
క్రిమినల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ సభ్యులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేయవచ్చని, అరెస్ట్‌లు చేయవచ్చని స్పష్టం చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. క్రిమినల్ కేసుల్లో వారు సైతం సామాన్య ప్రజలతో సమానమేనని, ఎంపీ పదవితో వారికి ఎలాంటి రక్షణ ఉండదని వెల్లడించారు. ‘పార్లమెంటు సభ్యులు తమ పార్లమెంటరీ విధులను అడ్డంకులు లేకుండా నిర్వహించేందుకు వీలుగా కొన్ని ప్రత్యేకాధికారాలను అనుభవిస్తారు. కానీ, క్రిమినల్ కేసుల్లో ఎంపీలకు, సామాన్య ప్రజలకు ఎలాంటి బేధాలు ఉండవు.’అని స్పష్టం చేశారు వెంకయ్య.
పార్లమెంట్ సమావేశాల వేళ తనకు ఈడీ సమన్లు జారీ చేయటంపై కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించిన మరుసటి రోజే వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. సివిల్ కేసుల్లో పార్లమెంట్ సభ్యులకు ఉన్న ప్రత్యేక అధికారాలను వెల్లడించారు రాజ్యసభ ఛైర్మన్. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి 40 రోజుల ముందు, తర్వాత సివిల్ కేసుల్లో అరెస్ట్ చేయలేరని పేర్కొన్నారు. అయితే, క్రిమినల్ కేసుల్లో ఎలాంటి రక్షణ ఉండదని స్పష్టం చేశారు. చట్టాన్ని, లీగల్ ప్రక్రియను గౌరవించటం చట్టసభ్యుల బాధ్యత అని సూచించారు.
ఇదీ చదవండి: Mallikarjun Kharge: ఈడీ విచారణకు మల్లికార్జున్ ఖర్గే.. కాంగ్రెస్‌లో టెన్షన్ టెన్షన్!