న్యూఢిల్లీ: జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జరపాలని రాజ్యసభలో ఓ సభ్యుడు డిమాండ్ చేశారు. ఆ రోజును దేశ్ ప్రేమ్ దివస్‌గా పాటించాలని, జాతీయ సెలవుగా ప్రకటించాలంటూ రాజ్యసభలో ఇటీవల సీపీఐ(ఎం) నుంచి బహిష్కృతుడైన రితవ్రత బెనర్జీ జీరో అవర్‌లో ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకులు కలకత్తాలో హౌస్ అరెస్ట్ చేస్తే వీరోచితంగా తప్పించుకుని అఫ్గానిస్తాన్ ద్వారా జర్మనీకి, అక్కడి నుంచి జర్మన్ సబ్ మెరైన్‌లో జపాన్ వెళ్లారని ఆయన హీరోయిజాన్ని కొనియాడారు. జనవరి 23ను దేశభక్తి దినంగా ప్రకటించి సెలవు ఇచ్చినట్లయితే మరుగునపడ్డ ఆ వీరుడికి నివాళి ఇచ్చినట్లవుతుందని అన్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కలుగజేసుకుని దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే సెలవు కోసం చూడొద్దని సభ్యులను కోరారు.