చేనేత రుణాల్లో పైసా మాఫీ చేయని చంద్రబాబు
సదుం: చేనేత కార్మికుల రుణాల్లో ఒక్క రూపాయి రుణాన్ని కూడా సీఎం చంద్రబాబు మాఫీ చేయరని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం జాండ్రపేటలో నిర్వహించిన ప్రపంచ చేనేత దినోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు పలు పథకాలను ప్రకటించి, ప్రభుత్వం ఏర్పాటుచేసి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంత వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చేనేత దినోత్సవంలో నాయకులు నిలదీస్తారనే భయంతో వ్యూహాత్మకంగా అనంతపురంలో ఒక్కరోజు ముందు రూ.111 కోట్ల చేనేత రుణాల మాఫీ, రూ.3 లక్షలతో గృహాలు కట్టిస్తామని ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని సూచిస్తుందన్నారు. నేతన్నలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలని జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ప్రకటించిన పథకాలన్నీ అమలుచేసి వారి కష్టాలను తీరుస్తామని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతామని ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మెన్ పెద్దిరెడ్డి, చేనేత సంఘం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రవి, చౌడేపల్లె జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు.