అనంతపురం:దళిత యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రవేశపెట్టిన జాతీయ షెడ్యూల్డ్ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) కింద అమలు చేస్తున్న పథకాలు అర్హులకు దక్కడం లేదు. ఈ పథకం కింద సబ్సిడీపై పంపిణీ చేస్తున్న కార్లు అనర్హుల ఇళ్లకే చేరుతున్నాయి. ఎక్కువ శాతం అధికార పార్టీకి చెందిన వారికే కార్లు మంజూరు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఒక వేళ వారిని పథకం లబ్ధిదారులుగా గుర్తించకపోయినా...పైస్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. దీంతో అధికారులు కూడా ఈ కార్ల..తకరారుతో నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ పథకం కింద అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ప్రైవేట్ వ్యక్తిగత సహాయకుడు వైఏ చంద్రశేఖర్‌కు నిబంధనలకు విరుద్ధంగా నాలుగుచక్రాల వాహనం మంజూరుకు అధికారులు రంగం సిద్ధం చేశారు.
గతేడాది దరఖాస్తు తిరస్కరణ
తాడిపత్రికి చెందిన వైఏ చంద్రశేఖర్ కన్వర్టెడ్ క్రిస్టియన్ బీసీ–సీ సర్టిఫికెట్ జత చేసి 2016–17 సంవత్సరంలో ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ స్కీం కింద రూ. 8.50 లక్షల విలువైన ఇతియోస్ కారు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పథకం కింద 35 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. లబ్ధిదారుడు 5 శాతం తన వాటాగా చెల్లిస్తే మిగతా సొమ్ముకు బ్యాంకు లోను సదుపాయం కల్పిస్తారు. అయితే అర్హులను గుర్తించేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం అధ్యక్షతన నిమిమించిన కమిటీ ఇంటర్వ్యూ సమయంలో చంద్రశేఖర్ దరఖాస్తును అర్హత లేదంటూ తిరస్కరించింది.
పక్కనపెట్టిన కలెక్టర్
ఈ క్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చంద్రశేఖర్‌కు కారు మంజూరు చేసే ఫైలును అప్పటి కలెక్టర్ కోన శశిధర్ వద్దకు పంపారు. అయితే ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా మంజూరు చేయడం, అందులోనూ జిల్లా కమిటీ సిఫార్సులు చేయకపోవడం తదితర కారణాలతో ఆయన చంద్రశేఖర్ దరఖాస్తును పక్కనపెట్టారు. అనంతరం వీరపాండియన్ కలెక్టర్‌గా వచ్చిన తర్వాత మరోమారు ఎస్సీ కార్పొరేషన్ అధికారులు చంద్రశేఖర్ ఫైలు ఆయన వద్దకు పంపారు. వీరపాండియన్ కూడా ఆ ఫైలును పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఇదంతా తలనొప్పిగా భావించిన అధికారులు కూడా చంద్రశేఖర్‌కు నేడోరేపో వాహనం మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఇక్కడి నుంచే అసలు కథ
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ప్రైవేట్ పీఏగా ఉన్న తనను ఎంపిక చేయకపోయేసరికి చంద్రశేఖర్ రాష్ట్ర అధికారులపై ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. మరోవైపు చంద్రశేఖర్‌కు అనుకూలంగా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో పని చేసే ఓ ఉద్యోగి చక్రం తిప్పాడు. చైర్మన్ మెప్పు పొందడానికి జిల్లా అధికారులపై ఒత్తిడి చేయించి దరఖాస్తును ఎస్సీ కార్పొరేషన్ ఎండీకి సిఫార్సు చేయించారు. అందువల్లే లక్ష్యం పూర్తయినా ప్రత్యేక కోటా కింద చంద్రశేఖర్‌కు కారు మంజూరు చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.
నేను కొత్తగా వచ్చా..నాకేం తెలీదు
చంద్రశేఖర్‌కు మేము కారు మంజూరు చేయలేదు. ఆయనకు కారు మంజూరు చేస్తూ రాష్ట్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. అప్పట్లో ఆయన దరఖాస్తును ఎందుకు తిరస్కరణకు గురైందో కూడా తెలీదు. ఇంతకు మించి నాకు తెలీదు. నేను కొత్తగా వచ్చా. – రామాంజనేయులు,ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
Comments
Please login to add a commentAdd a comment