ఇక జాతరే !
- జిల్లాలో నేటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తులు
- 21 వరకు స్వీకరణ
- 23న కలెక్టర్ సమక్షంలో డ్రా
- ఫీజుల రూపేణ రానున్న ఆదాయం రూ.65 లక్షలు
- డిమాండ్ దుకాణాలపై బడా వ్యాపారుల కన్ను
నిజామాబాద్ క్రైం : నూతన మద్యం విధానం నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో సోమవారం నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. కొత్త విధానం ప్రకారం రెండేళ్ల కాల పరిమితితో లెసైన్స్‌లు జారీ చేయనున్నారు. ఇప్పటి వరకు ఒక సంవత్సరం వరకే లెసైన్స్ ఇచ్చేవారు. కాలపరిమితి ముగియగానే మరో సంవత్సరానికి రెంటల్ చెల్లించుకుని లెసైన్స్ రెన్యూవల్ చేసేవారు. దాంతో వ్యాపారులకు రెంటల్ చెల్లించటం కష్టం అనిపించలేదు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఆరు శ్లాబుల్లో మద్యం దుకాణాలకు ప్రస్తుతమున్న లెసైన్సు ఫీజుకు ఆదనంగా 20 శాతం పెంచుతూ కొత్త ధర నిర్ణయించారు.
రెండేళ్ల లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మద్యం అమ్మకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఏడు రెట్లు దాటితే ఆ తర్వాత అమ్మకాలపై 8 శాతం పన్ను చెల్లించాలి. దీంతో రెండు సంవత్సరాల రెంటల్ ఫీజు చెల్లించేందుకు మద్యం వ్యాపారులు వెనుకాడుతున్నారు. పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి రావడంతో ఇప్పుడున్న వ్యాపార భాగస్వాములతో పాటు కొత్తవారిని కలుపుకుని దుకాణాలు చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో మొత్తం 130 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇందు లో నిజామాబాద్ యూనిట్ పరిధిలో 93, కామారెడ్డి యూ నిట్ పరిధిలో 37 దుకాణాలు ఉన్నాయి. నేటి నుంచి ఈనెల 21 వరకు దరఖాస్తులు విక్రయించనున్నారు. 23న కలెక్టర్ సమక్షంలో డ్రా తీసి దుకాణాలను కేటాయించనున్నారు.
దరఖాస్తు ఫీజుతో పెద్ద మొత్తంలో ఆదాయం..
మద్యం అమ్మకాలలో ప్రభుత్వం సరికొత్త విధానం ప్రవేశపెట్టి భారీగా ఆదాయం సమకూర్చుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా చీప్ లిక్కర్‌ను గ్రామ గ్రామానా అందుబాటులో ఉంచేలా కసరత్తు చేసింది. అరుుతే రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై వ్యతిరేకత రావటంతో వెనక్కి తగ్గింది. దీంతో ఆదాయం సమకూర్చుకునేందుకు మరో ఆలోచన చేసింది. మద్యం పాలసీ పాత పద్ధతినే కొనసాగిస్తూ రెంటల్ లెసైన్స్ ఫీజు 20 శాతం, మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజు ధర రూ.50 వేలకు పెంచింది. గతంలో దరఖాస్తు ఫీజు రూ.25 వేలు ఉండేది. జిల్లాలో మొత్తం 130 మద్యం దుకాణాలకు గాను దరఖాస్తు రూపేణా ఎక్సైజ్ శాఖకు రూ. 65 లక్షల ఆదాయం సమకూరనుంది. దరఖాస్తు చేసిన వారికి దుకాణం రాకున్నా ఈ ఫీజు తిరిగి ఇవ్వరు. దీంతో ఎన్ని ఎక్కువ దరఖాస్తులు వస్తే ప్రభుత్వానికి అంత ఆదాయం సమకూరనుంది.