ఇది దేశంలోనే చరిత్ర
గాంధారి/లింగంపేట/సదాశివనగర్/నాగిరెడ్డిపేట: ఒకే రోజు 11 సబ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయడం దేశంలోనే చరిత్ర అని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని పలు ప్రాంతాలలో 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో రెప్పపాటు కోత లేకుండా కరెంటును సరఫరా చేస్తామన్నారు. పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమన్నారు. రైతుల కష్టాలను తీర్చి, భూగర్బ జలాలను పెంచడం కోసం ‘మిషన్ కాక తీయ’ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. చెరువులు, కుంటలకు పూర్వవైభవం తేవడానికి సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయలు మంజూరు చేశారని అన్నారు.
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాబోయే రోజులలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ది చెందుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలోనే ఇచ్చిన హామీలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. చాలా గ్రామాలలో భూగర్బ జలాలు అ డుగంటి పోయాయని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ భూమి సాగు చేయాలని సూచించారు. దీని కోసం సూక్ష్మ సేద్యం అలవర్చుకోవాలని అన్నారు. రైతులకు రాయితీపై బిందు సేద్యం పరికరాలు అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం రాయితీ, బీసీలకు 90 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎమ్మె ల్యే జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.