ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచవ్యాప్తంగా జనాభా గడచిన రెండు శతాబ్దాల్లో 8 రెట్లు పెరిగింది. వైద్య, సాంకేతిక, శాస్త్ర రంగాల్లో మానవుడు సాధించిన ప్రగతి సంపదను పెంచింది. దారిద్య్రాన్ని గణనీయంగా తగ్గించింది. మనిషి సగటు ఆయుప్రమాణాలు కూడా అంతటా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఫలితంగా నేడు కొందరు స్త్రీపురుషులు పెళ్లిచేసుకున్నాక విడాకులు తీసుకునో లేక వివాహం జోలికి పోకుండానో ఒంటరిగా తమ ఇళ్లలో జీవిస్తున్నారు. ఇలాంటి ఏకాకి బతుకులు లేదా కుటుంబాల సంఖ్య మంచి ప్రగతి సాధించిన దేశాల్లో ఓ మోస్తరు వేగంతో పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఎదురులేని అభివృద్ధి సాధించిన అమెరికాలో ‘ఏకసభ్య’ కుటుంబాలు మన ఊహకు అందని స్థాయిలో ఉన్నాయి.
దాదాపు 30 శాతం అమెరికా కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. ఈ ‘ఒంటరి బతుకులు’ ఒక్క అమెరికాలో మాత్రమే కనిపించే విలక్షణ ధోరణి కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తమ నివాసాల్లో ఒంటరిగా బతుకుతున్న మనుషుల లేదా ‘కుటుంబాల’ సంఖ్య చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం–1940లో ఇలాంటి ‘ఏకాకి కుటుంబాలు’ 8శాతం ఉండగా, 1970 నాటికి రెట్టింపయి 18శాతానికి పెరిగాయి. 2022 కల్లా ఏకసభ్య అమెరికా కుటుంబాల సంఖ్య మూడు రెట్లకు పెరిగి 29 శాతానికి చేరింది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే సామాజిక మార్పు. కిందటి శతాబ్దంలో జనాభాకు సంబంధించి ఇది అతి పెద్ద మార్పు. దీన్ని మనం అప్పుడు గుర్తించలేకపోయాం,’ అని ఈ అంశంపై ‘గోయింగ్ సోలో’ అనే గ్రంథం రాసిన న్యూయార్క్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ఎరిక్ క్లినెన్ బర్గ్ వ్యాఖ్యానించారు.
‘సోలో బతుకే సో బెటరూ’ అనే తెలుగు సినిమా పాట చెప్పిన విధంగా అమెరికాలో కొందరు జీవించడంతోపాటు అక్కడ ఆలస్యంగా పెళ్లిచేసుకోవడమనే ధోరణి ఈమధ్య పెరిగింది. దేశంలో మహిళా సాధికారత పెరగడం తమ జీవితాల్లోని అన్ని విషయాల్లో వారు స్వయంగా నిర్ణయం తీసుకునే దశకు ఎదగడం కూడా అమెరికాలో స్త్రీ, పురుషుల్లో మూడో వంతు ఒంటరిగా జీవించడానికి ప్రధాన కారణమని క్లినెన్ బర్గ్ వివరించారు.
ఆధునిక పాశ్యాత్య పారిశ్రామిక దేశాల్లో ఇదే ట్రెండ్!
ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఐరోపాలో బాగా సంపన్న, సంక్షేమ దేశాల్లో ఒంటరి జీవితాలు లేదా కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. డెన్మార్క్ లో 39శాతం, ఫిన్లాండ్ లో 45శాతం , నెదర్లాండ్స్ లో 38శాతం, నార్వేలో 39శాతం, స్వీడన్ లో 40శాతం కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. సంపద, విద్య, జ్ఞానం పెరిగే మంచి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఒంటరి బతుకులు సామాజిక శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఐరోపా దేశాల్లోనే అమెరికాలో కన్నా ‘సోలో బతుకులు’ ఎక్కువ. అమెరికాలో ఇంకా వివాహ వ్యవస్థకు గొప్ప గౌరవం ఉంది. ఒంటరిగా జీవిస్తున్న వారిపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనం ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది.
ఒంటరిగా బతుకుతూ వృద్ధాప్యం మీదపడుతున్న వ్యక్తుల శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిగతులు త్వరగా క్షీణించడమేగాక వారు అల్పాయుష్కులవు తున్నారని ఈ పత్రిక తెలిపింది. గతంలో ఉమ్మడి కుటుంబాలకు ఇప్పుడు చిన్న కుటుంబ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చే భారతదేశంలో సైతం ఆధునిక అభివృద్ధితో పాటు ‘సోలో కుటుంబాల’ సంఖ్య కొద్ది కొద్దిగా పెరగడాన్ని సామాజికవేత్తలు గుర్తిస్తున్నారు.
2019-2020 ఐరాస మహిళా విభాగం నివేదిక ప్రకారం-ఇండియాలో పైన వివరించిన ఏకసభ్య కుటుంబాలు 12 శాతం వరకూ ఉన్నాయి. దేశంలో మొదటి నుంచీ పెళ్లి చేసుకోవడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఉంది. వివాహితులకు అదనపు గౌరవం సమాజంలో లభిస్తుంది. పెళ్లిచేసుకోనివారికి లేదా జీవిత భాగస్వామి లేని ఒంటరి వ్యక్తులకు అద్దె ఇళ్లు కూడా తేలికగా దొరకవు. ప్రభుత్వాలు తక్కువ మంది పిల్లలను కనాలని చెబుతాయేగాని, అసలు పెళ్లే చేసుకోవద్దని సలహా ఇవ్వవు. అయినా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన జీవనశైలి కారణంగా భారతదేశంలోనూ సోలో కుటుంబాలు నెమ్మదిగా పెరగడం ప్రపంచీకరణకు సంకేతమని కొందరు నిపుణులు అభిప్రాయపడు తున్నారు.
- విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment