rajyasabha member
-
‘సోలో బతుకే సో బెటరూ’.. ఇపుడిదే ట్రెండ్ బాసూ!
ప్రపంచవ్యాప్తంగా జనాభా గడచిన రెండు శతాబ్దాల్లో 8 రెట్లు పెరిగింది. వైద్య, సాంకేతిక, శాస్త్ర రంగాల్లో మానవుడు సాధించిన ప్రగతి సంపదను పెంచింది. దారిద్య్రాన్ని గణనీయంగా తగ్గించింది. మనిషి సగటు ఆయుప్రమాణాలు కూడా అంతటా పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అందించిన స్వేచ్ఛా స్వాతంత్య్రాల ఫలితంగా నేడు కొందరు స్త్రీపురుషులు పెళ్లిచేసుకున్నాక విడాకులు తీసుకునో లేక వివాహం జోలికి పోకుండానో ఒంటరిగా తమ ఇళ్లలో జీవిస్తున్నారు. ఇలాంటి ఏకాకి బతుకులు లేదా కుటుంబాల సంఖ్య మంచి ప్రగతి సాధించిన దేశాల్లో ఓ మోస్తరు వేగంతో పెరుగుతోంది. అన్ని రంగాల్లో ఎదురులేని అభివృద్ధి సాధించిన అమెరికాలో ‘ఏకసభ్య’ కుటుంబాలు మన ఊహకు అందని స్థాయిలో ఉన్నాయి. దాదాపు 30 శాతం అమెరికా కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. ఈ ‘ఒంటరి బతుకులు’ ఒక్క అమెరికాలో మాత్రమే కనిపించే విలక్షణ ధోరణి కాదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తమ నివాసాల్లో ఒంటరిగా బతుకుతున్న మనుషుల లేదా ‘కుటుంబాల’ సంఖ్య చరిత్రలో ఎప్పుడూ లేనంత ఎక్కువ ఉంది. అమెరికా జనాభా లెక్కల ప్రకారం–1940లో ఇలాంటి ‘ఏకాకి కుటుంబాలు’ 8శాతం ఉండగా, 1970 నాటికి రెట్టింపయి 18శాతానికి పెరిగాయి. 2022 కల్లా ఏకసభ్య అమెరికా కుటుంబాల సంఖ్య మూడు రెట్లకు పెరిగి 29 శాతానికి చేరింది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే సామాజిక మార్పు. కిందటి శతాబ్దంలో జనాభాకు సంబంధించి ఇది అతి పెద్ద మార్పు. దీన్ని మనం అప్పుడు గుర్తించలేకపోయాం,’ అని ఈ అంశంపై ‘గోయింగ్ సోలో’ అనే గ్రంథం రాసిన న్యూయార్క్ యూనివర్సిటీ సామాజికశాస్త్రవేత్త ఎరిక్ క్లినెన్ బర్గ్ వ్యాఖ్యానించారు. ‘సోలో బతుకే సో బెటరూ’ అనే తెలుగు సినిమా పాట చెప్పిన విధంగా అమెరికాలో కొందరు జీవించడంతోపాటు అక్కడ ఆలస్యంగా పెళ్లిచేసుకోవడమనే ధోరణి ఈమధ్య పెరిగింది. దేశంలో మహిళా సాధికారత పెరగడం తమ జీవితాల్లోని అన్ని విషయాల్లో వారు స్వయంగా నిర్ణయం తీసుకునే దశకు ఎదగడం కూడా అమెరికాలో స్త్రీ, పురుషుల్లో మూడో వంతు ఒంటరిగా జీవించడానికి ప్రధాన కారణమని క్లినెన్ బర్గ్ వివరించారు. ఆధునిక పాశ్యాత్య పారిశ్రామిక దేశాల్లో ఇదే ట్రెండ్! ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఐరోపాలో బాగా సంపన్న, సంక్షేమ దేశాల్లో ఒంటరి జీవితాలు లేదా కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. డెన్మార్క్ లో 39శాతం, ఫిన్లాండ్ లో 45శాతం , నెదర్లాండ్స్ లో 38శాతం, నార్వేలో 39శాతం, స్వీడన్ లో 40శాతం కుటుంబాల్లో ఒక్కొక్కరే సభ్యులు. సంపద, విద్య, జ్ఞానం పెరిగే మంచి ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి ఒంటరి బతుకులు సామాజిక శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఐరోపా దేశాల్లోనే అమెరికాలో కన్నా ‘సోలో బతుకులు’ ఎక్కువ. అమెరికాలో ఇంకా వివాహ వ్యవస్థకు గొప్ప గౌరవం ఉంది. ఒంటరిగా జీవిస్తున్న వారిపై న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించిన కథనం ఆందోళన కలిగించే అంశాలు వెల్లడించింది. ఒంటరిగా బతుకుతూ వృద్ధాప్యం మీదపడుతున్న వ్యక్తుల శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిగతులు త్వరగా క్షీణించడమేగాక వారు అల్పాయుష్కులవు తున్నారని ఈ పత్రిక తెలిపింది. గతంలో ఉమ్మడి కుటుంబాలకు ఇప్పుడు చిన్న కుటుంబ వ్యవస్థకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చే భారతదేశంలో సైతం ఆధునిక అభివృద్ధితో పాటు ‘సోలో కుటుంబాల’ సంఖ్య కొద్ది కొద్దిగా పెరగడాన్ని సామాజికవేత్తలు గుర్తిస్తున్నారు. 2019-2020 ఐరాస మహిళా విభాగం నివేదిక ప్రకారం-ఇండియాలో పైన వివరించిన ఏకసభ్య కుటుంబాలు 12 శాతం వరకూ ఉన్నాయి. దేశంలో మొదటి నుంచీ పెళ్లి చేసుకోవడాన్ని ప్రోత్సహించే సంప్రదాయం ఉంది. వివాహితులకు అదనపు గౌరవం సమాజంలో లభిస్తుంది. పెళ్లిచేసుకోనివారికి లేదా జీవిత భాగస్వామి లేని ఒంటరి వ్యక్తులకు అద్దె ఇళ్లు కూడా తేలికగా దొరకవు. ప్రభుత్వాలు తక్కువ మంది పిల్లలను కనాలని చెబుతాయేగాని, అసలు పెళ్లే చేసుకోవద్దని సలహా ఇవ్వవు. అయినా స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో కూడిన జీవనశైలి కారణంగా భారతదేశంలోనూ సోలో కుటుంబాలు నెమ్మదిగా పెరగడం ప్రపంచీకరణకు సంకేతమని కొందరు నిపుణులు అభిప్రాయపడు తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు -
నేడు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన నలుగురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల్లో పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావు, అయోధ్య రామిరెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో సభ్యుడు పరిమళ్ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోతున్నారని, మరోరోజు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. వీరిలో చాలామంది నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాటు సామాజిక దూరం పాటించాల్సి ఉన్నందున సభలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
మాతృభూమి ఎండీ కన్నుమూత; ప్రధాని సంతాపం
తిరువనంతపురం: కేరళకు చెందిన ప్రముఖ సోషలిస్టు నాయకులలో ఒకరైన రాజ్యసభ ఎంపీ, ప్రముఖ మలయాళ దినపత్రిక మాతృభూమి మేనేజింగ్ డైర్టెక్టర్ వీరేంద్ర కుమార్ గురువారం కన్నుమూశారు. గత రాత్రి 8.30 గంటలకు కోజికోడ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్‌తో ఆయన మరణించారు. వీరేంద్రకుమార్‌కు భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈయన రాష్ట్ర, జాతీయ రాజకీయాలలో, మీడియా రంగంలో, సాహితీ ప్రపంచంలో ఇలా ప్రతీ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. చదవండి: తబ్లీగ్ జమాత్ చీఫ్‌పై సీబీఐ దర్యాప్తు లోక్‌సభ సభ్యునిగా కోజికోడ్ నుంచి రెండుసార్లు గెలిచిన వీరేంద్రకుమార్ కేంద్ర, రాష్ట్రాల్లో రెండింటిలోనూ మంత్రిగా పనిచేశారు. 2010లో తన ప్రయాణ కథనం హైమావత భోవిల్‌కు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. వీటితో పాటు తన సాహితీ రచనలకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు, 100కి పైగా అవార్డులను గెలుచుకున్నారు. కాగా ఆయన మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'పేదలకు, నిరుపేదల పక్షాన గొంతెత్తారని గుర్తుచేశారు. సమర్థవంతమైన శాసనసభ్యుడిగా, ఎంపీగా ఆయన మంచి గుర్తింపు పొందారంటూ' మోడీ ట్వీట్ చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ కూడా వీరేంద్ర కుమార్ మృతికి సంతాపం ప్రకటించారు. చదవండి: పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే -
సదా ప్రజల సేవకుడినే
సాక్షి, నెల్లూరు(సెంట్రల్): ప్రజలకు సదా సేవకుడిలా పనిచేస్తానని రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని 9వ డివిజన్ ప్రాంతంలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఇరిగేషన్ మంత్రి పి.అనిల్‌కుమార్‌తో కలిసి శనివారం ఎంపీ వేమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 36 మండలాల్లో 88 వాటర్ ప్లాంట్లు ప్రజల అవసరార్థం వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలను భాగస్వామ్యం చేçస్తూ ఈ కార్యక్రమం ముందుకుతుందన్నారు. తాగునీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు వీపీఆర్ ఫౌండేషన్ ఎప్పుడూ చేయూతనిస్తుందని తెలిపారు. చిన్న వయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చిన అనిల్‌కుమార్ ఎల్లవేళలా ప్రజల మధ్యనే ఉంటూ సేవలందిస్తున్నారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అనిల్‌కుమార్‌కు కీలకమైన మంత్రి పదవి ఇచ్చారని అన్నారు. అనంతరం మంత్రి అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఎక్కడ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అడిగినా కాదనకుండా ఏర్పాటు చేస్తున్న ఆయన అపర భగీరథుడని కొనియాడారు. కార్యక్రమంలో పి.రూప్‌కుమార్‌యాదవ్, వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ నారాయణరెడ్డి, ఎన్.శంకర్, రాజేశ్వరరెడ్డి, ముక్కాల ద్వారకానాథ్, దామవరపు రాజశేఖర్, తిప్పిరెడ్డి రఘురామిరెడ్డి, వంగాల శ్రీనివాసులురెడ్డి, మంగిశెట్టి శ్యామ్, పొడమేకల సురేష్, ఈదల ధనూజారెడ్డి, మర్రి శ్రీధర్, అద్దంకి జగన్, తంబి, వెంకటరమణ, బాలు, మోహన్, పి.లక్ష్మీనారాయణ, నూనె మల్లికార్జున్‌యాదవ్, పప్పు నారాయణ, గాదంశెట్టి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యసభ ఎంపీగా అరుణ్ జైట్లీ ప్రమాణం
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ(65) ఆదివారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. గత నెలలో బీజేపీ తరఫున యూపీ నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇటీవల కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జైట్లీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందిన కారణంగా ఆయన ప్రమాణ స్వీకారం ఆలస్యమైంది. ఆదివారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు చాంబర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. -
ఎంపీ కనకమేడలకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: ఏపీ టీడీపీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ను బుధవారం హైకోర్టు న్యాయవాదులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు ఏజీ జె.రామచంద్రరావు, ఇరు సంఘాల అధ్యక్షులు జల్లి కనకయ్య, చల్లా ధనంజయ తదితరులు పాల్గొన్నారు. -
దేశ్‌ప్రేమ్ దివస్‌గా జనవరి 23
న్యూఢిల్లీ: జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జరపాలని రాజ్యసభలో ఓ సభ్యుడు డిమాండ్ చేశారు. ఆ రోజును దేశ్ ప్రేమ్ దివస్‌గా పాటించాలని, జాతీయ సెలవుగా ప్రకటించాలంటూ రాజ్యసభలో ఇటీవల సీపీఐ(ఎం) నుంచి బహిష్కృతుడైన రితవ్రత బెనర్జీ జీరో అవర్‌లో ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకులు కలకత్తాలో హౌస్ అరెస్ట్ చేస్తే వీరోచితంగా తప్పించుకుని అఫ్గానిస్తాన్ ద్వారా జర్మనీకి, అక్కడి నుంచి జర్మన్ సబ్ మెరైన్‌లో జపాన్ వెళ్లారని ఆయన హీరోయిజాన్ని కొనియాడారు. జనవరి 23ను దేశభక్తి దినంగా ప్రకటించి సెలవు ఇచ్చినట్లయితే మరుగునపడ్డ ఆ వీరుడికి నివాళి ఇచ్చినట్లవుతుందని అన్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కలుగజేసుకుని దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే సెలవు కోసం చూడొద్దని సభ్యులను కోరారు. -
శరద్ సభ్యత్వం రద్దుపై స్టే కుదరదు’
న్యూఢిల్లీ: జేడీయూ బహిష్కృత నేత శరద్ యాదవ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ సభాధ్యక్షుడు ఇచ్చిన ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించేందుకు ఢిల్లీ హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఎంపీ పదవిలో ఉన్నప్పుడు ఆయనకు లభించిన జీతభత్యాలు, బంగళా సహా ఇతర సదుపాయాలన్నీ ఈ కేసులో తుది తీర్పు వచ్చేవరకు కొనసాగుతాయని జడ్జి జస్టిస్ విభు బఖ్రు స్పష్టం చేశారు. కేసు తుది విచారణ మార్చి 1న మొదలవనుంది. -
బీజేపీ నైతిక మద్దతు ఇవ్వచ్చు: మైత్రేయన్
ఎవరూ ఊహించని విధంగా తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిన తర్వాత.. ఆయనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలిపిన సీనియర్లలో వి.మైత్రేయన్ ఒకరు. మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికైన ఆయన.. ఎప్పుడూ తన జేబులో అమ్మ జయలలిత ఫొటో ఉంచుకుంటారు. బుధవారం ఉదయం నేరుగా పన్నీర్ సెల్వం ఇంటికి వెళ్లిన ఆయన.. ఆ తర్వాత ముఖ్యమంత్రి మీడియా సమావేశంలో కూడా ఆయన వెంటే ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా అమ్మ వారసత్వం కొనసాగాలనే కోరుకుంటున్నారని, ఇలాంటి తరుణంలో రాత్రి పన్నీర్ సెల్వం వ్యాఖ్యలు చూసిన తర్వాత.. పార్టీ మొత్తం ఆయనవెంటే ఉండాలని తాను బలంగా కోరుకుంటున్నానని కూడా మైత్రేయన్ అన్నారు. ప్రస్తుత పరిణామాలు చిన్నమ్మకు సానుకూలంగా లేవని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలంతా 'సేఫ్ గేమ్' ప్లే చేయాలనుకుంటున్నారని, పరిస్థితులను బట్టి ఎటు కావాలంటే అటు మొగ్గేందుకు సానుకూలంగా ఉన్నారని మైత్రేయన్ చెప్పారు. తన ఆత్మసాక్షి ప్రకారమే తాను నడుచుకుంటున్నానని, ఎప్పటికైనా అమ్మకు విశ్వాసపాత్రుడిగానే ఉంటానని చెప్పారు. ఈ తరుణంలో కేంద్రం కావాలంటే నైతిక మద్దతు మాత్రమే ఇవ్వచ్చు గానీ రాజకీయ మద్దతు కాదని ఆయన నొక్కిచెప్పారు. ఇప్పుడు గానీ, రేపు గానీ ఎమ్మెల్యేలంతా పన్నీర్ సెల్వానికి మద్దతు చెప్పాల్సిందేనని మైత్రేయన్ అభిప్రాయపడ్డారు. బలవంతపు రాజీనామాలపై రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అందువల్ల సీనియర్ నాయకుడైన గవర్నర్ విద్యాసాగర్ రావు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. ఎప్పుడు సంక్షోభం వచ్చినా జయలలిత కూడా పన్నీర్ సెల్వాన్నే తనకు విశ్వాసపాత్రుడిగా ఎంచుకుని ఆయనకే పదవి అప్పగించారని మైత్రేయన్ గుర్తుచేశారు. అందువల్ల ఇప్పుడు కూడా పార్టీలో ఆయన వెంటే ఎక్కువ మంది వెళ్తారని అన్నారు. -
విజయసాయిరెడ్డి ఎన్నికపై కువైట్‌లో సంబురాలు
కువైట్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు కువైట్‌లోని మలియా ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ యం. బాలిరెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ బి. హెచ్ మాట్లాడారు. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టిన నైతిక విలువలకు కట్టుబడి నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటు పడుతున్న విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి దగ్గడం సంతోషకరమైన విషయమని అన్నారు. కువైట్ కమిటీ, గల్ఫ్ ప్రవాసాంధ్రుల తరపున పత్రికా ముఖంగా విజయసాయిరెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర దేశ రాజకీయాలలో నైతిక విలువలకు కట్టుబడిన ఏకైక రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని నిరూపిస్తూ మాట తప్పని మడమ తిప్పని మా అధినేత వై.యస్. జగన్మోహన్ రెడ్డి అని యం.బాలిరెడ్డి కొనియాడారు. వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి విజయసాయి రెడ్డికి రాజ్యసభ పదవి ఇవ్వడం అభినందనీయమని తామంతా వైఎస్ఆర్సీపీలో పనిచేస్తుందుకు ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహా కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం.వి. నరసారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రేహామాన్ ఖాన్, యన్. మహేశ్వర్ రెడ్డి, యం. చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు నాగిరెడ్డి చంద్ర, పి. సురేష్ రెడ్డి, రమణ యాదవ్, లాజరస్, మర్రి కళ్యాణ్ దుగ్గి గంగాధర్ జి. ప్రవిణ్ కుమార్ రెడ్డి, షా హుస్సేన్, షేక్ గఫార్, సయ్యద్ సజ్జద్, రఫీఖ్ ఖాన్, మహాబూబ్ బాషా, అబుతురాబ్, వాసుదేవ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, జయచంద్ర రెడ్డి, హనుమంతు రెడ్డి, తదితరులు పాల్గోన్నారు.