no marriages
-
‘సోలో బతుకే సో బెటరూ’.. ఇపుడిదే ట్రెండ్ బాసూ!
ప్రపంచవ్యాప్తంగా జనాభా గడచిన రెండు శతాబ్దాల్లో 8 రెట్లు పెరిగింది. వైద్య, సాంకేతిక, శాస్త్ర రంగాల్లో మానవుడు సాధించిన ప్రగతి సంపదను పెంచింది. దారిద్య్రాన్ని గణనీయంగా తగ్గించింది. మనిషి సగటు ఆయుప్రమాణాలు కూడా అంతటా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఫలితంగా నేడు కొందరు స్త్రీపురుషులు పెళ్లిచేసుకున్నాక విడాకులు తీసుకునో లేక వివాహం జోలికి పోకుండానో ఒంటరిగా తమ ఇళ్లలో జీవిస్తున్నారు. ఇలాంటి ఏకాకి బతుకులు లేదా కుటుంబాల సంఖ్య మంచి ప్రగతి సాధించిన దేశాల్లో ఓ మోస్తరు వేగంతో పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఎదురులేని అభివృద్ధి సాధించిన అమెరికాలో ‘ఏకసభ్య’ కుటుంబాలు మన ఊహకు అందని స్థాయిలో ఉన్నాయి. దాదాపు 30 శాతం అమెరికా కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. ఈ ‘ఒంటరి బతుకులు’ ఒక్క అమెరికాలో మాత్రమే కనిపించే విలక్షణ ధోరణి కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తమ నివాసాల్లో ఒంటరిగా బతుకుతున్న మనుషుల లేదా ‘కుటుంబాల’ సంఖ్య చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం–1940లో ఇలాంటి ‘ఏకాకి కుటుంబాలు’ 8శాతం ఉండగా, 1970 నాటికి రెట్టింపయి 18శాతానికి పెరిగాయి. 2022 కల్లా ఏకసభ్య అమెరికా కుటుంబాల సంఖ్య మూడు రెట్లకు పెరిగి 29 శాతానికి చేరింది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే సామాజిక మార్పు. కిందటి శతాబ్దంలో జనాభాకు సంబంధించి ఇది అతి పెద్ద మార్పు. దీన్ని మనం అప్పుడు గుర్తించలేకపోయాం,’ అని ఈ అంశంపై ‘గోయింగ్ సోలో’ అనే గ్రంథం రాసిన న్యూయార్క్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ఎరిక్ క్లినెన్ బర్గ్ వ్యాఖ్యానించారు. ‘సోలో బతుకే సో బెటరూ’ అనే తెలుగు సినిమా పాట చెప్పిన విధంగా అమెరికాలో కొందరు జీవించడంతోపాటు అక్కడ ఆలస్యంగా పెళ్లిచేసుకోవడమనే ధోరణి ఈమధ్య పెరిగింది. దేశంలో మహిళా సాధికారత పెరగడం తమ జీవితాల్లోని అన్ని విషయాల్లో వారు స్వయంగా నిర్ణయం తీసుకునే దశకు ఎదగడం కూడా అమెరికాలో స్త్రీ, పురుషుల్లో మూడో వంతు ఒంటరిగా జీవించడానికి ప్రధాన కారణమని క్లినెన్ బర్గ్ వివరించారు. ఆధునిక పాశ్యాత్య పారిశ్రామిక దేశాల్లో ఇదే ట్రెండ్! ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఐరోపాలో బాగా సంపన్న, సంక్షేమ దేశాల్లో ఒంటరి జీవితాలు లేదా కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. డెన్మార్క్ లో 39శాతం, ఫిన్లాండ్ లో 45శాతం , నెదర్లాండ్స్ లో 38శాతం, నార్వేలో 39శాతం, స్వీడన్ లో 40శాతం కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. సంపద, విద్య, జ్ఞానం పెరిగే మంచి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఒంటరి బతుకులు సామాజిక శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఐరోపా దేశాల్లోనే అమెరికాలో కన్నా ‘సోలో బతుకులు’ ఎక్కువ. అమెరికాలో ఇంకా వివాహ వ్యవస్థకు గొప్ప గౌరవం ఉంది. ఒంటరిగా జీవిస్తున్న వారిపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనం ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. ఒంటరిగా బతుకుతూ వృద్ధాప్యం మీదపడుతున్న వ్యక్తుల శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిగతులు త్వరగా క్షీణించడమేగాక వారు అల్పాయుష్కులవు తున్నారని ఈ పత్రిక తెలిపింది. గతంలో ఉమ్మడి కుటుంబాలకు ఇప్పుడు చిన్న కుటుంబ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చే భారతదేశంలో సైతం ఆధునిక అభివృద్ధితో పాటు ‘సోలో కుటుంబాల’ సంఖ్య కొద్ది కొద్దిగా పెరగడాన్ని సామాజికవేత్తలు గుర్తిస్తున్నారు. 2019-2020 ఐరాస మహిళా విభాగం నివేదిక ప్రకారం-ఇండియాలో పైన వివరించిన ఏకసభ్య కుటుంబాలు 12 శాతం వరకూ ఉన్నాయి. దేశంలో మొదటి నుంచీ పెళ్లి చేసుకోవడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఉంది. వివాహితులకు అదనపు గౌరవం సమాజంలో లభిస్తుంది. పెళ్లిచేసుకోనివారికి లేదా జీవిత భాగస్వామి లేని ఒంటరి వ్యక్తులకు అద్దె ఇళ్లు కూడా తేలికగా దొరకవు. ప్రభుత్వాలు తక్కువ మంది పిల్లలను కనాలని చెబుతాయేగాని, అసలు పెళ్లే చేసుకోవద్దని సలహా ఇవ్వవు. అయినా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన జీవనశైలి కారణంగా భారతదేశంలోనూ సోలో కుటుంబాలు నెమ్మదిగా పెరగడం ప్రపంచీకరణకు సంకేతమని కొందరు నిపుణులు అభిప్రాయపడు తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
తాజా సర్వే: ఈ యువతకు ఏమైంది? పెళ్లి వద్దంటున్నారు!
ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. ‘జాతీయ గణాంకాల సంస్థ’ తాజా నివేదిక ప్రకారం మన దేశంలో 15– 29 ఏళ్ల మధ్య ఉండే యువత పెళ్లి తలంపునే చేయడం లేదు. అంటే 29 వరకూ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఉద్యోగాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ‘చేసుకోవచ్చులే’ అనో మనసులో మాట చెప్పకుండా దాటవేయడమో చేస్తూ... తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నారు. ‘గుండెల మీద కుంపటి’ అనేది చాలా చెడ్డ పోలిక. గతంలో ఈ పోలికను పెళ్లి కాని ఆడపిల్లల విషయంలో తెచ్చేవారు. దానికి కారణం 1980ల ముందు వరకూ కట్నాలు తీవ్ర ప్రాధాన్యం వహించడం. ఆడపిల్లల్లో చదువు తక్కువగా ఉండి మధ్యతరగతి దగ్గర తగినంత డబ్బు లేకపోవడం. ఈ పరిస్థితి మెల్లగా మారింది. చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ ప్రాధాన్యంలోకి వచ్చాయి. ‘కట్నాలు’ క్రమంగా ‘లాంఛనాలు’గా మారాయి. మంచి సంబంధం కుదిరితే ఇచ్చిపుచ్చుకోవడాలు రెండో ప్రాధాన్యంలోకి వస్తున్నాయి. కనుక ఈ మాట మెల్లగా కనుమరుగైంది. అయితే ఈ మాట మళ్లీ ఉనికిలోకి వస్తుందా అనిపిస్తోంది– కాకుంటే ఈసారి ఆడపిల్లలు మగపిల్లల విషయంలో. గతంలో ‘పెళ్లి చేయలేక’ ఈ మాట అనేవారు. ఇప్పుడు పిల్లలు ‘పెళ్లి చేసుకోక’ ఈ మాట అనాల్సి రావచ్చు. ఏ మాటా చెప్పరు! ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం దొరుకుతున్నది. సంపాదనలో పడుతున్నారు. అయినా సరే పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. అసలు చేసుకుంటారో లేదో చెప్పడం లేదు. దాంతో తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్నారు. తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. ‘బాగా స్థిరపడి చేసుకోవడం’ అనే భావన గతంలో ఉన్నా ఈ ‘స్థిరపడటం’ అనే మాటకు అంతుపొంతు లేకుండా ఉంది. అబ్బాయిలు ‘ఏదో ఒక ఉద్యోగం వస్తే చేసుకుంటాను’ అనేది పోయి ‘ఈ స్థాయి వరకూ వచ్చాక చేసుకుంటాను’ అనుకుంటున్నారు. అమ్మాయిలు ‘మంచి సంబంధం ఏదో ఒకటి’ అనుకోవడం లేదు. చాలా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు. దాంతోపాటు అసలు సమాజంలో ‘పెళ్లి’కి సంబంధించిన సకారాత్మక (పాజిటివ్) దృష్టి వ్యాప్తి చెందుతోందా నెగెటివ్ దృష్టి వ్యాప్తి చెందుతోందా కూడా గమనించాలి. ‘పెళ్లి ఒక జంజాటం’, ‘గొడవలు ఉంటాయి’, ‘తల్లిదండ్రులతో అత్తామామలతో సమస్యలు’, ‘అడ్జస్ట్మెంట్ సమస్యలు’, ‘విడాకుల భయం’, ‘చేసుకున్న భాగస్వామితో కంపాటబులిటీ ఉండకపోతే అన్న సందేహం’ ఇవన్నీ యువతలో పెళ్లి గురించి వైముఖ్యం పెంచుతున్నాయేమో గమనించాలి. రోజు రోజుకూ పెరిగిపోతున్న ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’... ధరలు... ఇంటి అద్దెలు... ఫ్లాట్ల విలువలు... వీటిని చూసి సంసారాన్ని ఈదగలమా అని అనిపిస్తూ ఉంటే గనక ఆ దడుపుకు మంత్రం పాలనా, పౌర వ్యవస్థలు కనిపెట్టాల్సిందే. నూటికి 23 శాతం జాతీయ గణాంకాల సంస్థ తాజా అధ్యయనం ప్రకారం నేటి యువతలో (15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు) పెళ్లి మాట ఎత్తనివారి సంఖ్య 2019 నాటికి 23 శాతం ఉంది. 2011లో వీరి శాతం 17 మాత్రమే. బాల్య వివాహాలు తగ్గడం ఈ అధ్యయనంలో కనిపించినా తరుణ వయసు వచ్చాక కూడా పెళ్లి మాట ఎత్తకపోవడం పట్టించుకోవలసిన విషయంగా అర్థమవుతోంది. అబ్బాయిల్లో 2011లో నూటికి 20 మంది పెళ్లి మాట ఎత్తకపోతే 2019లో 26 మంది పెళ్లి ప్రస్తావన తేవడం లేదు. అమ్మాయిల్లో 2011లో నూటికి 11 మంది పెళ్లి చేసుకోకపోతే 2019లో నూటికి 20 మంది పెళ్లి పట్ల నిరాసక్తిగా ఉన్నారు. సగటున చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి నూటికి 23 మంది 29 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్ల్‌లోనో ఒక వీధిలోనో 100 మంది యువతీ యువకులు ఉంటే వారిలో 23 మంది అవివాహితులుగా కనిపిస్తూ ఉంటారు. ఆ ఇళ్ల తల్లిదండ్రులు, ఆ అవివాహితులు నిత్యం ‘పెళ్లెప్పుడు’ అనే మాటను ఎదుర్కొనాల్సిందే. కశ్మీర్ మొదటి స్థానంలో దేశం మొత్తం గమనిస్తే పెళ్లి కాని యువతీ యువకులు అత్యధికంగా ఉన్న ప్రాంతం జమ్ము అండ్ కశ్మీర్. దీని తర్వాత ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబు రాష్ట్రాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 30 ఏళ్ల వరకూ పెళ్లిళ్లు జాప్యం అవుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లలో ఈ శాతం తక్కువగా ఉంది. అంటే కొంచెం ఆలస్యమైనా చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తంగా దేశంలో చూసినప్పుడు 25 నుంచి 29 మధ్య చేసుకునేవారి సంఖ్య గతంలో బాగున్నా ఇప్పుడు బాగా తగ్గింది. అంటే అమ్మాయిలలో 50 శాతం మంది, అబ్బాయిల్లో 80 శాతం మంది 25 దాటి 29 సమీపిస్తున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. నిపుణులు కారణాలు శోధించి పరిష్కారాలు వెతక్క తప్పని స్థితి ఇది. అవసరం ఏముంది అనేవారే ఎక్కువ పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిల మైండ్ సెట్లోనూ మార్పులు వచ్చాయి. నిన్నటి తరం ‘డిగ్రీ చేస్తే చాలు’ అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు పై చదువులకు విదేశాలకు వెళుతున్నారు. ‘ముందు సెటిల్ అవాలి, తర్వాతనే పెళ్లి’ అంటున్నారు. గతంలో పిల్లలకు వయసు వచ్చింది త్వరగా పెళ్లి చేయాలని అనుకునేవారు పేరెంట్స్. పిల్లలు కూడా పెద్దల నిర్ణయానికి తలవంచేవారు. ఇప్పుడు పెళ్లి నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తున్నారు పెద్దలు. దీంతో తమకు సెట్ అయ్యే మ్యాచ్ దొరకాలని పిల్లలు చూస్తున్నారు. దాదాపు ఇప్పుడంతా మప్పై ఏళ్ల వరకు పెళ్లి ఆలోచనలు చేయడంలేదు. పెళ్లి అంటే ‘ఇప్పుడే అవసరం ఏముంది’ అంటున్నారు. అంత తొందర పడి మరొకరి మాట వినాలనేం ఉంది అనుకుంటున్నారు. ఈ ధోరణి ముందు ముందు ఇంకా పెరుగుతుంది. అంతేకాదు, డిస్టర్బ్డ్గా ఉన్న జంటలను చూసి, అంత కష్టం ఎందుకులే అనుకుంటున్నవారిని ఎక్కువ చూస్తున్నాం. ఇలా చాలా కారణాల వల్ల పెళ్లి వయసుకు పెద్ద గ్యాప్ వచ్చేసింది. – ప్రొ. పి.జ్యోతి రాజా, సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రెయినర్ -
అన్నవరం పెళ్లిళ్లకు సమైక్య సెగ
సత్యదేవుని సన్నిధిలో జరిగే శ్రావణ మాస పెళ్లిళ్లకూ సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. ఈ మాసంలో ఇప్పటి వరకూ పది వివాహ ముహూర్తాల్లో రత్నగిరిపై కేవలం 300 వివాహాలు మాత్రమే జరిగాయని దేవస్థానం అధికారులు అంటున్నారు. శ్రావణమాసంలో ఏటా సుమారు 1,500 వివాహాలు రత్నగిరిపై జరుగుతాయని అంచనా. ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. శనివారం తెల్లవారుజామున 2.46 గంటల ముహూర్తంలో ఉత్తరాభాద్ర నక్షత్రం, మిథున లగ్నంలో కేవలం 50 వివాహాలు మాత్రమే జరిగాయి. శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున మరో 50 వివాహాలు జరుగుతాయిని పండితులు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆర్టీసీ బస్‌లు నడపకపోవడం, ఉద్యమకారుల నిరసన కారణంగా ఎక్కడిక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పలువురు వివాహాలను వాయిదా వేసుకోవడమో లేక తమ స్వస్థలాలోనే నిర్వహించుకుంటున్నారు. దేవస్థానంలో జరిగిన వివాహాలు కూడా అన్నవరం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు చేసుకున్నవే అధికం. దూరప్రాంతాలవారు వచ్చి వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సీజన్లో వివాహాలు తగ్గినందున తీవ్రంగా నష్టపోయినట్టు క్యాటరింగ్, పెళ్లి మంటపాల అలంకరణ, మంగళ వాయిద్యాల వారన్నారు. ఈ శ్రావణమాసంలో చివరగా ఈనెల 29, సెప్టెంబర్ ఒకటో తేదీన మాత్రమే పెద్ద ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. రత్నగిరిపై భక్తుల రద్దీ సత్యదేవుని ఆలయం శనివారం భక్తులు, పెళ్లి బృందాలతో కిటకిటలాడింది. స్వామివారి సన్నిధిన శనివారం తెల్లవారు జామున 2.46 గంటల ముహూర్తంలో 50 వివాహాలు జరిగాయి. దేవస్థానంలోని ఆరు ప్రధాన సత్రాల్లోనూ, ఆలయ ప్రాంగణంలోను ఈ వివాహాలు జరిగాయి. వారికి తోడు జిల్లా నలుమూలలా వివాహాలు చేసుకున్న మరో 25 జంటలు వారి బంధువులతో సొంత వాహనాల్లో రత్నగిరికి చేరుకుని స్వామివారి వ్రతాలాచరించారు. శనివారం రత్నగిరిపై భక్తుల రద్దీ ఏర్పడింది. శనివారం రాత్రి ఎనిమిది గంటల ముహూర్తంలో పది వివాహాలు జరిగాయి. రాత్రి 11.08 గంటలు, తెల్లవారుజామున రెండుగంటల ముహూర్తాలలోనూ దేవస్థానంలో 40 వరకూ వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. సత్యదేవుని ఆలయాన్ని శనివారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2,489 జరిగాయి. ఆదాయం రూ.13 లక్షలు వచ్చిందని అధికారులు తెలిపారు.