రోజుకో వంటకం
- పౌష్టికాహార పథకంలో మార్పులు
- 13 రకాల స్పెషల్స్‌తో మెనూ రెడీ
- జిల్లాకు మూడు స్కూళ్లలో అమలు
సాక్షి, చెన్నై: పౌష్టికాహార పథకంలో మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక విద్యార్థులకు రోజుకో వంటకంతో రుచి, సుచితో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. ప్రయోగాత్మకంగా జిల్లాకు మూడు పాఠశాలల్లో 13 రకాల స్పెషల్ డిష్ వడ్డించే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యాప్తి, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దివంగత మాజీ ముఖ్యమంత్రులు కామరాజర్, ఎంజీయార్ల హయాంలలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారినా ఈ పథకం మాత్రం నిర్విరామంగా కొనసాగుతోంది.
ప్రస్తుతం పౌష్టికాహార పథకం పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న 43 వేల పాఠశాలల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఈ పథకం ద్వారా సుమారు యాభై లక్షలకు పైగా విద్యార్థులకు ప్రతి రోజూ మధ్యాహ్నం వేళ అన్నం, సాంబారుతో పాటు ఉడకబెట్టిన గుడ్డును అందిస్తూ వస్తున్నారు. ఏళ్ల తరబడి అన్నం, సాంబారుతో మధ్యాహ్న భోజనం అందిస్తూ రావడంతో కొందరు విద్యార్థులు విముఖత చూపుతున్నారు. చేసిన అన్నం, సాంబారు వృథా అవుతున్నాయి.
పథకంలో మార్పు
మధ్యాహ్న భోజనం వృథా అవుతుండడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గుతుండటాన్ని విద్యా శాఖ పరిగణనలోకి తీసుకుంది. విద్యా వ్యాప్తి లక్ష్యంగా ఆంగ్ల తరగతులు, ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రత్యేక విద్యా విధానాలు ప్రభుత్వ స్కూళ్లల్లో అమల్లోకి వస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు వీటి మీద దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌష్టికాహార పథకం మెనూలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లను కేటాయించింది.
13 రకాలతో మెనూ సిద్ధం
ప్రతి రోజూ ఒకే తరహా వంటకాలు అందించడంకన్నా రోజుకో వంటకం రూపంలో పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావించారు. అలాగే స్వతహాగా తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులు ముందుకు వస్తారన్న ఆకాంక్షతో ఈ పథకం కోసం ప్రత్యేక మెనూను పౌష్టికాహార పథకం అధికారులు సిద్ధం చేశారు. ఇందుకోసం 13 రకాల డిష్‌తో పెద్ద మెనూ రెడీ అయ్యింది.
అన్నం, సాంబారు ఒక రోజు, మిగిలిన రోజుల్లో ప్రైడ్ రైస్, విజిటబుల్ బిరియాని, లెమన్ రైస్, పులి హోర, బిస్మిల్లా బాత్, పలావ్, కరివే పాకు రైస్, టామాట రైస్, కాయగూరలతో మిక్స్డ్ రైస్ వంటి వాటిని విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించారు. గుడ్డును ఒక్కో రోజు ఒక్కో విధంగా పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. ఒక రోజు బాయిల్ చేసిన గుడ్డును, మిగిలిన రోజుల్లో పెప్పర్ మిక్స్డ్ గుడ్డు, మసాల మిక్స్డ్ గుడ్డు, గుడ్డు పొడి మాసు తరహాలో అందించనున్నారు. వీటితో పాటు వారంలో రెండు లేదా మూడు రోజులు ఉల్లగడ్డ మసాల, చెన్నా మసాల, అలసందల మాసాలాల్ని సైడ్ డిష్‌లుగా ఇవ్వనున్నారు.
ప్రయోగాత్మకంగా అమల్లోకి
13 రకాల డిష్‌తో కూడిన మెనూలోని వంటకాల్ని సిద్ధం చేయడానికి పౌష్టికాహార సిబ్బందికి ప్రావీణ్యం లేదని చెప్పవచ్చు. చెన్నైలో ప్రముఖంగా ఉన్న నలుగురు చెప్లు, వారి సిబ్బంది సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌష్టికాహార సిబ్బందికి వంటకాల తయారీపై శిక్షణ ఇచ్చారు. అన్ని స్కూళ్లలో ఒకే రకంగా వంటకాల్లో నాణ్యత ప్రమాణాలు ఉండే విధంగా ఈ శిక్షణను పూర్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మెనూకు ఆమోద ముద్ర వేయడంతో ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వంటకాల రుచి అందించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు మూడు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ మెనూ అమల్లోకి వచ్చింది. సరికొత్త మెనూలోని వంటకాలను విద్యార్థులు ఆవురాావురంటూ ఆరగించడం కనిపించింది. ఆరోగ్యపరంగా దోహదపడే రీతిలో రుచి, సుచికర వంటకాలు మధ్యాహ్నం వేళల్లో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల ముంగిటకు త్వరలోనే వాలబోతున్నాయి.