Venkaiahanaidu
-
‘క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు ఎలాంటి మినహాయింపు ఉండదు’
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. ‘పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవు.’అని స్పష్టం చేశారు వెంకయ్య. పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను వెల్లడించారు రాజ్యసభ ఛైర్మన్. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ ప్రక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు. ఇదీ చదవండి: Mallikarjun Kharge: ఈడీ విచారణకు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్! -
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 100వ ప్రచురణను ఆవిష్కరించిన భారత ఉపరాష్ట్రపతి
భారత ఉపరాష్ట్రపతి గౌ.ముప్పవరపు వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని సోమవారం లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. న్యూఢిల్లీలో ఆయన అధికారిక భవనంలో అంతర్జాల వేదిక ద్వారా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని, భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని గౌరవ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. 2020 అక్టోబర్‌లో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారధి- సింగపూర్, తెలుగు మల్లి - ఆస్ట్రేలియా, ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య - యునైటెడ్ కి౦గ్ డమ్, దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక - జొహానెస్ బర్గ్ వారు సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను “సభావిశేష సంచిక” పుస్తక రూపంలో తీసుకొచ్చారు. సాహితీ సదస్సును, పుస్తకాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల అభినందనలు వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, 27 ఏళ్ళుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని తెలిపారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం తాను ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను ఆకాంక్షిస్తున్నామని, తెలుగు భాష సంస్కృతులను ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్ని వదులుకోరాదని సూచించారు. అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికత విజ్ఞానం భాషాభివృద్ధికి అనుకూలంగా ఎన్నో నూతన అవకాశాలను అందిస్తోందన్న ఉపరాష్ట్రపతి, వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా భాషా సంస్కృతులను అభివృద్ధి చేసుకోగలమని తెలిపారు. భాషను మరచిపోయిన నాడు, మన సంస్కృతి కూడా దూరమౌతుందన్న ఆయన, మన ప్రాచీన సాహిత్యాన్ని యువతకు చేరువ చేయాలని సూచించారు. తెలుగులో ఉన్న అనంతమైన సాహితీ సంపదను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యతను తెలుగు భాష కోసం కృషి చేస్తున్న సంస్థలు తలకెత్తుకోవాలన్న ఉపరాష్ట్రపతి, మన పదసంపదను సైతం ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు. నిద్ర లేచింది మొదలు మనం వినియోగించే ఎన్నో పదాల్లో ఆంగ్లం కలసిపోతుండడం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, ఉన్న పదాలను సమర్థవంతంగా వాడుకోవడం, నూతన మార్పులకు అనుగుణంగా కొత్త తెలుగు పదాలను సృష్టించుకోవడం అవసరమని తెలిపారు. అంతర్జాల వేదికగా సాహిత్య, భాషాభివృద్ధికి కృషి చేస్తున్న సంస్థలను ఈ సందర్భంగా అభినందించిన ఆయన, ఈ పుస్తక సంపాదకులైన వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడికి, రచయితలకు, ప్రచురణకర్తలకు పేరు పేరునా అభినందనలు తెలిపారు. గతాన్ని నెమరువేసుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ తెలుగు భాష భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తున్న ఈ తరుణంలో తెలుగు భాష, సాహిత్యాల పట్ల అపారమైన ఆసక్తి, అనురక్తి ఉన్న గౌ. ఉపరాష్ట్రపతి చేతులమీదుగా తమ 100వ పుస్తకావిష్కరణ జరగడం తమ అదృష్టంగా భావిస్తూ, 1995 లో ప్రారంభ అయిన తమ పుస్తక ప్రచురణల పురోగతిని వంగూరి ఫౌండేషన ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు తమ స్వాగతోపన్యాసం లో క్లుప్తంగా వివరించారు. ఈ పుస్తకం తమ 100వ ప్రచురణగాను, వంగూరి ఫౌండేషన్ గత 27 ఏళ్ళగా సాధించిన ప్రగతిని, సాహిత్య ప్రస్థానాన్ని పదిలపరిచిన వీడియో ప్రసారాన్ని గౌ. ఉపరాష్ట్ఱపతి ఎంతో ఆసక్తితో వీక్షించి, ప్రశంసించారు. ఈ అవిష్కరణ మహోత్సవాన్ని రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా నిర్వహించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్ బర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లండ్), శాయి రాచకొండ లతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి దక్షిణ ఆఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు. ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదిక లో జరిగిన “సభా విశేష సంచిక” డయాస్పోరా తెలుగు కథానికి -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) “వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంధాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలం లో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో ఆ సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు. -
దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఉపరాష్ట్రపతి
సాక్షి, న్యూఢిల్లీ: అందరితో కలిసి ఇంట్లోనే ఆనందంగా వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుని దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సమస్త జీవుల సమభావనకు ప్రతీకగా నిలిచే పండుగ వినాయక చవితి అని అన్నారు. దీని ద్వారా బాలగంగాధర్ తిలక్ సామూహిక సమావేశాలతో జాతీయవాద భావాలను వ్యాప్తి చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో మట్టితో చేసిన సహజమైన వినాయకుని ప్రతిమలతో వినాయకచవితి పర్వదినాన్నిమార్గదర్శకాలను పాటిస్తూ ఇళ్ళలోనే జరుపుకోవాలని సూచించారు. భక్తి ప్రపత్తులతో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మికత, ఆనందాల సమ్మిళితంగా పర్యావరణాన్ని పరిరక్షించే వేడుకగానే ఈ ఉత్సవాలను భావించాలని కోరారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా కంకణబద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రకృతిని-సంస్కృతిని సమతుల్యం చేస్తూ సుసంపన్నమైన మానవాళి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. చదవండి: ‘సాక్షి’ చూస్తూ ఇంట్లోనే ఎకో ఫ్రెండ్లీ గణేశా తయారీ.. -
మోదీ కొత్త విమానం ఎప్పుడు వస్తుందో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాణించే విమానాల లిస్ట్‌లో మరో రెండు అత్యాధునిక విమానాలు చేరనున్నాయి. ప్రధాని సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీ కలిగి ఉన్న రెండు బోయింగ్-777 విమానాలను ఏర్పాటు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రయాణిండం కోసం కూడా ఈ విమానాలను ప్రభుత్వం వినియోగించనుంది. ఈ ఏడాది జూలై నుంచి ఇవి అందుబాటులోకి రావాల్సి ఉండగా కరోనా కారణంగా ఈ విమానాల డెలివరీ ఆలస్యం అయ్యింది. దీంతో ఈ విమానాలు సెప్టెంబర్ నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ విమానాలు అందుబాటులోకి వస్తే ప్రధాని నరేంద్రమోదీ ఇక నుంచి అమెరికా బోయింగ్ సంస్థ రూపొందించిన బోయింగ్ 777 ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రయాణించనున్నారు. (ఇక ‘ఆరోగ్య సేతు’ బాధ్యత వారిదే..) ఇప్పటి వరకు ప్రధాని ప్రయాణించే విమానం బోయింగ్ 747 ను ఎయిర్ఇండియా ఫైలట్లు నడుపుతుండగా బోయింగ్ 777 విమానాలను మాత్రం ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఫైలెట్లు నడపనున్నారు. ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆరుగురు పైలట్లకు B777 విమానం నడపడంపై శిక్షణ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్తగా వస్తున్న ఈ విమానాల మెయింటెయినెన్స్‌ను ఎయిరిండియాకు అనుబంధ సంస్థగా ఉన్న ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ తీసుకుంటుంది. ఇక ఈ విమానం ప్రత్యేకతల విషయానికి వస్తే ఇందులో మిస్సైల్ వ్యవస్థ ఉంది. ప్రధాన మంత్రికి మరింత రక్షణను ఇచ్చేలా లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ ఉన్నాయని అమెరికా బోయింగ్ సంస్థ తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ రెండు ఎయిర్ క్రాఫ్ట్‌లను 190 మిలియన్ డాలర్లకు భారత్‌కు అమ్మేందుకు అమెరికాతో ఒప్పందం జరిగింది. (‘6 రోజులుగా అక్కడ ఒక్కరు మరణించలేదు’) -
ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట
సాక్షి, ఢిల్లీ: జాతీయ స్థాయిలో పర్యాటక రంగానికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అవార్డుల పంట పండింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో సాధించిన అభివృద్ధికి గానూ, ఈ ఏడాదికి ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవార్డు దక్కించుకుంది. ఇక బెస్ట్ టూరిస్ట్ ఫ్రెండ్లీ రైల్వేస్టేషన్‌గా విశాఖపట్నం అవార్డును కైవసం చేసుకుంది. అలాగే ఉత్తమ కాఫీటేబుల్ బుక్ కేటగిరీలోనూ ఏపీ ప్రథమ స్థానాన్ని అందుకుంది. తెలంగాణ పర్యాటక శాఖకు ఈ ఏడాది రెండు అవార్డులు దక్కాయి. సాంకేతికతను అత్యుత్తమంగా, వినూత్నంగా వినియోగించుకొనే రాష్ట్రంగా తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచింది. టూరిస్టులకు పర్యాటక ప్రదేశాలకు సంబంధించి విస్తృత సమాచారం అందించడం కోసం పర్యాటక శాఖ రూపొందించిన 'ఐ ఎక్స్ప్లోర్ తెలంగాణ' అనే మొబైల్ యాప్‌కు ఈ అవార్డు దక్కింది. బెస్ట్ మెడికల్ టూరిజం విభాగంలో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ అవార్డులను అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా 2017-18 సంవత్సరానికి సంబంధించి జాతీయ టూరిజం అవార్డులను ప్రకటించారు. అడ్వెంచర్ టూరిజం కేటగిరీలో గోవా, మధ్యప్రదేశ్ అవార్డులను పొందాయి. సినిమా ప్రమోషన్లకు ఉత్తమ స్నేహ పూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఎంపికైంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ గతంలో పర్యాటక రంగానికి ఆదరణ తక్కువని, ప్రస్తుతం భారత్‌లో పర్యాటకులకు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నామన్నారు. -
దాడి చేస్తే ప్రతి దాడి ఉంటుంది
న్యూఢిల్లీ: భారత్‌ను ఎంత రెచ్చగొడుతున్నా భరిస్తూనే ఉందని, కానీ దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పష్టంచేశారు. ఆ ప్రతి దాడి.. ఎన్నటికీ మర్చిపోలేనంత భారీ స్థాయిలో ఉంటుందంటూ పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన రెండో సంవత్సర పాలనలో చేసిన 95 ప్రసంగాలతో కూడిన ‘రిపబ్లికన్ ఎథిక్–2’, ‘లోక్తంత్ర కే స్వర్’ ఖండ్–2 పుస్తకాలను ఆవిష్కరించిన సందర్భంగా వెంకయ్యనాయుడు శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పుస్తకాలను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రచురించింది. దేశ చరిత్రను పరిశీలిస్తే ఎక్కడా దూకుడు ప్రదర్శించినట్లు కనిపించదని, ‘విశ్వగురువు’గా ప్రసిద్ధి చెందిన భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని ఆయన గుర్తు చేశారు. అయినా దాడి చేయలేదు చాలా మంది భారత్‌పై దండెత్తినా, పాలించినా, నాశనం చేసినా, మోసం చేసినా తామెవరిపైనా దాడి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. పుస్తకం లోని ఓ మాటను ప్రస్తావిస్తూ... భారత్ తన సార్వభౌమాధికారాన్ని రక్షించుకోవడానికి శాంతిమార్గా న్నే ఎన్నుకుందన్నారు. రాష్ట్రపతి రాసిన పుస్తకంలో ఆయన జ్ఞానం ప్రతిబింబిస్తోందన్నారు. ఈ పుస్తకాలు కిండిల్ వంటి ఆన్లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగాల్లో జాతినుద్దేశించినవి, ప్రపంచాన్ని ఉద్దేశించినవి, మహాత్మాగాంధీ గురించి మాట్లాడినవి ఉన్నాయని వెల్లడించారు. -
మాతృభాషను మరవొద్దు
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇతర భాషల్లో ఉండదని, వీలైనంత వరకు తల్లిభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠిలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల 14వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘తల్లి భాష కంటి చూపులాంటిది. చూపు ఉన్నప్పుడే ఎంతటి ఖరీదైన అద్దాలనైనా పెట్టుకోగలం. కానీ, చూపే లేనప్పుడు కళ్లద్దాలను వినియోగించే పరిస్థితి ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. కేవలం మాట్లాడుకోవడమే కాదు, ప్రభుత్వ పాలన మొదలు అన్ని విభాగాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. అందుకు పాలకులు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో స్థానికభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు పరిస్థితులన్నీ సామాన్యులకు అర్థమవుతాయి’అని వివరించారు. దేశంలో మహిళా అక్షరాస్యత పెరుగుతోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ తప్పనిసరైందని, కాని స్థానిక మాధ్యమంలో చదువుకున్నవారే గొప్ప వ్యక్తులయ్యారని పేర్కొన్నారు. మహిళలదే రాజ్యం: ప్రాధాన్యతారంగాల్లో మహిళల పాత్ర కీలకమవుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో మహిళలే అత్యధికులని, ఫార్చ్యూన్ 500 కంపె నీల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని, వారి సారథ్యంలోని కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. మహి ళ అక్షరాస్యురాలైతే సమాజమే మారిపోతుందని, అందులో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు 1924 సంవత్సరంలో కోఠిలో మహిళా కళాశాల ఏర్పాటైందని, ఇది త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతోందన్నారు. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారే అవకాశం కూడా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. కోఠి మహిళా కాలేజీలో చదివిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని, స్నాతకోత్సవానికి హాజరు కావడానికి కారణాన్ని పేర్కొంటూ తన కూతురు కూడా ఇదే కాలేజీలో పట్టా అందుకుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు. -
దేశ్‌ప్రేమ్ దివస్‌గా జనవరి 23
న్యూఢిల్లీ: జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని జరపాలని రాజ్యసభలో ఓ సభ్యుడు డిమాండ్ చేశారు. ఆ రోజును దేశ్ ప్రేమ్ దివస్‌గా పాటించాలని, జాతీయ సెలవుగా ప్రకటించాలంటూ రాజ్యసభలో ఇటీవల సీపీఐ(ఎం) నుంచి బహిష్కృతుడైన రితవ్రత బెనర్జీ జీరో అవర్‌లో ప్రస్తావించారు. బ్రిటిష్ పాలకులు కలకత్తాలో హౌస్ అరెస్ట్ చేస్తే వీరోచితంగా తప్పించుకుని అఫ్గానిస్తాన్ ద్వారా జర్మనీకి, అక్కడి నుంచి జర్మన్ సబ్ మెరైన్‌లో జపాన్ వెళ్లారని ఆయన హీరోయిజాన్ని కొనియాడారు. జనవరి 23ను దేశభక్తి దినంగా ప్రకటించి సెలవు ఇచ్చినట్లయితే మరుగునపడ్డ ఆ వీరుడికి నివాళి ఇచ్చినట్లవుతుందని అన్నారు. రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు కలుగజేసుకుని దీన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే సెలవు కోసం చూడొద్దని సభ్యులను కోరారు. -
కఠిన వైఖరే సరైన మార్గం!
