స్నాచర్లను కొట్టి చంపినా కేసులుండవు !
విజయవాడ : గొలుసు దొంగలను కొట్టి చంపినా.. తీవ్రంగా గాయపరిచినా పోలీసు కేసులు ఉండవా? అవుననే అంటున్నాయి కమిషనరేట్‌కు చెందిన ఉన్నత స్థాయి వర్గాలు. అదును చూసి చెలరేగుతున్న గొలుసు దొంగల ఆగడాలకు ముకుతాడు వేసేందుకు కమిషనరేట్ పెద్దలు నిర్ణయించారు. గొలుసు దొంగల విషయంలో ప్రజలు తిరగబడితే సపోర్టు ఇవ్వాలని భావిస్తున్నారు.
శనివారం సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న స్నాచింగ్ కేసులో కొందరు యువకులు నిందితులను వెంబడించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో కిందపడిన దొంగలు మెరుపు వేగంతో పైకి లేచి పరారయ్యారు. వీరిపై కర్రలు, రాళ్లు విసిరి పట్టుకోవాలని భావించినా పోలీసుల కేసు భయంతో మిన్నుకుండిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై సమీక్షించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రజలు తిరగబడిన సమయంలో జరగరానిది జరిగితే కేసులు నమోదు చేయబోమంటూ బాధితులు, స్థానికులకు భరోసా ఇవ్వాలనే నిర్ణయంతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
మరోసారి సవాల్
జూలైలో గురు పౌర్ణమి రోజు గొలుసు దొంగలు ఐదు ప్రాంతాల్లో నేరాలు చేశారు. గంటన్నర వ్యవధిలో అర కిలో బంగారంతో వీరు ఉడాయించారు. ఈ నెల మొదటి వారంలో మాచవరం, సూర్యారావు పేట పోలీసు స్టేషన్ల పరిధిలో మరో రెండు నేరాలు చేశారు. ఈ రెండు నేరాల్లోను చోరీ చేసిన మోటారు సైకిళ్లను వినియోగించారు.
ముఖ్యమంత్రి బందోబస్తు, ఇతర విధుల్లో పోలీసులు నిమగ్నం కావడాన్ని ఆసరాగా చేసుకొని శనివారం మరోసారి నగరంలో ప్రతాపం ప్రదర్శించారు. తొలుత ఉదయం 11.30 గంటల సమయంలో మోటారు సైకిల్‌పై హెల్మెట్లు పెట్టుకొని వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఓ మహిళ మెడలో గొలుసు తెంచేందుకు విఫలయత్నం చేశారు.
అక్కడ స్థానికులు అప్రమత్తం కావడంతో చాకచక్యంగా తప్పించుకొని గాంధీనగర్‌లో గొలుసు చోరీ చేశారు. ఎన్‌ఆర్‌పీ రోడ్డులోని ముదునూరి వారి వీధికి చెందిన ఓ మహిళ నడిచి వెళుతుండగా వేగంగా మోటారు సైకిల్‌పై ముందుకు వెళ్లి వెనక్కి తిరిగిన ఆగంతకులు మెడలోని ఐదు కాసుల బంగారు గొలుసు తెంచుకొని ఉడాయించారు.
ఇది గమనించిన స్థానికులు వెంటపడి తరిమారు. ఈ క్రమంలో మోటారు సైకిల్ నుంచి కొద్ది దూరంలో ఆగంతకులు జారిపడ్డారు. తొలుత రాళ్లు, ఇతర ఆయుధాలు విసిరి వీరిని నిలువరించేందుకు ఆలోచించిన స్థానికులు కేసుల భయంతో మిన్నకుండిపోయారు. దీంతో మెరుపు వేగంతో పైకిలేచి ఆగంతకులు పరారయ్యారు.
అప్రమత్తమైనప్పటికీ...
శ్రావణ శుక్రవారం నాడు విశాఖలో గొలుసు దొంగలు ఏడు నేరాలు చేశారు. ఆ సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. పర్వదినాలు, ప్రత్యేక సందర్భాలు, సమయాల్లోనే స్నాచర్లు గొలుసు దాడులు చేస్తున్నారు. దీనిపై దృష్టిసారించిన సీసీఎస్ పోలీసులు రానున్న పర్వ, ప్రత్యేక దినాలపై దృష్టిసారించారు. ఈలోగానే నగరానికి వచ్చి నేరం చేయడంపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారు.
గొలుసు చోరీలకు తెగబడుతున్న ఉత్తరాది ముఠాలకు స్థానికుల సహకారంతోనే చెక్ పెట్టేందుకు పోలీసులు వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే కొట్టి గాయపరిచినా, అంతకు మించి మరేదైనా చేసినా కేసులు పెట్టబోమంటూ భరోసా ఇచ్చేందుకు సిద్ధపడ్డారు.
పూర్ణనందపేటలో..
సత్యనారాయణపురం : ఓ మహిళ మెడలో గొలుసులను బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తుల తెంచుకు వెళ్లిన సంఘటన పూర్ణనందపేట కలగా లాడ్జి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. లక్ష్మణరావు వీధిలో నివసించే లక్ష్మీప్రసన్న పక్కనే ఉన్న కిరాణాషాపుకు వెళ్లింది. తిరిగి వస్తుండగా ఆమె మెడలోని 8 కాసుల బంగారు గొలుసులు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తెంపుకొని పరారయ్యారు. ఆమె జరిగిన సంఘటనపై సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గొలుసు చోరీపై కేసు నమోదు
సత్యనారాయణపురం : ఆవుకు ఆహారం పెట్టేందుకు ఇంటి నుంచి బయటికి వచ్చిన గాంధీనగర్ సుందరయ్య వీధికి చెందిన ఎర్రబోతు విజయలక్ష్మిని వెంబడించిన ఇద్దరు వ్యక్తులు ఆమె దాటుకుని ముందుకు వెళ్లారు. తిరిగి ఆమెకు ఎదురు వచ్చి మెడలోని నాంతాడు నల్లపూసుల గోలుసు తెంచుకొని పారిపోతుండగా ఆమె తేరుకుని గట్టిగా కేకలు వేసింది. యువకులు స్నాచర్స్‌ను బైక్‌ను వెంబడించిన ఫలితం లేకుండా పోయింది. బాధితురాలు జరిగిన సంఘటనపై సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సుమారు ఐదు కాసుల బంగారు ఆభరణాలు పోయాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.