4 లక్షల మంది ఓటుకు దూరం
ఆదిలాబాద్‌అర్బన్: భారత రాజ్యాంగం ప్రతీ పౌరుడికి కల్పించిన ఓటు హక్కు సద్వినియోగం కాలేకపోతోంది. ఓటు అనే వజ్రాయుధాన్ని పౌరులు సక్రమంగా వినియోగించుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కనిపించిన చైతన్యం లోక్‌సభ ఎన్నికల్లో కానరాలేదు. సుమారు 72 శాతం మంది ఓటింగ్‌లో పాల్గొనగా, ఇంకా 28 శాతం మంది ఓటు వినియోగానికి దూరంగా ఉన్నట్లు ఈ నెల 11న జరిగిన పోలింగ్ ద్వారా స్పష్టమైంది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి గురువారం పోలింగ్ జరగగా, నియోజకవర్గ పరిధిలో 14,88,353 మంది ఓటర్లు ఉన్నారు.
అయితే 10,69,333 మంది ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొనగా, మిగతా 4,24,617 మంది ఓటర్లు ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఓటర్లలోనే కాదు.. పోలింగ్‌లోనూ పురుషుల కంటే మహిళలే అధికంగా ఓటింగ్‌లో పాల్గొని ముందు వరుసలో నిలబడ్డారు. ఖానాపూర్, ముథోల్ అసెంబ్లీ పరిధిలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనగా, మిగతా నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగిన ఓటింగ్‌లో పురుషులు ముందున్నారు.
ఓటుకు దూరంగా 4 లక్షల మంది..
ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గంలో 70 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. వెనువెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం పోలింగ్ శాతం తగ్గింది.
పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందని అధికార యం త్రాంగం అంచనా వేసినా.. పోలింగ్ లక్ష్యం చేరుకోలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 14,88,353 మంది ఓటర్లు ఉండగా, 10,63,439 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మిగతా 4.24 లక్షల మంది ఓటర్లు ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. సద్వినియోగం చేసుకున్న వారిలో 5,22,969 మంది పురుషులు ఉండగా, 5,39,862 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 56 మంది ఉండగా, 13 మంది ఓటేశారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే..
సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,03,165 మంది ఓటర్లు ఉండగా, 1,41,232 మంది ఓటేశారు. మిగతా 30,424 మంది పురుషులు, 31,507 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో 69.52 శాతం పోలింగ్ నమోదైంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 1,99,498 మంది ఓటర్లు ఉంగడా, 1,47,643 మంది ఓటు వినియోగించుకున్నారు. మిగతా 24,202 మంది పురుషులు, 27,647 మంది ఓటర్లు ఓటేయలేదు. దీంతో ఈ అసెంబ్లీ పరిధిలో పోలింగ్ 74.01 శాతం నమోదైంది. ఖానాపూర్ అసెంబ్లీ పరిధిలో 2,03,746 మంది ఓటర్లు ఉండగా, 1.44.986 మంది ఓటేశారు. 31,201 మంది పురుషులు, 27,554 మంది మహిళలు ఓటుకు దూరంగా ఉన్నారు. ఇక్కడ 71.16 శాతం నమోదైంది.
ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,19,612 మంది ఓటర్లు ఉండగా, 1,54,446 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మిగతా 29,777 మంది పురుషులు, 35,383 మంది మహిళలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేదు. దీంతో 70.33 శాతం పోలింగ్ నమోదైంది. బోథ్ పరిధిలో 1,93,373 మంది ఓటర్లు ఉండగా, 1,47,137 మంది ఓటేశారు. మిగతా 46236 మంది ఓటేయలేదు. ఇందులో పురుషులు 21,105 మంది పురుషులు ఉండగా, 25,128 మంది మహిళలు ఉన్నారు. ఇక్కడ పోలింగ్ 76.09 శాతం నమోదైంది.
నిర్మల్ నియోజకవర్గంలో 2,38,371 మంది ఓటర్లు ఉండగా, 1,59,531 మంది ఓటర్లు ఓటేశారు. మిగతా 78,840 మంది ముఖం చాటేశారు. ఇందులో 40,183 మంది పురుషులు ఉండగా, 39,247 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే ఈ సెగ్మెంట్లో పోలింగ్ 66.93 శాతం నమోదైంది. ఇక ముథోల్ అసెంబ్లీలో 2,30,588 మంది ఓటర్లు ఉండగా, 1,68,464 మంది ఓటేశారు. మిగతా 30,372 మంది పురుషులు ఉండగా, 31736 మంది ఓటు వినియోగానికి దూరంగా ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో పోలింగ్ 73.06 శాతం నమోదైంది.
ఓటర్లలో కానరాని చైతన్యం..
లోక్‌సభ ఎన్నికలు–2019లో ఆదిలాబాద్ లోక్‌సభ పరిధిలో పోలింగ్ 75 నుంచి 80 శాతం నమోదవుతుందనుకున్న అధికార యంత్రాంగం అంచనాలు తారుమారయ్యాయి. 14.88 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 10.63 లక్షల మంది మాత్రమే ఓటింగ్‌లో పాల్గొనడంతో 71.45 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, లోక్‌సభ పరిధిలోని మూడు జిల్లాల యంత్రాంగం గత మూడు నెలల నుంచి ఓటు హక్కు వినియోగం, ఓటు విలువ గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించినా ఫలితం కనిపించలేదు. ఇటు యంత్రాంగం, అటు ఎన్నికల సంఘం పోలింగ్‌పై ఎన్ని విధాలుగా ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు, ఓటరు ర్యాలీలు చేపట్టినా ఓటర్లలో చైతన్యం రాలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో కనిపించిన ఓటరు ఉత్సాహం లోక్‌సభ ఎన్నికల్లో కన్పించలేదని పలువురు చర్చించుకుంటున్నారు.