రాజకీయవాదితో ప్రత్యేకించి గతంలో బీజేపీ సభ్యుడిగా ఉన్న వ్యక్తితో ఏకీభవించగలగడం కన్నా మించిన సంతోషం ఏముంటుంది? నిబంధనలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తూ, సభకు అంతరాయం కలిగించే పార్లమెంటు సభ్యులపై కఠినమైన క్రమశిక్షణను అమలు చేయాలంటూ ఉపరాష్ట్రపతి ఇచ్చిన పిలుపును బలపరుస్తూ ఈ కథనం రాస్తున్నాను. ఇటీవల చేసిన ఒక ప్రసంగంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సభామధ్యంలోకి దూసుకొచ్చే ఎంపీలను తక్షణం సస్పెండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఇది అద్భుతమైన ఆలోచన. కానీ దీన్ని అమలు చేయాలంటే, కఠినంగా వ్యవహరించడమే కాకుండా తమ అధికారాన్ని ప్రబలంగా ఉపయోగించే గుణం కలిగిన స్పీకర్లు మనకు అవసరం. అయితే ప్రతి ఒక్కరికీ అలాంటి శక్తి ఉండదు. అంటే స్పీకర్ పదవికి మనం ఎంచుకోవాల్సిన వ్యక్తుల విషయంలో మరింత జాగ్రత్త వహించాలని దీనర్థం. కాస్సేపు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ లేక ఆస్ట్రేలియా ప్రతి నిధుల సభను గమనించండి. ఈ రెండు సభలకు చెందిన స్పీకర్లు క్రమశిక్షణను అమలుపర్చడంలో ప్రదర్శించే కఠిన వైఖరిని మీరు పరిశీలించవచ్చు. అక్కడ సభకు అంతరాయం కలిగించడాన్ని అలా పక్కనబెట్టండి.. పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధమైన భాషను వాడినా వారు సహించరు. గతంలో ప్రతిపక్ష నాయకుడు టోనీ అబ్బోట్ పట్ల అసభ్యకరమైన భాషను ప్రయోగించిన నాటి ఆస్ట్రేలియా ప్రధాని జూలియా గిల్లార్డ్ను క్షమాపణ చెప్పవలసిందిగా ఆ దేశ దిగువ సభ స్పీకర్ ఒత్తిడి చేసిన సందర్భాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ప్రధాని స్పీకర్ ఆదేశానికి కట్టుబడకపోవడంతో ఆయన తన స్వరం పెంచి ఆమెను తీవ్రంగా మందలించారు. దాంతో మారుమాట లేకుండా ఆమె స్పీకర్ ఆదేశాన్ని పాటించారు. మన లోక్‌సభ స్పీకర్లు అలాంటి దృఢవైఖరిని ప్రదర్శించాలంటే వారి స్వాతంత్య్రానికి హామీ ఇవ్వడంతోపాటు, సభలో వారిని కొనసాగించే హామీని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానమంత్రికి లేదా అధికారంలో ఉన్న పార్టీ మెజారిటీకి తలవంచే స్పీకర్ కఠినంగా వ్యవహరించడానికి బదులు సులువుగా లోబడిపోతారు. ఈ విషయంలో మనం బ్రిటిష్ ప్రతినిధుల సభ పాటించే రెండో సంప్రదాయాన్ని అనుసరించాలి. ఒకసారి ఎంపికయ్యాక పార్లమెంటుకు తిరిగి ఎన్నికయ్యే హక్కుపై బ్రిటిష్ స్పీకర్‌కు హామీ ఉంటుంది. ఎంపీగా వారు తిరిగి ఎంపిక కావడం కోసం ఇతరులెవరూ ఆ స్థానంలో పోటీ చేయరు. పైగా ఇక పదవిలోంచి దిగిపోవాలని అతడు/ఆమె ఎంచుకునేంతవరకు స్పీకర్ తన పదవిలో కొనసాగుతూనే ఉంటారు. అందుకే బ్రిటిష్ స్పీకర్ జాన్ బెర్కౌ.. భారతీయ స్పీకర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా కనిపిస్తారు. మరొక విషయం: పార్లమెంటు సభ్యులు సరిగా ప్రవర్తించకుంటే వారిని సభనుంచి బయటకు బలవంతంగా పంపించే అధికారం మన స్పీకర్లకు తప్పక ఉండాలి. కాన్బెర్రా (ఆస్ట్రేలియా)లో స్పీకర్ ఆదేశాలను ధిక్కరించి లేదా దాటవేసి పార్లమెంటరీయేతర అసభ్య వ్యాఖ్యలను చేస్తూ అంతరాయం కలిగించే ఎంపీలను, మంత్రులను సైతం చాంబర్ వదలి వెళ్లిపోవలసిందిగా స్పీకర్ ఆదేశిస్తారు. దాన్ని సభ్యులు తప్పక పాటిస్తారు కూడా. అవసరమైన ప్రతిసారీ విధించే తక్షణ శిక్షారూపం ఇది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు ఇలా స్పీకర్ ఆదేశించిన ఘటనను నేను స్వయంగా చూశాను. అర్ధగంట విరామం తర్వాత అలా సస్పెండ్ చేసిన ఎంపీని తిరిగి సభలోకి అనుమతిస్తారు. అయితే, ఇదంతా పార్లమెంట్ విశిష్ట ప్రాముఖ్యతను గుర్తించే ఎంపీలపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు మాత్రమే సభ్యతగా వ్యవహరించాల్సిన అవసరాన్ని వారు గుర్తిస్తారు. ఇక్కడ కూడా ప్రధానంగా వారి వైఖరి మారవలసిన అవసరముంది. పార్లమెంటు ప్రాముఖ్యతను పునరుద్ధరించడానికి ఈ ప్రక్రియ ఇతోధికంగా సహాయపడుతుంది. ఈ రోజుల్లో పార్లమెంటు సంవత్సరానికి 70 రోజులు కూడా సమావేశం కావడం లేదు. గత పదేళ్ల కాలంలో సగటున 64 నుంచి 67 రోజులు మాత్రమే పార్లమెంటు నడుస్తోంది. అదే 1952–1972 మధ్యకాలంలో పార్లమెంట్ సమావేశాలు సంవత్సరానికి 128 నుంచి 132 రోజులపాటు జరిగాయి. ప్రస్తుత పార్లమెంట్ రికార్డు అయితే మరీ ఘోరంగా ఉంది. 2014లో లోక్‌సభ సమావేశాలు 55 రోజులు (రాజ్యసభ 52 రోజులు) జరిగితే, 2017లో ఇంతవరకు ఉభయ సభలూ కేవలం 48 రోజులు మాత్రమే సమావేశమయ్యాయి. అంతిమంగా మన పార్లమెంటు శుక్రవారం తిరిగి సమావేశమైంది. కానీ దాని ఎజెండాలో ఈ సమస్యలు కీలకంగా ఉన్నాయా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. నిస్సందేహంగా కొద్దిమంది వ్యక్తులు నా ఆందోళనను పంచుకుంటారు కానీ మొత్తంగా సంస్థ విషయం ఏమిటి? ప్రభుత్వంలోనూ, ప్రతిపక్షంలోనూ ఉన్న మన ప్రముఖ రాజకీయ నేతల మాటేమిటి? వారి మౌనం ప్రతీకాత్మకమైనదేనా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net కరణ్ థాపర్ -
ఉగ్రభూతాన్ని మట్టుబెట్టే‘లా’ చేయండి
అంతర్జాతీయ న్యాయ పండితుల సదస్సులో ఉప రాష్ట్రపతి మానవ హక్కుల రక్షణకు న్యాయ నిపుణులు చర్యలు తీసుకోవాలి: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాలకు పెను భూతంగా మారిన ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అంతర్జాతీయ న్యాయ నిపుణులు కఠిన చట్టాలు రూపొందించాలని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉగ్ర వాదానికి కుల, మతాలు లేవని.. రాజకీయా లకు అతీతంగా, కలసికట్టుగా దేశాలన్నీ ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో తొక్కేయాలని విజ్ఞప్తి చేశారు. మానవ జాతికి తొలి శత్రువైన ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించే చట్టాలకు న్యాయ కోవిదు లంతా సిఫార్సు చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్ శామీర్‌పేటలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయ సంస్థ 78వ సమావేశాలను వెంకయ్య ప్రారంభించారు. 1873లో బెల్జియంలో 11 మంది అంతర్జాతీయ న్యాయవాదులతో ప్రారంభమైన సంస్థ సమావేశా లు తొలిసారి భారత్‌లో జరుగుతున్నాయి. వారంపాటు జరగనున్న ఈ సదస్సులో దేశ, విదేశాల నుంచి 60 మంది న్యాయ కోవిదులు హాజరయ్యారు. సదస్సు సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, శాంతి, సమానత్వం, మానవ హక్కుల రక్షణ, అభివృద్ధి కోసం సూచనలు చేస్తూనే వాటికి అవరోధంగా ఉన్న ఉగ్రవాదాన్ని నిర్మూలించే దిశగా న్యాయ నిపుణులు మేధోమథనం చేయాలన్నారు. ఏ దేశ ప్రభుత్వ ప్రలోభాలకు లోనవకుండా ఉన్నందునే 1904లో అంతర్జాతీయ న్యాయ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి వచ్చిందని.. ఆ స్ఫూర్తితోనే ఉగ్రవాదాన్ని మట్టుబెట్టేందుకు కృషి చేయాలని కోరారు. పురాణ కాలంలోనే ధర్మ పాలన ధర్మబద్ధ పాలన రామాయణ, మహాభారత కాలాల నుంచే దేశంలో ఉందన్నారు. పరిస్థితులకు అనుగుణంగా చెప్పే న్యాయమే ధర్మమని వెంకయ్య అన్నారు. వసుదైక కుటుంబ విధానమూ పురాణ కాలం నాటిదేనని, కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో ‘ప్రభుత్వం–పాలన–న్యాయం’ గురించి ఏనాడో చెప్పారన్నారు. ‘రిఫామ్– పర్ఫామ్– ట్రాన్స్ఫామ్’ ప్రస్తుత భారత ప్రభుత్వ విధానమన్నారు. ‘నేనూ లా చేసినా ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వం జైల్లో పెట్టడంతో లాయర్ కాలేకపోయాను’ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు నాగేంద్రసింగ్, నీలకంఠశాస్త్రి చేసిన న్యాయ సేవలు, ఇప్పుడు అంతర్జాయతీ సముద్ర జలాలపై పెమ్మరాజు శ్రీనివాసరావు (పీఎస్ రావు) చేస్తున్న కృషిని వెంకయ్య కొనియాడారు. పుట్టుకతోనే మానవ హక్కులు: గవర్నర్ మనిషి పుట్టు్టకతోనే మానవ హక్కులొస్తా యని తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. ఆ హక్కుల రక్షణకు న్యాయ నిపుణులు చర్యలు తీసుకోవాలని కోరారు. కేసీఆ ర్ ప్రభుత్వం భూమి, ఇతర చట్టాలపై న్యాయ సంస్కరణలు తీసుకొస్తోందని రాష్ట్ర న్యాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. దేశ, విదేశాల నుంచి ప్రముఖ న్యాయ నిపుణులు హాజరైన ఈ సమావేశం మంచి సిఫార్సులు చేయాలని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ కోరారు. అంతర్జాతీ య న్యాయపర అంశాలపై తొలిసారి ప్రైవేట్, పబ్లిక్ రంగాలు కలసి పనిచేస్తున్నాయని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా (జెనీవా) అధ్యక్షుడు పీఎస్ రావు అన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, నల్సార్ వర్సిటీ వైస్ చాన్సలర్ ఫైజాన్ ముస్తాఫా, రిజిస్ట్రార్ వి.బాలకిట్టారెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.