గత అయిదు వారాల్లోనే అత్యంత తక్కువగా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం 288 మంది మరణించారు. -
నో కోవిడ్.. హైదరాబాద్ సేఫ్!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్–19 ఆనవాళ్లు గ్రేటర్లో తగ్గుముఖం పట్టాయి. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన మహేంద్రహిల్స్ యువకునికి తాజా వైద్య పరీక్షల్లో కరోనా నెగె టివ్ వచ్చినట్లు తెలిసింది. జ్వరం తగ్గడంతో పాటు బీపీ కూడా అదుపులోకి వచ్చినట్లు సమాచారం. 48 గంటల్లో మరోసారి నమూనాలు సేకరించి, పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపి మళ్లీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గాంధీ మెడికల్ రిపోర్ట్‌లతో పోల్చి చూసి, వైరస్ భారీ నుంచి పూర్తిగా బయటపడినట్లు నిర్ధారించుకున్న తర్వాతే బాధితున్ని ఆస్పత్రి నుంచి హోం ఐసోలేషన్‌కు తరలించనున్నారు. ఇప్పటికే బాధితునికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న సిబ్బంది సహా బాధితుని తల్లిదండ్రులకు వైద్య పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటలీ నుంచి వచ్చిన యువతికి కూడా నెగటివ్ అని తేలింది. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 32 మంది అనుమానితులు... ఇటీవల విదేశాల నుంచి వచ్చి దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతూ శనివారం ఆస్పత్రికి చేరుకున్న 17 మంది అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా, వారికి నెగెటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో మహేంద్రహిల్స్‌కు చెందిన యువకునికి మినహా మిగిలిన వారందరికీ కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఊపిరిపీల్చుకుంది. ఇక సోమవారం 8 మంది కరోనా అనుమానితులు అడ్మిట్ కాగా వారి నుంచి నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్ వార్డులో 32 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం వీరిని కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. రెండు మెడికల్ షాపులపై కేసులు.. ఒకవైపు కరోనా... మరోవైపు స్వైన్‌ఫ్లూ విస్తరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా మాస్క్‌లను వాడుతున్నారు. సిటిజన్లలో ఉన్న భయాన్ని కొందరు మెడికల్‌షాపుల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మాస్క్‌లను విక్రయిస్తున్నారు. సాధారణ మాస్క్ ధర రూ.2 నుంచి రూ.3 ఉండగా, రూ.20 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు మాస్క్‌లు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ఫోరం ఫర్ అగెనెస్ట్ కరప్షన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ సాయితేజ కూకట్పల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో బాలాజీనగర్‌లోని మారుతి మెడికల్ షాపు, శ్రీసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై కేసులు నమోదు చేశారు. -
స్నాచర్లను కొట్టి చంపినా కేసులుండవు !
విజయవాడ : గొలుసు దొంగలను కొట్టి చంపినా.. తీవ్రంగా గాయపరిచినా పోలీసు కేసులు ఉండవా? అవుననే అంటున్నాయి కమిషనరేట్‌కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు. అదును చూసి చెలరేగుతున్న గొలుసు దొంగల ఆగడాలకు ముకుతాడు వేసేందుకు కమిషనరేట్ పెద్దలు నిర్ణయించారు. గొలుసు దొంగల విషయంలో ప్రజలు తిరగబడితే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నారు. శనివారం సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న స్నాచింగ్ కేసులో కొందరు యువకులు నిందితులను వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కిందపడిన దొంగలు మెరుపు వేగంతో పైకి లేచి పరారయ్యారు. వీరిపై కర్రలు, రాళ్లు విసిరి పట్టుకోవాలని భావించినా పోలీసుల కేసు భయంతో మిన్నుకుండిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై సమీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రజలు తిరగబడిన సమయంలో జరగరానిది జరిగితే కేసులు నమోదు చేయబోమంటూ బాధితులు, స్థానికులకు భరోసా ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. మరోసారి సవాల్ జూలైలో గురు పౌర్ణమి రోజు గొలుసు దొంగలు ఐదు ప్రాంతాల్లో నేరాలు చేశారు. గంటన్నర వ్యవధిలో అర కిలో బంగారంతో వీరు ఉడాయించారు. ఈ నెల మొదటి వారంలో మాచవరం, సూర్యారావు పేట పోలీసు స్టేషన్ల పరిధిలో మరో రెండు నేరాలు చేశారు. ఈ రెండు నేరాల్లోను చోరీ చేసిన మోటారు సైకిళ్లను వినియోగించారు. ముఖ్యమంత్రి బందోబస్తు, ఇతర విధుల్లో పోలీసులు నిమగ్నం కావడాన్ని ఆసరాగా చేసుకొని శనివారం మరోసారి నగరంలో ప్రతాపం ప్రదర్శించారు. తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో మోటారు సైకిల్‌పై హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలో గొలుసు తెంచేందుకు విఫలయత్నం చేశారు. అక్కడ స్థానికులు అప్రమత్తం కావడంతో చాకచక్యంగా తప్పించుకొని గాంధీనగర్‌లో గొలుసు చోరీ చేశారు. ఎన్ఆర్పీ రోడ్డులోని ముదునూరి వారి వీధికి చెందిన ఓ మహిళ నడిచి వెళుతుండగా వేగంగా మోటారు సైకిల్‌పై ముందుకు వెళ్లి వెనక్కి తిరిగిన ఆగంతకులు మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసు తెంచుకొని ఉడాయించారు. ఇది గమనించిన స్థానికులు వెంటపడి తరిమారు. ఈ క్రమంలో మోటారు సైకిల్ నుంచి కొద్ది దూరంలో ఆగంతకులు జారిపడ్డారు. తొలుత రాళ్లు, ఇతర ఆయుధాలు విసిరి వీరిని నిలువరించేందుకు ఆలోచించిన స్థానికులు కేసుల భయంతో మిన్నకుండిపోయారు. దీంతో మెరుపు వేగంతో పైకిలేచి ఆగంతకులు పరారయ్యారు. అప్రమత్తమైనప్పటికీ... శ్రావణ శుక్రవారం నాడు విశాఖలో గొలుసు దొంగలు ఏడు నేరాలు చేశారు. ఆ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలు, సమయాల్లోనే స్నాచర్లు గొలుసు దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన సీసీఎస్ పోలీసులు రానున్న పర్వ, ప్రత్యేక దినాలపై దృష్టిసారించారు. ఈలోగానే నగరానికి వచ్చి నేరం చేయడంపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు. గొలుసు చోరీలకు తెగబడుతున్న ఉత్తరాది ముఠాలకు స్థానికుల సహకారంతోనే చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కొట్టి గాయపరిచినా, అంతకు మించి మరేదైనా చేసినా కేసులు పెట్టబోమంటూ భరోసా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. పూర్ణనందపేటలో.. సత్యనారాయణపురం : ఓ మహిళ మెడలో గొలుసులను బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తుల తెంచుకు వెళ్లిన సంఘటన పూర్ణనందపేట కలగా లాడ్జి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. లక్ష్మణరావు వీధిలో నివసించే లక్ష్మీప్రసన్న పక్కనే ఉన్న కిరాణాషాపుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఆమె మెడలోని 8 కాసుల బంగారు గొలుసులు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకొని పరారయ్యారు. ఆమె జరిగిన సంఘటనపై సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొలుసు చోరీపై కేసు నమోదు సత్యనారాయణపురం : ఆవుకు ఆహారం పెట్టేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన గాంధీనగర్ సుందరయ్య వీధికి చెందిన ఎర్రబోతు విజయలక్ష్మిని వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆమె దాటుకుని ముందుకు వెళ్లారు. తిరిగి ఆమెకు ఎదురు వచ్చి మెడలోని నాంతాడు నల్లపూసుల గోలుసు తెంచుకొని పారిపోతుండగా ఆమె తేరుకుని గట్టిగా కేకలు వేసింది. యువకులు స్నాచర్స్‌ను బైక్‌ను వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. బాధితురాలు జరిగిన సంఘటనపై సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. సుమారు ఐదు కాసుల బంగారు ఆభరణాలు పోయాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.