NSFDC Scheme
-
బినామీ పేరుతో ఎమ్మెల్యే సబ్సిడీ వాహనాలు
-
ఉప్పులేటి కల్పనా.. మజాకానా !
సాక్షి, అమరావతి బ్యూరో : పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలు చేస్తున్న పలు పథకాలను అధికార టీడీపీ ప్రజాప్రతినిధులు చేజిక్కించుకుని లక్ష్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన రాయితీ వాహనాన్ని బినామీ పేరుతో తీసుకుని దర్జాగా వాడుకుంటున్న వైనం వెలుగుచూసింది. నిబంధనలకు పాతర.. కేంద్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్ఎఫ్డీసీ) ద్వారా సబ్బిడీతో వాహనాలను అందజేస్తోంది. మొవ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతికిరణ్ ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో ఏపీ 16టీపీ 0661 నంబర్‌తో ఈ ఏడాది మార్చి ఒకటిన గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు.అయితే రిజిస్ట్రేషన్ చేయడంలో నిబంధనలు పాటించలేదు. ట్యాక్సీ ట్రావెల్ కింద చూపితే ఎల్లో ప్లేట్ ఉండాలి. కానీ కారు యజమానిగా చూపి వైట్ ప్లేట్ వేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారు. పామర్రు ఎమ్మెల్యే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇన్నోవా వాహనంపై పామర్రు ఎమ్మెల్యేగా స్టిక్కర్ వేయించుకుని తిరుగుతున్నారు. దగాని క్రాంతికిరణ్ ఎమ్మెల్యే బినామీ మాత్రమేనని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అతని పేరుతో రాయితీతో కూడిన భూమి కొనుగోలు పథకం, వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ వెబ్సైట్లో కారు రిజిష్ట్రేషన్ వివరాలు. ఇందులోనే కారు యజమాని దగాని క్రాంతి కిరణ్ పేర్కొన్న దృశ్యం సొమ్మొకరిది సోకు మరొకరిది కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ కులాలలో పేదవర్గాలకు ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులు పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ పధకం ద్వారా మంజూరైన వాహనానికి 35% సబ్సిడీ ఉంటుంది. 2% మాత్రం లబ్ధిదారుని వాటాగా చెల్లించాలి. మిగిలిన 63% రుణ సౌకర్యం కల్పిస్తారు. వాహనాన్ని ట్రావెల్స్‌లో తిప్పి రుణం చెల్లించాల్సి ఉంది. కానీ రాష్ట్రప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చేలా వాహనంపై థ్యాంక్యూ సీఎం సార్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ గతంలో వాహనంపై సీఎం స్టిక్కర్ తొలగిస్తే వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం వివాదమైంది. గతంలోనూ నెల్లూరు జిల్లాలో టీడీపీ మాజీ మంత్రి తన డ్రైవర్ పేరుతో ఇన్నోవా వాహనం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. పేదవర్గాల పేరుతో రాయితీ పథకాలను టీడీపీ నేతలు బొక్కేయడంపై దళితులు మండిపడుతున్నారు. పేదలకు పంపిణీ చేశాం కృష్ణా జిల్లాలో ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా దరఖాస్తులు చేసుకున్న వారికి వాహనాలు పంపిణీచేశాం. నిబంధనల మేరకే వాహనాలను మంజూరు చేశాం. లబ్ధిదారుల్లో ప్రజాప్రతినిధుల బినామీలు ఉన్నారన్న విషయం మాకు తెలియదు. – సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, కృష్ణాజిల్లా -
కారు.. తకరారు
అనంతపురం:దళిత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రవేశపెట్టిన జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్డీసీ) కింద అమలు చేస్తున్న పథకాలు అర్హులకు దక్కడం లేదు. ఈ పథకం కింద సబ్సిడీపై పంపిణీ చేస్తున్న కార్లు అనర్హుల ఇళ్లకే చేరుతున్నాయి. ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందిన వారికే కార్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ వారిని పథకం లబ్ధిదారులుగా గుర్తించకపోయినా...పైస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దీంతో అధికారులు కూడా ఈ కార్ల..తకరారుతో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ప్రైవేట్ వ్యక్తిగత సహాయకుడు వైఏ చంద్రశేఖర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నాలుగుచక్రాల వాహనం మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. గతేడాది దరఖాస్తు తిరస్కరణ తాడిపత్రికి చెందిన వైఏ చంద్రశేఖర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ–సీ సర్టిఫికెట్ జత చేసి 2016–17 సంవత్సరంలో ఎన్ఎస్ఎఫ్డీసీ స్కీం కింద రూ. 8.50 లక్షల విలువైన ఇతియోస్ కారు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పథకం కింద 35 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. లబ్ధిదారుడు 5 శాతం తన వాటాగా చెల్లిస్తే మిగతా సొమ్ముకు బ్యాంకు లోను సదుపాయం కల్పిస్తారు. అయితే అర్హులను గుర్తించేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అధ్యక్షతన నిమిమించిన కమిటీ ఇంటర్వ్యూ సమయంలో చంద్రశేఖర్ దరఖాస్తును అర్హత లేదంటూ తిరస్కరించింది. పక్కనపెట్టిన కలెక్టర్ ఈ క్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చంద్రశేఖర్‌కు కారు మంజూరు చేసే ఫైలును అప్పటి కలెక్టర్ కోన శశిధర్ వద్దకు పంపారు. అయితే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా మంజూరు చేయడం, అందులోనూ జిల్లా కమిటీ సిఫార్సులు చేయకపోవడం తదితర కారణాలతో ఆయన చంద్రశేఖర్ దరఖాస్తును పక్కనపెట్టారు. అనంతరం వీరపాండియన్ కలెక్టర్‌గా వచ్చిన తర్వాత మరోమారు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చంద్రశేఖర్ ఫైలు ఆయన వద్దకు పంపారు. వీరపాండియన్ కూడా ఆ ఫైలును పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇదంతా తలనొప్పిగా భావించిన అధికారులు కూడా చంద్రశేఖర్‌కు నేడోరేపో వాహనం మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచే అసలు కథ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ప్రైవేట్ పీఏగా ఉన్న తనను ఎంపిక చేయకపోయేసరికి చంద్రశేఖర్ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. మరోవైపు చంద్రశేఖర్‌కు అనుకూలంగా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పాడు. చైర్మన్ మెప్పు పొందడానికి జిల్లా అధికారులపై ఒత్తిడి చేయించి దరఖాస్తును ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి సిఫార్సు చేయించారు. అందువల్లే లక్ష్యం పూర్తయినా ప్రత్యేక కోటా కింద చంద్రశేఖర్‌కు కారు మంజూరు చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు. నేను కొత్తగా వచ్చా..నాకేం తెలీదు చంద్రశేఖర్‌కు మేము కారు మంజూరు చేయలేదు. ఆయనకు కారు మంజూరు చేస్తూ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అప్పట్లో ఆయన దరఖాస్తును ఎందుకు తిరస్కరణకు గురైందో కూడా తెలీదు. ఇంతకు మించి నాకు తెలీదు. నేను కొత్తగా వచ్చా. – రామాంజనేయులు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ -
పబ్లిసిటీ స్టంట్ !
అనంతపురం సప్తగిరి సర్కిల్: సొమ్మొకరిది సోకొకరిది అంటే ఇదేనేమో.. ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం కింద ఎస్సీ నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇన్నోవా కార్లను ఎంచక్కా పబ్లిసిటీకి వాడేస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న కార్లపై తన ఫొటోలను వేయించి అన్ని వసతులు తమ ప్రభుత్వమే కల్పిస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు.