ఓయూ మహిళా కళాశాల స్నాతకోత్సవంలో విద్యార్థినులతో మాట్లాడుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
సాక్షి, హైదరాబాద్: మాతృభాషలోనే భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉంటుందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మాతృభాషలో ఉన్న మాధుర్యం ఇతర భాషల్లో ఉండదని, వీలైనంత వరకు తల్లిభాషలోనే మాట్లాడాలని పిలుపునిచ్చారు. గురువారం కోఠిలో జరిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల 14వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. వివిధ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ‘తల్లి భాష కంటి చూపులాంటిది.
చూపు ఉన్నప్పుడే ఎంతటి ఖరీదైన అద్దాలనైనా పెట్టుకోగలం. కానీ, చూపే లేనప్పుడు కళ్లద్దాలను వినియోగించే పరిస్థితి ఉండదు. ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషకున్న ప్రాధాన్యత తగ్గదు. కేవలం మాట్లాడుకోవడమే కాదు, ప్రభుత్వ పాలన మొదలు అన్ని విభాగాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే జరగాలి. అందుకు పాలకులు ప్రత్యేక చొరవ చూపాలి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా అన్నిరాష్ట్రాల్లో స్థానికభాషకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు పరిస్థితులన్నీ సామాన్యులకు అర్థమవుతాయి’అని వివరించారు. దేశంలో మహిళా అక్షరాస్యత పెరుగుతోందన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇంగ్లిష్ తప్పనిసరైందని, కాని స్థానిక మాధ్యమంలో చదువుకున్నవారే గొప్ప వ్యక్తులయ్యారని పేర్కొన్నారు.
మహిళలదే రాజ్యం: ప్రాధాన్యతారంగాల్లో మహిళల పాత్ర కీలకమవుతోందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇటీవల ఒలింపిక్స్‌లో భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో మహిళలే అత్యధికులని, ఫార్చ్యూన్ 500 కంపె నీల్లో మహిళలే సీఈవోలుగా ఉన్నారని, వారి సారథ్యంలోని కంపెనీలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు. మహి ళ అక్షరాస్యురాలైతే సమాజమే మారిపోతుందని, అందులో భాగంగా నరేంద్రమోదీ ప్రభుత్వం మహిళాభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
రవీంద్రనాథ్ ఠాగూర్ సూచన మేరకు 1924 సంవత్సరంలో కోఠిలో మహిళా కళాశాల ఏర్పాటైందని, ఇది త్వరలో శత వసంతాలు పూర్తి చేసుకోబోతోందన్నారు. ఈ కళాశాల విశ్వవిద్యాలయంగా మారే అవకాశం కూడా ఉందని ఉపరాష్ట్రపతి అన్నారు. కోఠి మహిళా కాలేజీలో చదివిన వారంతా ఉన్నత శిఖరాలు అధిరోహించారని, స్నాతకోత్సవానికి హాజరు కావడానికి కారణాన్ని పేర్కొంటూ తన కూతురు కూడా ఇదే కాలేజీలో పట్టా అందుకుందన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్స్‌లర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ రోజారాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment