ఫలితమివ్వని చైతన్య కార్యక్రమాలు
సాక్షి, గుంటూరు :ఐదేళ్ళకోసారి వచ్చే వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకోని వారు జిల్లాలో 6,60,214 మంది ఉన్నారు. ఓటు హక్కు వినియోగంపై ఎన్నికల కమిషన్ ఈ దఫా విసృ్తత ప్రచారం నిర్వహించినా జిల్లాలో అధిక శాతం నిర్లక్ష్యం వహించారు. ఓటు హక్కు వినియోగంపై పదే పదే సదస్సులు నిర్వహించినా, స్వీప్ లాంటి కార్యక్రమాలు చేసినా ఫలితం లేకపోయింది. రాష్ట్రంలోనే గుంటూరు జిల్లాలో అధిక శాతం పోలింగ్ నమోదైనప్పటికీ అత్యంత రాజకీయ చైతన్యం గల జిల్లాలో 2009 ఎన్నికలతో పోలిస్తేస్వల్పంగానే పెరిగింది.
2009లో 77.88 శాతం పోలింగ్ నమోదు కాగా, 2014లో 81.89 శాతం పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ జిల్లాలో 85 శాతంకు పైగా పోలింగ్ జరుగుతుందని భావించినప్పటికీ ఆ దిశగా పోలింగ్ నమోదు కాలేదు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లాలో ఆరు లక్షలకు పైగా ఓటర్లు నిర్లిప్తత ప్రదర్శించడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పు పడుతున్నారు. ఓటు హక్కు నమోదులో ప్రదర్శించిన ఉత్సాహం ఓటేయడంలో ప్రదర్శించలేదు. జిల్లాలో ఇతరుల ఓట్లు (హిజ్రాలు) 356 కాగా, వీరిలోనూ కేవలం 18 మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ప్రదర్శించిన చైతన్యం పట్టణవాసులు ప్రదర్శించలేకపోయారు.
అత్యధికంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 90,820 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అత్యల్పంగా తాడికొండలో 19,917 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3,32,359 మంది ఓటర్లు ఓటు హక్కు సద్వినియోగపరుచుకోలేకపోయారు. నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2,37,628 మంది ఓటర్లు ఓటు హక్కుకు దూరంగా ఉన్నారు. ఇక బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 90,227 మంది ఓటు వేయలేదు. జిల్లాలో ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారి స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
గుంటూరులో 1,62,972 మంది బద్ధకస్తులు
గుంటూరు నగరంలో 4,86,087 మంది ఓటర్లుండగా, వీరిలో ఓటు హక్కు వినియోగించుకోని వారి సంఖ్య 1,62,972. జిల్లా కేంద్రం గుంటూరులోని రెండు నియోజకవర్గాల్లో ఇంతమంది ఓటు హక్కు వినియోగించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.
నియోజకవర్గాల వారీగా ఓటు హక్కు వినియోగించుకోని వారి సంఖ్య..
నియోజకవర్గం సంఖ్య
తాడికొండ 19,917
మంగళగిరి 34,456
పొన్నూరు 32,176
తెనాలి 49,416
ప్రత్తిపాడు 33,422
గుంటూరు పశ్చిమం 90,820
గుంటూరు తూర్పు 72,152
పెదకూరపాడు 28,230
చిలకలూరిపేట 28,252
నరసరావుపేట 32,011
సత్తెనపల్లి 32,322
వినుకొండ 32,286
గురజాల 44,873
మాచర్ల 45,631
వేమూరు 26,585
రేపల్లె 34,136
బాపట్ల 29,506
మొత్తం 6,60,214