ఏ వయసు ముచ్చట ఆ వయసులో తీరాలని పెద్దలు అంటారు. ఉద్యోగం వచ్చి కెరీర్‌లో స్థిరపడ్డాకే పెళ్లి అనే భావన మన దగ్గర పెరిగి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లే వద్దనుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరగడం గమనించాల్సిన సంగతి. ‘జాతీయ గణాంకాల సంస్థ’ తాజా నివేదిక ప్రకారం మన దేశంలో 15– 29 ఏళ్ల మధ్య ఉండే యువత పెళ్లి తలంపునే చేయడం లేదు. అంటే 29 వరకూ పెళ్లి మాట ఎత్తడం లేదు. ఉద్యోగాలు వచ్చినా ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా ‘చేసుకోవచ్చులే’ అనో మనసులో మాట చెప్పకుండా దాటవేయడమో చేస్తూ... తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్నారు.
‘గుండెల మీద కుంపటి’ అనేది చాలా చెడ్డ పోలిక. గతంలో ఈ పోలికను పెళ్లి కాని ఆడపిల్లల విషయంలో తెచ్చేవారు. దానికి కారణం 1980ల ముందు వరకూ కట్నాలు తీవ్ర ప్రాధాన్యం వహించడం. ఆడపిల్లల్లో చదువు తక్కువగా ఉండి మధ్యతరగతి దగ్గర తగినంత డబ్బు లేకపోవడం. ఈ పరిస్థితి మెల్లగా మారింది. చదువులు, ఉద్యోగాలు ఇవన్నీ ప్రాధాన్యంలోకి వచ్చాయి. ‘కట్నాలు’ క్రమంగా ‘లాంఛనాలు’గా మారాయి. మంచి సంబంధం కుదిరితే ఇచ్చిపుచ్చుకోవడాలు రెండో ప్రాధాన్యంలోకి వస్తున్నాయి. కనుక ఈ మాట మెల్లగా కనుమరుగైంది. అయితే ఈ మాట మళ్లీ ఉనికిలోకి వస్తుందా అనిపిస్తోంది– కాకుంటే ఈసారి ఆడపిల్లలు మగపిల్లల విషయంలో. గతంలో ‘పెళ్లి చేయలేక’ ఈ మాట అనేవారు. ఇప్పుడు పిల్లలు ‘పెళ్లి చేసుకోక’ ఈ మాట అనాల్సి రావచ్చు.
ఏ మాటా చెప్పరు!
ఇప్పుడు చదువుకున్న పిల్లలకు ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం దొరుకుతున్నది. సంపాదనలో పడుతున్నారు. అయినా సరే పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. అసలు చేసుకుంటారో లేదో చెప్పడం లేదు. దాంతో తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్నారు. తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. ‘బాగా స్థిరపడి చేసుకోవడం’ అనే భావన గతంలో ఉన్నా ఈ ‘స్థిరపడటం’ అనే మాటకు అంతుపొంతు లేకుండా ఉంది. అబ్బాయిలు ‘ఏదో ఒక ఉద్యోగం వస్తే చేసుకుంటాను’ అనేది పోయి ‘ఈ స్థాయి వరకూ వచ్చాక చేసుకుంటాను’ అనుకుంటున్నారు. అమ్మాయిలు ‘మంచి సంబంధం ఏదో ఒకటి’ అనుకోవడం లేదు. చాలా ఆచితూచి ఎంపిక చేసుకుంటున్నారు.
దాంతోపాటు అసలు సమాజంలో ‘పెళ్లి’కి సంబంధించిన సకారాత్మక (పాజిటివ్) దృష్టి వ్యాప్తి చెందుతోందా నెగెటివ్ దృష్టి వ్యాప్తి చెందుతోందా కూడా గమనించాలి. ‘పెళ్లి ఒక జంజాటం’, ‘గొడవలు ఉంటాయి’, ‘తల్లిదండ్రులతో అత్తామామలతో సమస్యలు’, ‘అడ్జస్ట్‌మెంట్ సమస్యలు’, ‘విడాకుల భయం’, ‘చేసుకున్న భాగస్వామితో కంపాటబులిటీ ఉండకపోతే అన్న సందేహం’ ఇవన్నీ యువతలో పెళ్లి గురించి వైముఖ్యం పెంచుతున్నాయేమో గమనించాలి. రోజు రోజుకూ పెరిగిపోతున్న ‘కాస్ట్ ఆఫ్ లివింగ్’... ధరలు... ఇంటి అద్దెలు... ఫ్లాట్ల విలువలు... వీటిని చూసి సంసారాన్ని ఈదగలమా అని అనిపిస్తూ ఉంటే గనక ఆ దడుపుకు మంత్రం పాలనా, పౌర వ్యవస్థలు కనిపెట్టాల్సిందే.
నూటికి 23 శాతం
జాతీయ గణాంకాల సంస్థ తాజా అధ్యయనం ప్రకారం నేటి యువతలో (15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు) పెళ్లి మాట ఎత్తనివారి సంఖ్య 2019 నాటికి 23 శాతం ఉంది. 2011లో వీరి శాతం 17 మాత్రమే. బాల్య వివాహాలు తగ్గడం ఈ అధ్యయనంలో కనిపించినా తరుణ వయసు వచ్చాక కూడా పెళ్లి మాట ఎత్తకపోవడం పట్టించుకోవలసిన విషయంగా అర్థమవుతోంది. అబ్బాయిల్లో 2011లో నూటికి 20 మంది పెళ్లి మాట ఎత్తకపోతే 2019లో 26 మంది పెళ్లి ప్రస్తావన తేవడం లేదు.
అమ్మాయిల్లో 2011లో నూటికి 11 మంది పెళ్లి చేసుకోకపోతే 2019లో నూటికి 20 మంది పెళ్లి పట్ల నిరాసక్తిగా ఉన్నారు. సగటున చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి నూటికి 23 మంది 29 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్ల్‌లోనో ఒక వీధిలోనో 100 మంది యువతీ యువకులు ఉంటే వారిలో 23 మంది అవివాహితులుగా కనిపిస్తూ ఉంటారు. ఆ ఇళ్ల తల్లిదండ్రులు, ఆ అవివాహితులు నిత్యం ‘పెళ్లెప్పుడు’ అనే మాటను ఎదుర్కొనాల్సిందే.
కశ్మీర్ మొదటి స్థానంలో
దేశం మొత్తం గమనిస్తే పెళ్లి కాని యువతీ యువకులు అత్యధికంగా ఉన్న ప్రాంతం జమ్ము అండ్ కశ్మీర్. దీని తర్వాత ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబు రాష్ట్రాలు వస్తున్నాయి. అంటే ఇక్కడ దాదాపు 30 ఏళ్ల వరకూ పెళ్లిళ్లు జాప్యం అవుతున్నాయి. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఈ శాతం తక్కువగా ఉంది. అంటే కొంచెం ఆలస్యమైనా చేసుకుంటూ ఉన్నారు. అయితే మొత్తంగా దేశంలో చూసినప్పుడు 25 నుంచి 29 మధ్య చేసుకునేవారి సంఖ్య గతంలో బాగున్నా ఇప్పుడు బాగా తగ్గింది. అంటే అమ్మాయిలలో 50 శాతం మంది, అబ్బాయిల్లో 80 శాతం మంది 25 దాటి 29 సమీపిస్తున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు.
నిపుణులు కారణాలు శోధించి పరిష్కారాలు వెతక్క తప్పని స్థితి ఇది.
అవసరం ఏముంది అనేవారే ఎక్కువ
పెళ్లి విషయంలో ఇప్పుడు అబ్బాయిలే కాదు, అమ్మాయిల మైండ్ సెట్‌లోనూ మార్పులు వచ్చాయి. నిన్నటి తరం ‘డిగ్రీ చేస్తే చాలు’ అనుకునేవారు. ఇప్పుడు అలా కాదు పై చదువులకు విదేశాలకు వెళుతున్నారు. ‘ముందు సెటిల్ అవాలి, తర్వాతనే పెళ్లి’ అంటున్నారు. గతంలో పిల్లలకు వయసు వచ్చింది త్వరగా పెళ్లి చేయాలని అనుకునేవారు పేరెంట్స్. పిల్లలు కూడా పెద్దల నిర్ణయానికి తలవంచేవారు. ఇప్పుడు పెళ్లి నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తున్నారు పెద్దలు. దీంతో తమకు సెట్ అయ్యే మ్యాచ్ దొరకాలని పిల్లలు చూస్తున్నారు. దాదాపు ఇప్పుడంతా మప్పై ఏళ్ల వరకు పెళ్లి ఆలోచనలు చేయడంలేదు. పెళ్లి అంటే ‘ఇప్పుడే అవసరం ఏముంది’ అంటున్నారు. అంత తొందర పడి మరొకరి మాట వినాలనేం ఉంది అనుకుంటున్నారు. ఈ ధోరణి ముందు ముందు ఇంకా పెరుగుతుంది. అంతేకాదు, డిస్టర్బ్‌డ్‌గా ఉన్న జంటలను చూసి, అంత కష్టం ఎందుకులే అనుకుంటున్నవారిని ఎక్కువ చూస్తున్నాం. ఇలా చాలా కారణాల వల్ల పెళ్లి వయసుకు పెద్ద గ్యాప్ వచ్చేసింది.
– ప్రొ. పి.జ్యోతి రాజా, సైకాలజిస్ట్, లైఫ్‌స్కిల్స్ ట్రెయినర్
Comments
Please login to add a commentAdd a comment