సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కోవిడ్–19 ఆనవాళ్లు గ్రేటర్‌లో తగ్గుముఖం పట్టాయి. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన మహేంద్రహిల్స్ యువకునికి తాజా వైద్య పరీక్షల్లో కరోనా నెగె టివ్ వచ్చినట్లు తెలిసింది. జ్వరం తగ్గడంతో పాటు బీపీ కూడా అదుపులోకి వచ్చినట్లు సమాచారం. 48 గంటల్లో మరోసారి నమూనాలు సేకరించి, పుణే వైరాలజీ ల్యాబ్‌కు పంపి మళ్లీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. గాంధీ మెడికల్ రిపోర్ట్‌లతో పోల్చి చూసి, వైరస్ భారీ నుంచి పూర్తిగా బయటపడినట్లు నిర్ధారించుకున్న తర్వాతే బాధితున్ని ఆస్పత్రి నుంచి హోం ఐసోలేషన్‌కు తరలించనున్నారు. ఇప్పటికే బాధితునికి క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న సిబ్బంది సహా బాధితుని తల్లిదండ్రులకు వైద్య పరీక్షల్లో నెగటివ్‌గా నిర్ధారణ అయింది. ఇటలీ నుంచి వచ్చిన యువతికి కూడా నెగటివ్ అని తేలింది. దీంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం 32 మంది అనుమానితులు...
ఇటీవల విదేశాల నుంచి వచ్చి దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలతో బాధపడుతూ శనివారం ఆస్పత్రికి చేరుకున్న 17 మంది అనుమానితులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించగా, వారికి నెగెటివ్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, వీరిలో మహేంద్రహిల్స్‌కు చెందిన యువకునికి మినహా మిగిలిన వారందరికీ కరోనా వైరస్ సోకలేదని నిర్ధారణ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ ఊపిరిపీల్చుకుంది. ఇక సోమవారం 8 మంది కరోనా అనుమానితులు అడ్మిట్ కాగా వారి నుంచి నమూనాలు సేకరించి గాంధీ వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం గాంధీ ఐసోలేషన్ వార్డులో 32 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం ఉదయం వీరిని కూడా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
రెండు మెడికల్ షాపులపై కేసులు..
ఒకవైపు కరోనా... మరోవైపు స్వైన్‌ఫ్లూ విస్తరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో గ్రేటర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. వైరస్‌ల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తగా మాస్క్‌లను వాడుతున్నారు. సిటిజన్లలో ఉన్న భయాన్ని కొందరు మెడికల్‌షాపుల నిర్వాహకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరలకు మాస్క్‌లను విక్రయిస్తున్నారు. సాధారణ మాస్క్ ధర రూ.2 నుంచి రూ.3 ఉండగా, రూ.20 వరకు విక్రయిస్తున్నారు. అధిక ధరలకు మాస్క్‌లు విక్రయిస్తున్న మెడికల్ షాపులపై ఫోరం ఫర్ అగెనెస్ట్ కరప్షన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కాట్రగడ్డ సాయితేజ కూకట్‌పల్లి పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో బాలాజీనగర్‌లోని మారుతి మెడికల్ షాపు, శ్రీసాయి మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్‌పై కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment