ఇవి మహా మొండివి!
పాడి-పంట: వివిధ పంటల్లో అధికోత్పత్తులు సాధించడానికి సమగ్ర పోషక యాజమాన్యం ఎంత ముఖ్యమో సమగ్ర కలుపు నిర్మూలన కూడా అంతే అవసరం. రైతులు తమకు అందుబాటులో ఉన్న అన్ని పద్ధతులనూ ఉపయోగించుకొని కలుపు మొక్కల్ని నిర్మూలించాలి. ఎందుకంటే ఇవి పంట మొక్కలతో పోటీ పడి పెరుగుతూ గాలి, నీరు, వెలుతురు, పోషకాలను గ్రహిస్తాయి. దీనివల్ల పంట దిగుబడులు, నాణ్యత దెబ్బతింటాయి. చీడపీడల సమస్య కూడా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో కలుపు నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన పరిష్కారం కాల్ సెంటర్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎ.ప్రతాప్ కుమార్ రెడ్డి, డాక్టర్ పి.స్వర్ణశ్రీ, డాక్టర్ యస్.హేమలత, డాక్టర్ వై.సునీత (వీరిని తెలంగాణ రైతులు 1800-425-1110, ఆంధ్రప్రదేశ్ రైతులు 1800-425-4440 మొబైల్ ఫోన్ నెంబర్లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు) అందిస్తున్న సూచనలు...
కలుపు మొక్కలు తమ జీవితకాలాన్ని త్వరగా పూర్తి చేసుకుంటాయి. ఒకే పంటకాలంలో చాలాసార్లు విత్తనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విత్తనాలు భూమి లోపల అనేక సంవత్సరాల పాటు మొలకెత్తే శక్తిని కలిగి ఉంటాయి. వాతావరణం అనుకూలించినప్పుడు మొలకెత్తుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవి మహా మొండివి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ కూలీల కొరత, అధిక కూలి రేట్లు వంటి కారణాల వల్ల రైతులు సకాలంలో కలుపు మొక్కల్ని నిర్మూలించలేకపోతున్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే వ్యవసాయ పనిముట్లను ఉపయోగించి కూడా కలుపును నివారించవచ్చు. దీనివల్ల నేల గుల్లబారుతుంది. వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. నేలకు నీటిని నిల్వ చేసుకునే సామర్ధ్యం పెరుగుతుంది.
ఎలా వాడాలి?
పంట విత్తిన వెంటనే లేదా 2 రోజుల లోపు భూమిలో తేమ ఉండేలా చూసుకొని లీటరుకు 5-6 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ (స్టాంప్, పెండిగార్డ్, పెండిమిన్, పెండిస్టార్) లేదా అలాక్లోర్ (లాసో, అలాటాప్) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ మందుల్ని మొక్కజొన్న, పత్తి, మిరప, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, ఆముదంతో పాటు కూరగాయ పంటలైన టమాటా, క్యారట్, ఉల్లి, వెల్లుల్లి, బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ముల్లంగి, ధనియాలు, మెంతులు, ఆకుకూరలు, పందిరి జాతి కూరగాయ పంటల్లో వాడుకోవచ్చు.
తృణ ధాన్యపు పంటలైన జొన్న, సజ్జ, రాగిలో విత్తనాలు వేసిన 24-48 గంటల్లో లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున అట్రాజిన్ (అట్రాటాప్, సోలాలో, మిలేజిన్, సూర్య) కలిపి నేలపై పిచికారీ చేయాలి. ఇక మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగి పంటల్లో పైరు, కలుపు మొక్కలు మొలకెత్తిన 15-20 రోజుల తర్వాత లీటరు నీటికి 2.5 మిల్లీలీటర్ల 2,4-డీ సోడియం సాల్ట్ (ఫెర్నాక్సాన్, సాలిక్స్) చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు.
అలాగే పత్తి, మిరప, పసుపు, కంది, పెసర, మినుము, సోయాచిక్కుడు, బొబ్బర్లు, వేరుశనగ, ఆముదంతో పాటు కూరగాయ పంటలైన ఉల్లి, వెల్లుల్లి, బెండ, వంగ, క్యాబేజీ, కాలీఫ్లవర్, ధనియాలు, మెంతులు, ఆకుకూరలు, సొర, బీర, కాకర, గుమ్మడి, దోసలో గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల క్విజలాఫాప్-పి-ఇథైల్ (టర్గా సూపర్) లేదా 1.25 మిల్లీలీటర్ల ప్రొపాక్విజాఫాస్ (ఎజిల్) చొప్పున కలిపి పైరు మొక్కలు, కలుపు మొక్కలు మొలకెత్తిన 15-20 రోజుల మధ్య పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలు మొలకెత్తిన తర్వాత వాడే మెట్రిబుజిన్ (శంకర్) మందును లీటరు నీటికి 2.5-3 గ్రాముల చొప్పున (చెరకు, టమాటాలో 1.5 గ్రాములు) కలిపి 10-15 రోజుల లోపు పిచికారీ చేసుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పంటకు సిఫార్సు చేసిన మందును సరైన మోతాదులో, సరైన సమయంలో వాడాలి. కలుపు మందు పక్క పొలానికి ఏమైనా నష్టం కలిగిస్తుందేమో ముందుగానే తెలుసుకోవాలి. స్ప్రేయర్ నుంచి మందు సమానంగా పడేలా చూసుకోవాలి. కలుపు మందును ఒకసారి పిచికారీ చేసిన తర్వాత మళ్లీ వాడకూడదు. ఫ్లాట్ ఫ్యాన్/ఫ్లడ్ జెట్ నాజిల్‌ను ఉపయోగించాలి. ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, గాలి బాగా వీస్తున్నప్పుడు కలుపు మందు వాడకూడదు. కాబట్టి ఉదయం వేళల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడే పిచికారీ చేయడం మంచిది. గాలికి ఎదురుగా మందు పిచికారీ చేయకూడదు.
ఆహార, పశుగ్రాస పంటలపై కలుపు మందులు పిచికారీ చేసినప్పుడు సూచించిన కాలపరిమితి తర్వాతే పైర్లు కోయాలి. కలుపు మందును తేలికపాటి నేలలో తక్కువ మోతాదులో, సేంద్రియ పదార్థం-బంకమట్టి ఎక్కువగా ఉండే నల్లరేగడి నేలల్లో ఎక్కువ మోతాదులో, ఎర్ర నేలల్లో మధ్యస్థంగా వాడుకోవాలి. మందు పిచికారీ చేసిన తర్వాత 6-8 గంటల లోపు వర్షం వస్తే దాని ప్రభావం తగ్గుతుంది.
నీటిలో కరిగే పొడి మందును ఇసుకలో కలిపి వెదజల్లకూడదు. స్పష్టమైన సూచనలు లేనిదే కలుపు మందును పురుగు, తెగుళ్ల మందులతో కలపకూడదు. చేలో బాగా పదును ఉన్నప్పు డే మందులు వాడాలి. కలుపు మందును పిచికారీ చేసిన తర్వాత స్ప్రేయర్‌ను 3-4 సార్లు శుభ్రంగా కడగాలి. ఎప్పుడూ ఒకే కలుపు నివారణ మందును వాడకూడదు. అలా చేస్తే కలుపు మొక్కలు దానిని తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయి.