అన్నవరం పెళ్లిళ్లకు సమైక్య సెగ | Seemandhra affect: Number of marriages decrease at Annavaram | Sakshi
Sakshi News home page

అన్నవరం పెళ్లిళ్లకు సమైక్య సెగ

Published Sun, Aug 25 2013 9:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:07 PM

Seemandhra affect: Number of marriages decrease at Annavaram

సత్యదేవుని సన్నిధిలో జరిగే శ్రావణ మాస పెళ్లిళ్లకూ సమైక్యాంధ్ర ఉద్యమ సెగ తగిలింది. ఈ మాసంలో ఇప్పటి వరకూ పది వివాహ ముహూర్తాల్లో రత్నగిరిపై కేవలం 300 వివాహాలు మాత్రమే జరిగాయని దేవస్థానం అధికారులు అంటున్నారు. శ్రావణమాసంలో ఏటా సుమారు 1,500 వివాహాలు రత్నగిరిపై జరుగుతాయని అంచనా. ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. శనివారం తెల్లవారుజామున 2.46 గంటల ముహూర్తంలో ఉత్తరాభాద్ర నక్షత్రం, మిథున లగ్నంలో కేవలం 50 వివాహాలు మాత్రమే జరిగాయి.
 
 శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున మరో 50 వివాహాలు జరుగుతాయిని పండితులు తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఆర్టీసీ బస్‌లు నడపకపోవడం, ఉద్యమకారుల నిరసన కారణంగా ఎక్కడిక్కడ ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పలువురు వివాహాలను వాయిదా వేసుకోవడమో లేక తమ స్వస్థలాలోనే నిర్వహించుకుంటున్నారు.


దేవస్థానంలో జరిగిన వివాహాలు కూడా అన్నవరం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వారు చేసుకున్నవే అధికం. దూరప్రాంతాలవారు వచ్చి వివాహాలు చేసుకుంటున్న వారి సంఖ్య తగ్గిందని ఆలయ అధికారులు తెలిపారు. ఈ సీజన్‌లో  వివాహాలు తగ్గినందున తీవ్రంగా నష్టపోయినట్టు క్యాటరింగ్, పెళ్లి మంటపాల అలంకరణ, మంగళ వాయిద్యాల వారన్నారు. ఈ శ్రావణమాసంలో చివరగా ఈనెల 29, సెప్టెంబర్ ఒకటో తేదీన మాత్రమే పెద్ద ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు.
 
 రత్నగిరిపై భక్తుల రద్దీ
 సత్యదేవుని ఆలయం శనివారం భక్తులు, పెళ్లి బృందాలతో కిటకిటలాడింది. స్వామివారి సన్నిధిన శనివారం తెల్లవారు జామున 2.46 గంటల ముహూర్తంలో   50 వివాహాలు జరిగాయి. దేవస్థానంలోని ఆరు ప్రధాన సత్రాల్లోనూ, ఆలయ ప్రాంగణంలోను ఈ వివాహాలు జరిగాయి. వారికి తోడు జిల్లా నలుమూలలా వివాహాలు చేసుకున్న మరో 25 జంటలు వారి బంధువులతో సొంత వాహనాల్లో రత్నగిరికి చేరుకుని స్వామివారి వ్రతాలాచరించారు.
 
 శనివారం రత్నగిరిపై భక్తుల రద్దీ ఏర్పడింది. శనివారం రాత్రి ఎనిమిది గంటల ముహూర్తంలో పది వివాహాలు జరిగాయి. రాత్రి 11.08 గంటలు, తెల్లవారుజామున రెండుగంటల ముహూర్తాలలోనూ దేవస్థానంలో 40 వరకూ వివాహాలు జరుగుతాయని పండితులు తెలిపారు. సత్యదేవుని ఆలయాన్ని శనివారం 25 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు 2,489 జరిగాయి. ఆదాయం రూ.13 లక్షలు వచ్చిందని అధికారులు తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement